
‘‘ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు..’’ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న కూటమి సర్కారు నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్య.
‘‘వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత ఉండవచ్చు.. వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే ఆగిపోయాయి’’ - ఏపీ హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం.
తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సహజంగానే హైకోర్టు వ్యాఖ్యలను పతాక శీర్షికలుగా చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించడానికి వెళుతున్న రోజే ఎల్లో మీడియాలో ఈ కథనం వచ్చింది. జగన్ పర్యటనకు వచ్చిన స్పందన చూసిన తర్వాత జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం కాదు. ఆంక్షలతో అడ్డుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్ననా, జనం మాత్రం తరలి సంద్రంలా తరలి వచ్చారు. వర్షం జోరున కురుస్తున్నా ప్రజలు జగన్‌తో సమస్యలు విన్నవించడానికి తండోపతండాలుగా వచ్చారు. అరవై కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి ఆరు గంటలు పట్టిందంటేనే జన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ జనాన్ని చూసి కూటమి పార్టీల నేతలకు మతిపోయి ఉండాలి. ప్రజలు ప్రైవేటీకరణపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమై ఉండాలి. కొద్దిరోజుల క్రితం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడ? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవో ఎక్కడ అని అడిగారు. తన ప్రాంతంలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి కూడా అయ్యన్న ఆ వ్యాఖ్య చేయడాన్ని వైసీపీ సవాల్ గా తీసుకుంది. జగన్ గతంలో చెప్పిన విధంగా తన హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల సందర్శనకు ఇది ఒక అవకాశంగా మారింది. తదుపరి ఆయన నర్సీపట్నం టూర్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగానే జగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు ఎలా తీసుకొచ్చింది వివరించారు. భవన నిర్మాణాలకు తీసుకున్న చర్యలతోపాటు జారీ చేసిన జీవోలను కూడా చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను టీడీనే తెచ్చిందని అనంతపురంలో ప్రకటించి భంగపడితే జీవోలు ఎక్కడని అడిగి స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభాసుపాలయ్యారని జనమిప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు.
గౌరవ న్యాయస్థానం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నడిపే ప్రతిపాదనపై అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. అయితే ఆ మీడియాలోనే ఆ రోజు వచ్చిన వార్తలే న్యాయమూర్తుల సందేహాన్ని తీర్చే విధంగా ఉన్నాయన్న విశ్లేషణలు వచ్చాయి. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని రాజధాని అభివృద్ది సంస్థ (సీఆర్డీయే) సమావేశంలో నిర్ణయించారన్నది ఆ వార్త సారాంశం. మూడు నెలల్లో రాజధానికి ఒక రూపు తీసుకు రావాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో చెప్పినట్లు కూడా రాశారు. అమరావతిలో రూ.104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనం నిర్మాణానికి సీఆర్డీయే నిర్ణయం అన్నది ఎల్లో మీడియా ఇచ్చిన ఇంకో వార్త. ప్రధాన రోడ్లకు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేయడానికి ప్రభుత్వం పాలన అనుమతులు ఇచ్చింది.
గోదావరి- బనకచర్ల స్కీమును రూ.81 వేల కోట్లతో చేపట్టే విషయంలో ముందుకే వెళ్లాలని, డీపీఆర్‌లు సిద్దం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు మరో కథనం. ఇంతకన్నా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ప్రభుత్వం రూ.257 కోట్లు వ్యయం చేసి జీ+ 7 అంతస్తుల సీఆర్డీయే కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి భవనాలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్న కూటమి సర్కార్ పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం విషయానికి వచ్చేసరికి డబ్బులు లేకుండా పోయాయా? అన్న సాధారణ పౌరుల ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు.
గౌరవ న్యాయస్థానం కోర్టుల నిర్మాణం కూడా ఆగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అంటే కోర్టుల కన్నా కూడా రాజధానిలో తాము అనుకున్న విలాసవంత భవనాలే ముఖ్యమని ప్రభుత్వ అధినేతలు భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది కదా! ఈ తరహా వ్యాఖ్య కోర్టు జగన్ ప్రభుత్వ టైమ్‌లో చేసి ఉంటే ప్రభుత్వం దివాళా తీసిందని, కోర్టుల భవనాలను కూడా నిర్మించ లేకపోతోందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. కాని ఇప్పుడు మాత్రం కోర్టు భవనాలకే డబ్బు లేనప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే పీపీపీ మోడల్‌లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నట్లు జనాన్ని మభ్య పెట్టాలని యత్నిస్తోంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.ఐదు వేల కోట్ల వనరులు లేకపోతే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి?
వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అన్ని సీట్లు మెరిట్ బేసిస్ మీదే కేటాయించాలని, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఎన్నారైలకు ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు, లోకేశ్‌లు ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో సీటును ఏకంగా రూ.57 లక్షలకు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవచ్చా అన్న సంశయం కోర్టుకు ఉండవచ్చు. ఇది కేవలం విధానానికి సంబంధించిందే కాదు. వందల కోట్ల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలను అప్పగించేస్తారు. ఎకరా వంద రూపాయల లీజుకే ఇచ్చేయబోతున్నారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటయ్యే వైద్యశాలల్లో కూడా అన్ని సేవలు పేదలకు ఉచితంగా లభించే అవకాశం తక్కువే. ఒకవేళ ఇచ్చినా, వాటికి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది. ఇలా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
వీటన్నిటి మీద కోర్టులో వాద, ప్రతివాదాలు జరుగుతాయో లేదో తెలియదు. కోర్టు వారు ఎలాంటి తీర్పు ఇచ్చినా, రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ఈ టెండర్లు ఖరారు కాకుండా స్టే ఇవ్వలేమని కోర్టు పేర్కొనడం గమనించదగ్గ విశేషమే. మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించినా, తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ లోగా ప్రైవేటికరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని వైసీపీ ఆరంభించింది. ఈ రకంగా ప్రజల మనోగతాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలొ వైసీపీతో సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తగు పాత్ర పోషిస్తాయి.
అందువల్ల కోర్టు ప్రభుత్వ చర్యలకు ఆమోదం తెలిపినా, తెలపకపోయినా, దానితో నిమిత్తం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తమ విధానం ప్రకారం ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి. జగన్ వ్యాఖ్యానించినట్లు ఆధునిక దేవాలయాల వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మడం న్యాయం కాదని ప్రజలు భావిస్తున్నారు . జగన్ టూర్ కు జనం రాకుండా చూడడంలో పోలీసులు విఫలమయ్యారని, మంత్రులు సరిగా స్పందించ లేకపోతున్నారని.. చంద్రబాబు అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి. దానిని బట్టే జగన్ టూర్ సక్సెస్ అయిందని చంద్రబాబుతో సహా కూటమి నేతలంతా పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లే!.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత