ప్రాథమిక పాఠశాలలకు సరిపడా ఉపాధ్యాయులు లేని వైనం విద్యార్థుల సంఖ్యను పెంచడంలో ప్రభుత్వం విఫలం పాఠశాలలను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారని పేదల ఆందోళన జి.కొండూరు మండలంలో ఒక పాఠశాల మూసివేత, మరో రెండింటికి ఎసరు?
విద్యార్థుల సంఖ్య పెంపునకు యత్నం
జి.కొండూరు: గత వైఎస్పార్ సీపీ ప్రభుత్వంలో కళకళలాడిన ప్రభుత్వ విద్యారంగం.. చంద్రబాబు పాలనలో నిర్వీర్యమవుతోంది. ‘నాడు–నేడు’తో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తే, చంద్రబాబు సర్కార్ గవర్నమెంట్ స్కూళ్లను ఒక్కొక్కటిగా మూసివేస్తూ ప్రయివేటు రంగానికి ఊతమిస్తోంది.
సరిపోనూ లేని ఉపాధ్యాయులు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో తరగతికి ఒక టీచర్ చొప్పున కేటాయించి, విద్యా నాణ్యతపై భరోసా కలిగించేలా ప్రచారం చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం ఆ పని చేయకుండా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో పాఠశాలలను నిర్వహించడంతో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. జి.కొండూరు మండల పరిధిలో మొత్తం 33 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2025–26 విద్యా సంవత్సరానికి బాలురు 1,352, బాలికలు 1,308 మంది కలిపి 2,660 మాత్రమే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ సంఖ్య 3,500కి పైగా ఉండేది. వీటిలో 23 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కోడూరు, వెల్లటూరు, వెలగలేరు, కవులూరు, కట్టుబడిపాలెం, గంగినేని, చెర్వుమాధవరం, గడ్డమణుగు, జి.కొండూరు, చెవుటూరు, కుంటముక్కల గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను మాత్రమే మోడల్ ప్రైమరీలుగా మార్చారు. ఒక్కొక్క పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయించారు. మిగిలిన 11ప్రాథమిక పాఠశాలలను బేసిక్ ప్రైమరీలుగా మార్చి ఇక్కడ కూడా ఐదు తరగతులు ఉన్నా పాఠశాలకు ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే ఉపాధ్యాయులను కేటాయించారు. చంద్రబాబు సర్కార్ వెల్లటూరులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోయిందనే నెపంతో ఇటీవల స్కూల్‌ను మూసివేసింది. దీనిలో గత విద్యాసంవత్సరంలో పది మంది వరకు విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు జి.కొండూరు శివారు గొల్లగూడెం, పినపాక శివారు విద్యానగరం ప్రాథమిక పాఠశాలలను సైతం వచ్చే విద్యా సంవత్సరానికి మూసేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారని తెలిసి ఆయా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
తరగతులను మెర్జ్ చేయడంతో సమస్య
జి.కొండూరు పంచాయతీలోని గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతులను ఎక్కడా లేని విధంగా జి.కొండూరు జెడ్పీ హైస్కూల్లో మెర్జ్ చేసి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడుని కేటాయించి దీన్ని ఫౌండేషన్ పాఠశాలగా మార్చారు. దీనితో ఈ స్కూల్లోవిద్యార్థుల సంఖ్య ముగ్గురికి పడిపోయింది. వచ్చే ఏడాది ముగ్గురు కూడా ఉండే అవకాశం లేకపోవడంతో ఈ పాఠశాలను మూసేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద ఈ పాఠశాలను ఆధునికీకరించారు.
ఈ పాఠశాలను మూసి వేసి జెడ్పీ హైస్కూల్లో తరగతులను కలపడంతో తమ పిల్లలు రోజూ కిలోమీటరుపైగా నడిచి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు తమ గ్రామంలోనే ఉంటే విద్యార్థుల సంఖ్య పెరిగి, పిల్లలు నడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. జి.కొండూరుకు, గొల్లగూడెంకు మద్యలో పులివాగు కూడా ఉండటంతో వానాకాలంలో పిల్లలు వంతెన దాటి వెళ్లడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు.
గొల్లగూడెం ఫౌండేషన్ పాఠశాలను తొలగిస్తామనే అపోహ వద్దు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలను ఒకటవ తరగతిలో ఫౌండేషన్ స్కూల్లో చేర్చేలా అవగాహన కల్పిస్తున్నాం. పినపాక పాఠశాల బేసిక్ ప్రైమరీగా కొనసాగుతుండటంతో మూసివేయడం జరగదు. –వీరాస్వామి,
మండల విద్యాశాఖ అధికారి, జి.కొండూరు


