( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆటపట్టించారు. వారిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. అనంతరం, మీడియ ఏదో అనుకుంటుంది అంటూ.. ఇరువురు నేతలు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి నేడు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అనంతరం, అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేఎల్పీ చాంబర్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ అటుగా వెళ్తుండగా.. రాజాసింగ్‌ను గమనించారు. దీంతో, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి బీజేఎల్పీలోకి ఎలా వెళ్లారు అంటూ నువ్వుతూ సెటైర్ వేశారు.
బీజేఎల్పీ నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్‌ను సరదాగా కేటీఆర్ ఆటపట్టించారు. ఇంతలో అక్కడే ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కల్పించుకుని.. సరదాగా మీరు కూడా బీజేఎల్పీ చాంబర్‌లోకి రండి అంటూ కేటీఆర్‌ను ఆహ్వానించారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. తాను బీజేఎల్పీ చాంబర్‌లోకి వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య సరదా సంభాషణ కొనసాగింది.
అనంతరం, బీజేఎల్పీలోకి వెళ్ళడంపై ఎమ్మెల్యే రాజసింగ్ స్పందిస్తూ..‘పాత ఇల్లు.. పాత ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోతాను.. ఎప్పుడైనా వస్తాను. పార్టీలో మళ్లీ చేరడంపై ఇంకా డిసైడ్ కాలేదు. ఎవరు ఎవరిని బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పార్టీ పక్షంవైపు కూర్చోవడం గమనార్హం. ఈ కమ్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కాలే యాదయ్యను బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. కానీ, కాలే యాదయ్య మాత్రం తాను కాంగ్రెస్ వైపే కూర్చుంటానని చెప్పుకొచ్చారు. ఇక, ఇటీవలే పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపుల విషయంలో క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.


