breaking news
Vijayawada Mayor
-
చంద్రబాబు ఫోటో ఎందుకు తీశారంటూ...
సాక్షి, విజయవాడ : నగర కార్పొరేషన్లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల రగడ తీవ్రస్థాయికి చేరింది. కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలను తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు అధికారులు. దీనిపై నగర మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడకుండా హాల్లో చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలు ఎందుకు తీశారంటూ అధికారులపై చిందులేశారు. ఎన్టీఆర్ ఫోటో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ ఫోటో పెడితే వైఎస్సార్ ఫోటో కూడా పెట్టాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇద్దరు మాజీ సీఎంలే కాబట్టి ఒద్దరివి పెట్టాలని మేయర్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. కార్పొరేషన్ తనదని, తాను చెప్పిందే చేయాలంటూ అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వార్నింగా.. ఊస్టింగా...!
అమరావతిబ్యూరో/భవానీపురం: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఉద్యోగుల ఆగ్రహానికి గురయ్యి వివాదంలో చిక్కుకున్న విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్‌కు అధిష్టానం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా? అందరి ఒత్తిడి మేరకు ఊస్టింగ్ చేస్తారా అన్నది ప్రస్తుతం నగర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఈ విషయంలో జోక్యం చేసుకుని రచ్చకెక్కిన మేయర్‌పై గత నాలుగు రోజుల నుంచి పత్రికల్లో వస్తున్న కథనాలపై అధిష్టానం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే జరుగుతున్న పరిణామాలపై నివేదిక ఇవ్వాలని పార్టీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్నకు ఆదేశించినట్లు తెలిసింది. మేయర్‌ను పదవి నుంచి తప్పించాల్సిందే... నోటి దురుసుతో అందరినీ బూతులు తిడుతున్న మేయర్ శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పించాల్సిందేనని స్వపక్ష కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. గతంలోకూడా అధిష్టానం ఆదేశాల మేరకు సర్దుకుపోయామని, ఇక తమవల్ల కాదంటున్నారు కార్పొరేటర్లు. మేయర్ వ్యవహారశైలితో ప్రతిపక్షంతోపాటు అధికారులు, ప్రజల మధ్య పార్టీ చులకనై పోతుందని, ఇప్పుడు కూడా వదిలేస్తే రానున్న ఎన్నికలలో ప్రభావం పడుతుందంటున్నారు. ఎవరెన్ని చెప్పినా ఆయన మారరని, పార్టీ ప్రతిష్ట కోసం ఆయన్ని మార్చడం ఒకటే మార్గమని కుండబద్దలు కొడుతున్నారు. అధిష్టానానికి కూడా వారు ఇదే సమాధానం చెబుతున్నారు. ఇటీవల ఇందిరాగాంధీ స్టేడియంలో షాపుల లీజు విషయమై వివాదం కూడా చోటుచేసుకుంది. ఇతర ప్రాంతాలలో ప్రభావం.. విజయవాడ మేయర్‌ను మారిస్తే ఆ ప్రభావం రా>ష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న అధికార పార్టీ మేయర్లపై పడుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల రెండేళ్లకు ఒకరు మేయర్‌గా ఉండాలన్న ఒప్పందాలు అమలుకాక పార్టీలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ శ్రీధర్‌ను మారిస్తే ఒప్పందాన్ని ఉల్లంఘించి కొనసాగుతున్న తమ మేయర్లను కూడా మార్చాలని, ఇతర ప్రాంతాలలోని ఆశావహులు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని భావిస్తుంది. మంత్రాంగం ఫలించేనా? వాస్తవానికి ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)ని మంగళవారం కలిసి తాడోపేడో తేల్చుకోవాలని అసమ్మతి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. అయితే మంగళవారం శివరాత్రి కావడం, ఆయన కూడా అందుబాటులో లేకపోవడంతో సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేసుకున్నారు. కార్పొరేటర్లతోపాటు మేయర్, ఎమ్మెల్సీ, నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న, మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలుకూడా పాల్గొననున్నట్లు తెలుస్తుంది -
