
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలకు ముందు ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఆశపెట్టి, నేడు ఆ పథకానికే మంగళం పాడేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ సిద్దమైందని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నామని పరోక్షంగా ప్రకటించడం ద్వారా మహిళలను మానసికంగా సిద్ధం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది మహిళలను నమ్మించి వంచించడానికి చంద్రబాబు మరోసారి సిద్దమయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోగా ఒక్కో పథకాన్ని ఎత్తేసే కుట్రలకు ప్రభుత్వం తెరదీస్తోంది. మోసపు హామీలిచ్చి మహిళల ఓట్లతో గెలిచిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వంచనకు గురిచేస్తున్నాయి. ఓట్ల కోసం మహిళలను నమ్మించేందుకు ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకొచ్చి ఫేక్ బాండ్లతో ప్రచారం చేసుకున్నారు.
..వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలను ఇస్తూనే సూపర్ సిక్స్ అమలు చేస్తామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ నమ్మబలికారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్పించి, వాటిని అమలు చేసే ఆలోచన లేదని తమ చర్యల ద్వారా మరోసారి స్పష్టం చేశారు. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తామని ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు.. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పథకం అమలు మీద దృష్టిసారించలేదు. ఒక్క ఆడబిడ్డ నిధి పథకం కింద 13 నెలలకు గాను దాదాపు రూ.36 వేల కోట్లకుపైగా మహిళలకు కూటమి ప్రభుత్వం బకాయి పడింది’’ అంటూ రాయన భాగ్యలక్ష్మి దుయ్యబట్టారు.
మళ్లీ మళ్లీ అదే వంచన:
'ఆడబిడ్డ నిధి' పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ని అమ్మేయాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా మాట్లాడించి సాంతం పథకానికే మంగళం పాడేసే కుట్ర చేస్తున్నారని అర్థమవుతుంది. రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాలో ఆడబిడ్డ నిధి పథకాన్ని పీ4తో అనుసంధానం చేస్తామని చెప్పి పథకాన్ని ఎత్తేయబోతున్నానని ఆ రోజే సంకేతాలు పంపారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడి చేత ఇవ్వడం లేదని మరోసారి స్పష్టం చేశారు. పథకాలు అమలు చేయబోవడం లేదని మహిళలను మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు.
గతంలోనూ 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో రూ.14,204 కోట్ల డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా మోసగించారు. దీంతో ఆ రుణాలు వడ్డీతో సహా రూ. 25,424 వేల కోట్లకు చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో 2,10,58,615 మంది మహిళలకి ఆసరా, చేయూత పథకాల ద్వారా రూ. 25,500 కోట్లు వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 కోట్ల మంది మహిళలు కూటమి ప్రభుత్వంలో వంచనకు గురయ్యారు.

ఉచిత బస్సు కూడా మోసమే:
అధికారంలోకి రాకముందు సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, గెలిచిన క్షణం నుంచి పథకలు ఇవ్వాలనే ఉంది కానీ గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పుకుంటూ ఏడాదిగా మోసం చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వం అప్పులంటూ మా వైఎస్సార్‌సీపీ మీద నెపం నెట్టాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మా ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ. 3.36 లక్షల కోట్లేనని ప్రజలకు నిజాలు తెలియడంతో వారి పప్పులు ఉండకడం లేదు.
ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్లు అప్పులు చేసినా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని చెప్పి, ఆగస్టు 15 నుంచి జిల్లాకే పరిమితం చేస్తామని చెప్పి మహిళలకు వెన్నుపోటు పొడిచారు. కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే మహిళల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ పార్టీలకు ఎందుకు ఓటేశామా అని తలలు పట్టుకుంటున్నారు’’ అని రాయన భాగ్యలక్ష్మి చెప్పుకొచ్చారు.