‘ఏంటి.. కూర్చో’
విజయవాడ : మేయర్ అధికార దుర్వినియోగంపై ప్రశ్నించిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్పొరేటర్లపై పాలకపక్షం సస్పెన్షన్ వేటు వేసింది. శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షత వహించారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ మీకు (మేయర్) సభ నిర్వహించే అర్హత లేదన్నారు. కేఎంకే సంస్థలో మీ సతీమణి గౌరవ డెరైక్టర్‌గా ఉండగా పుష్కర కాంట్రాక్టులు నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు. పుణ్యశీలపై మాటల దాడి.. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ యాక్టును ఆమె చదువుతుండగానే మేయర్ ఒక్కసారిగా భగ్గుమన్నారు. అజెండాలో లేని అంశాలను ప్రస్తావించడానికి వీల్లేదన్నారు. ‘ఏంటి.. కూర్చో’ అంటూ పుణ్యశీలపై పరుష పదజాలం ఉపయోగించారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పోడియం వద్ద బైఠాయించారు. సభ నిర్వహించడానికి వీల్లేదని వైఎస్సార్ సీపీ సభ్యురాలు షేక్‌బీజాన్‌బీ నినాదాలు చేయడంతో మరింత ఆగ్రహానికి గురైన మేయర్ నువ్వేమైనా సుప్రీం కోర్టువా అంటూ గద్దించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ జి.హరిబాబు ఆ పార్టీ కార్పొరేటర్లు ఆతుకూరి రవికుమార్, జి.మహేష్ మేయర్‌కు మద్దతుగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో వాదనకు దిగారు. తీవ్ర అసహనానికి లోనైన మేయర్ మధ్యాహ్నం వరకు సస్పెండ్ చేస్తున్నానంటూ మార్షల్స్‌తో బలవంతంగా 15 మంది వైఎస్సార్ సీపీ సభ్యులను బయటికి గెంటేయించారు. పోలీస్ జులుం మేయర్ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్ బయట ధర్నాకు దిగారు. మేయర్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అధికారపార్టీ నాయకుల ఆదేశాల మేరకు పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడ మొహరించారు. కౌన్సిల్ బయట ఆందోళన చేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. దీనిపై పుణ్యశీల మాట్లాడుతూ మీరే (పోలీసులు) ఇక్కడకు రాకూడదన్నారు. చందన సురేష్ మాట్లాడుతూ కౌన్సిల్లో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా కౌన్సిల్‌హాల్ బయట ఆందోళనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని ఏమాత్రం పట్టించుకోని పోలీసులు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను అక్కడ నుంచి పంపేయడంతో ప్రజాఫిర్యాదుల కమిటీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. . మాక్ కౌన్సిల్.. మేయర్ తీరును నిరసిస్తూ మాక్ కౌన్సిల్ నిర్వహించారు. అందులో 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ మేయర్‌గా వ్యవహరించి కూర్చోండి.. సస్పెండ్ చేస్తున్నా అంటూ శ్రీధర్ తీరును అనుకరిస్తూ ఎండగట్టారు. కార్పొరేటర్ల ఆందోళన సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి కార్పొరేషన్‌కు చేరుకున్నారు. పార్టీ కార్పొరేటర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్మానం చేసిన వెంటనే కౌన్సిల్లో ఫోన్ వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించారు. కొద్దిసేపటికే మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ సెల్‌ఫోన్‌ను వినియోగించడం చర్చనీయాంశమైంది. అమరవీరులకు కౌన్సిల్ సంతాపం జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడిలో అమరులైన 18 మంది భారత యువ జవాన్లకు కౌన్సిల్ సంతాపం తెలిపింది. యూరి ప్రాంతంలో ముష్కరులైన పాక్ ఉగ్రవాదులు దొంగచాటుకు భారత సైనిక స్థావరాలపై దాడి చేయడాన్ని ఖండించింది. అమరవీరుల ఆత్మశాంతికై కౌన్సిల్ మౌనం పాటించింది. ఈవెంట్ కాంట్రాక్ట్ పుణ్యశీలదే.. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల భర్త నిబంధనలకు విరుద్ధంగా నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ నిర్వహించారని టీడీపీ ఫ్లోర్‌లీడర్ గుండారపు హరిబాబు ఆరోపించారు. ప్రజా ఫిర్యాదుల కమిటీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సంక్రాంతి సంబరాల సాంస్కృతిక కార్యక్రమాల కాంట్రాక్ట్ కింద రూ.2.60 లక్షల బిల్లులు చెల్లించినట్లు చెప్పుకొచ్చారు. అందులో కుమార్ ఈవెంట్స్‌కు సంబంధించి కేవలం రూ.67,500 మాత్రమే కొటేషన్ ఉంది. మిగితా బిల్లులు వేర్వేరు కంపెనీల పేర్లతో ఉండటం గమనార్హం. హరిబాబు విలేకర్ల సమావేశం పూర్తయిన వెంటనే టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ విలేకర్లతో మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల నిర్వహణలో కుమార్ ఈవెంట్స్‌కు సంబంధం లేదనడం కొసమెరుపు. అవినీతిని నిరుపిస్తే రాజీనామా చేస్తాం వైఎస్సార్ సీపీ సవాల్ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బీఎన్.పుణ్యశీల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు రుజువు చేస్తే తామంతా కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేస్తామని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ చందన సురేష్ సవాల్ చేశారు. పార్టీ కార్పొరేటర్లు చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. కేఎంకే సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా మేయర్ కోనేరు శ్రీధర్ అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. పుణ్యశీల అక్రమాలకు పాల్పడ్డట్లు రుజువులు తమవద్ద ఉన్నాయని చెబుతున్న టీడీపీ ఫ్లోర్ లీడర్ హరిబాబు వాటిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్పొరేటర్లు బి.సంధ్యారాణి, పాల ఝాన్సీలక్ష్మి, పళ్లెం రవికుమార్, ఆసిఫ్, జమల పూర్ణమ్మ, షేక్‌బీజాన్‌బీ, కె.దామోదర్, అవుతు శ్రీశైలజ, బుల్లా విజయ్ పాల్గొన్నారు. పంచాయతీలా నిర్వహించారు కౌన్సిల్‌ను మేయర్ పంచాయతీ సమావేశంలా నిర్వహిస్తున్నారు. అజెండాలో లేని అంశాలను చర్చిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ మేయర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష కార్పొరేటర్లను కించపర్చేలా మేయర్ వ్యవహరించడం సరికాదు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తరహాలో కౌన్సిల్లో శ్రీధర్ వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా సభను తూతూ మంత్రంగా వ్యవహరించడం సరికాదన్నారు. కొలుసు పార్థసారథి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు 88కే పై రగడ నగరపాలక సంస్థ టీడీపీలో గూడుకట్టుకున్న విభేదాలు భగ్గుమంటున్నాయి. 88కే అంశం ఆమోదం విషయమై మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావులు ఒకదశలో నువ్వేంతంటే నువ్వెంత అనుకున్నారు. పరిస్థితి చేయిదాటడంతో ఆ పార్టీ కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, ఆతుకూరి రవికుమార్‌లు సర్ధి చెప్పాల్సి వచ్చింది. అజెండాలో సెక్షన్ 88కే ప్రకారం కమిషనర్ జి.వీరపాండియన్ తొమ్మిది అదనపు అంశాలతో అజెండాను రూపొందించారు. అందులో ఆరు ఉద్యోగాలు, పాలనా పరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కాగా మిగిలినవి భూ వినియోగ మార్పిడికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. 88కే ప్రకారం ప్రతిపాదించిన అన్ని అంశాలను వచ్చే కౌన్సిల్‌కు వాయిదా వేయాలని మేయర్ నిర్ణయించారు. పారిశుధ్య కార్మికుల జీతాల చెల్లింపు అంశం చర్చిద్దామని పలువురు టీడీపీ సభ్యులు సూచించారు. ఎమ్మెల్సీ, నగర టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న 88 కే ప్రకారం కౌన్సిల్‌కు వచ్చే అంశాలను ఆమోదించవద్దని చెప్పారు కాబట్టి తాను ఆమోదించడం లేదని మేయర్ స్పష్టం చేశారు. భోజన విరామం కోసం సభను వాయిదా వేశారు. చాంబర్లోకి మేయర్ వెళ్లగా ఆయన వెంటే డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు వెళ్లారు. భవానీపురంలో 3.36 ఎకరాల భూమి వినియోగ మార్పిడి అంశం 88కేలో ఉందని కాబట్టి అన్ని అంశాలను ఆమోదించాలని డిప్యూటీ మేయర్ కోరారు. దీనికి మేయర్ ససేమిరా అన్నారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ఆరంభమైంది. ఎమ్మెల్సీతో చెప్పిస్తేనే 88కేపై చర్చిద్దామని మేయర్ కుండబద్ధలు కొట్టారు. గతంలో ఎమ్మెల్సీ చె బితేనే ఆమోదించారా అంటూ డిప్యూటీ మేయర్ వాదనకు దిగారు. ఒక దశలో తీవ్ర అసహనానికి లోనైన మేయర్ నేను ఆమోదించనయ్యా అంటూ గద్దించారు. దీంతో డిప్యూటీ మేయర్ రమణారావు అలిగి వెళ్లిపోయారు. కమిషనర్ సూచన మేరకు పాలనా పరమైన ఆరు అంశాలను మాత్రమే మేయర్ సభలో ఆమోదించారు. మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ మధ్య చోటుచేసుకున్న ఘటనపై కౌన్సిల్లో రసవత్తర చర్చ నడిచింది. పార్కులపై వాడీవేడి చర్చ నగరపాలక సంస్థ పార్కులపై వాడీవేడి చర్చ సాగింది. నగరంలో పార్కుల సంఖ్య, అభివృద్ధి వివరాలపై కో ఆప్షన్ సభ్యులు సిద్ధెం నాగేంద్రరెడ్డి ప్రశ్నించారు. 127 పార్కులు ఉన్నాయని అందులో 18 పార్కులను అభివృద్ధి చేయాల్సి ఉందని ఏడీహెచ్ ప్రదీప్‌కుమార్ తెలిపారు. గతంలో ఇదే ప్రశ్నకు 137 పార్కులు ఉన్నాయని ఎలా సమాధానం చెప్పారని, పార్కుల లెక్కలు మీ వద్ద పక్కాగా ఉన్నాయా లేదా అంటూ నాగేంద్రరెడ్డి ప్రశ్నించారు. కొత్త పార్కుల అభివృద్ధికి రూ.1.70 కోట్లు కేటాయించినప్పటికీ ఎందుకు ఖర్చు చేయలేదని మేయర్ ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ పార్కులు, కాలువ గట్ల, సెంట్రల్ డివైడర్ల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని త్వరలోనే పన్చుజీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాజీవ్‌గాంధీ పార్కుతో పాటు మరో 24 పార్కుల అభివృద్ధికి సంబంధించి టెండర్లు పిలిచామన్నారు. పార్కులపై పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కబ్జాకు గురవుతున్నాయన్నారు. రెండో డివిజన్లో పార్కును ఆక్రమించిన కొందరు తులసివనం అని బోర్డు పెట్టారన్నారు. స్ట్రీట్ ఫర్నీచర్ అమల్లో జరుగుతున్న జాప్యంపై పలువురు టీడీపీ సభ్యులు మండిపడ్డారు. సాధ్యమైనంత త్వరలో సర్వేను పూర్తి చేయాల్సిందిగా మేయర్ సూచించారు. పారిశుధ్య కార్మికులను పెంచండి పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంపుదల చేయాల్సిందిగా పలువురు సభ్యులు కోరారు.పారిశుధ్యం క్షీణిస్తోందని టీడీపీ సభ్యులు చెన్నుపాటి గాంధీ, గుర్రం కనకదుర్గ, జాస్తి సాంబశివరావు కోరారు. అనుమతించాల్సిందిగా ఆరు నెలల క్రితమే తాము ప్రభుత్వాన్ని కోరినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ తెలిపారు. నూరుశాతం యూజీడీ కనెక్షన్లు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి కనెక్షన్లను నూరుశాతం మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వివరించారు. పుష్కర విధుల్లో సేవలు అందించినందుకు గాను నగరపాలక సంస్థ తరుపున మేయర్, కార్పొరేటర్లకు కమిషనర్ జి.వీరపాండియన్ జ్ఞాపికలు, ప్రసంశాపత్రాలను అందించారు. -
వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్
విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన వెంటనే కృష్ణా పుష్కర పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అందుకు అధ్యక్ష స్థానంలో ఉన్న మేయర్ కోనేరు శ్రీధర్ ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు... మేయర్ పోడియం వద్దకు బైఠాయించారు. మేయర్ కోనేరు శ్రీధర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేయర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మేయర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మేయర్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ... కౌన్సిల్ హాల్లోనే వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
చాల్లే ఆపండి.. పార్టీ పరువు తీశారు
అసమ్మతి గ్రూపునకు చంద్రబాబు క్లాస్ శ్రీధర్‌ను మార్చే ప్రసక్తి లేదు స్వరం మారుస్తున్న కార్పొరేటర్లు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో ఉవ్వెత్తున ఎగసిన అసమ్మతి తుస్సుమంది. మేయర్ చైర్‌ను టార్గెట్ చేస్తూ అసమ్మతి వర్గం నడిపిన కథకు మహానాడు సాక్షిగా ఆ పార్టీ అధిష్టానం తెరదించింది. మీరు చేసిన అల్లరి వల్ల ఇప్పటికే పార్టీ పరువుపోయింది. మేయర్‌ను మార్చే ప్రసక్తే లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమ్మతి వర్గానికి క్లాస్ తీసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. చీటికిమాటికి గొడవలు పడితే జనంలో పల్చబడతామంటూ చీవాట్లు పెట్టినట్లు భోగట్టా. తాజా పరిణామాల నేపథ్యంలో కోనేరు శ్రీధర్‌ను మార్చాలంటూ సంతకాలు చేసిన కార్పొరేటర్లు స్వరం మారుస్తున్నారు. ఏదో తెలియక సంతకం చేశాం. మేము మీకు వ్యతిరేకం కాదంటూ మేయర్‌కు సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. శ్రీధర్‌దే పై చేయి మేయర్ చైర్ వార్‌లో శ్రీధర్‌దే పై చేయి అయింది. కౌన్సిల్లో 38 మంది సభ్యుల బలం టీడీపీకి ఉంది. వ్యూహాత్మకంగా పావులు కదిపిన అసమ్మతి వర్గం 23 మంది సంతకాలను సేకరించింది. ఒకదశలో శ్రీధర్ అవుట్ అన్న వాదనలు వినిపించాయి. డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు, ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబుతో పాటు మరో 13 మంది మేయర్ పక్షాన నిలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సైతం అసమ్మతి వర్గం కొమ్ము కాసింది. ఈ క్రమంలో అసమ్మతి వర్గం నెలవారీ మామూళ్లు ఇస్తామంటూ కార్పొరేటర్లకు ఎర వేయడాన్ని మేయర్ క్యాష్ చేసుకున్నారు. అసమ్మతి గ్రూపు వ్యవహరిస్తున్న తీరువల్ల పార్టీ అల్లరైపోతుందంటూ నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్ అధికారులు సైతం అసమ్మతి నేతల తీరుపై వ్యతిరేకంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇవన్నీ శ్రీధర్‌కు కలిసొచ్చిన పరిణామాలు. కొరవడిన ఐక్యత శ్రీధర్‌ను గద్దె దించాలని ప్లాన్ చేసిన అసమ్మతి గ్రూపులో ఐక్యత కొరవడింది. మేయర్‌చైర్ కోసం పోటీపడ్డ ముగ్గురు కార్పొరేటర్లు తలోదారి అవ్వడంతో సంతకాలు చేసిన కార్పొరేటర్లు సైతం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పార్టీలో గ్రూపు తగదాల కారణంగా విజయవాడలో మేయర్‌ను మారిస్తే ఇదే తరహాలో మిగతా కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు మార్పు కోరుకొనే అవకాశం ఉందని అధిష్టానం అంచనా కట్టినట్లు తెలుస్తోంది. మేయర్ చైర్ మార్చే అవకాశం లేదని తేల్చిన అధిష్టానం, డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లను ఇప్పట్లో మార్చమంటూ సంకేతాలు ఇచ్చినట్లు భోగట్టా. తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్ వర్గం హుషారు కాగా, అసమ్మతి గ్రూపు దిగాలు పడింది. -
సీఎం వద్దే డబ్బుల్లేవు.. మనకేం ఇస్తారు!
హైదరాబాద్ : ‘రాష్ట్ర ఖజానా నిండుకుండ అయితే ముఖ్యమంత్రిని నిధులు అడగొచ్చు. సీఎం వద్దే డబ్బుల్లేవు. కార్పొరేషన్‌కు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు’ అని నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. ఆయన నిన్న విలేకర్లతో మాట్లాడారు. కార్పొరేషన్లో అధికారులు జీవోలను సక్రమంగా అమలు చేస్తే ఎవర్నీ నిధులు కోసం అడగక్కర్లేదన్నారు. నగరపాలక సంస్థ రూ.350 కోట్ల అప్పుల్లో ఉందన్నారు. దీనిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని ప్రకటించారు. నగరానికి శనివారం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు. డంపింగ్ యార్డుకు స్థల సేకరణ, విజయవాడను గ్రేటర్ సిటీ చేయాలని, ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, అర్ధంతరంగా నిలిచిపోయిన జేఎన్ఎన్యూఆర్ఎం పనులకు నిధులు ఇవ్వాలని చంద్రబాబును కోరతామని వివరించారు. డంపింగ్‌యార్డుకు ఆగి రిపల్లి మండలంలో 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. స్థల కేటాయింపు విషయమై నూజివీడు సబ్ కలెక్టర్‌తో చర్చించామన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డు సమస్య పరిష్కారమవుతుందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాల వల్లే కార్పొరేషన్ దివాళా తీసిందని దుయ్యబట్టారు.