
సాక్షి, కృష్ణా: మచిలీపట్నం పోలీసులకు బిగ్ షాక్ తగిలింది. నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్న అక్రమ అరెస్టును కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో రిమాండ్‌ను తిరస్కరించిన పీడీఎం కోర్టు న్యాయమూర్తి.. ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది.
మరోవైపు.. సుబ్బన్న అక్రమ అరెస్ట్ నేపథ్యంలో పీఎస్‌కు వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని సీఐ ఏసుబాసుపై బెదిరింపులకు దిగారనే ప్రచారం నడిచింది. దీంతో కేసు పెడతామంటూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రకటించారు. అయితే జరిగింది ఏంటో తెలుసుకోవాలని ఎస్పీని పేర్ని నాని కోరుతున్నారు.
‘‘కృష్ణాజిల్లా ఎస్పీ పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలి. కింద అధికారులు చెప్పిందే నమ్మి ఎస్పీ మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్‌లో సీసీఫుటేజీ చూసి మాట్లాడాలి. పీఎస్‌కు వెళ్లిన తన భర్త ఇంటికి రాకపోవడంతో మేకల సుబ్బన్న భార్య నాకు ఫోన్ చేసి ఆందోళన చెందింది. మా పార్టీ నాయకుడి కోసమే నేను స్టేషన్ కు వెళ్లా. మేమేమీ స్టేషన్ పైకి దొమ్మీకి వెళ్లలేదు..
.. మేకల సుబ్బన్నను ఎందుకు తీసుకొచ్చారని సీఐని అడిగా. మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేం ఎవరినైనా తీసుకురావొచ్చని సిఐ చెప్పారు. నేను మేకల సుబ్బన్నను విడిపించుకుని వెళతానని చెప్పలేదు. నా పై మీ సిబ్బంది చెప్పినవన్నీ అవాస్తవాలు. మేం పోలీసులకు వ్యతిరేకం కాదు. మీకింద పనిచేస్తున్న అధికారులు మా పై చెడుగా చెప్తున్నారు..
పోలీసు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని కక్షసాధింపు చేస్తే ప్రశ్నిస్తే తప్పేంటి?. రెండున్నరేళ్ల క్రితం ఓ దళిత యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ దళిత యువకుడిని పది రోజుల పాటు జైల్లో పెట్టారు. మా నాయకులను తమాషాలు చేస్తారా? అని సీఐ మాట్లాడారు. అలా ఎందుకు మాట్లాడారని మాత్రమే సీఐని నిలదీశాం..
.. ఏడాదిన్నర నుంచి సీఐ ఏకపక్షంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్ కు వెళ్లిన మమ్మల్ని అవమానకరంగా మాట్లాడారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఆత్మగౌరవాన్ని చంపుకుని బ్రతకలేం. పోలీస్ స్టేషన్ లో పోలీసులు నోటికొచ్చినట్లు తూలనాడితే నోరుమూసుకుని కూర్చోమని ఏ చట్టం చెబుతోంది?..

చెప్పుడు మాటలు వినొద్దు... వాస్తవాలు తెలుసుకోవాలని ఎస్పీని కోరుతున్నా. నా పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. మీరు కేసు పెడతామంటే పెట్టండి నేను కాదనను. నేనేమీ నేరాలు.. ఖూనీలు చేయలేదు. నన్ను అవమానిస్తే కచ్చితంగా తిరగబడతా. మీ సీఐ మమ్మల్ని అవమానించినా మేం ప్రశ్నించడం నేరమైతే మీరు తీసుకునే చర్యలను ఎదుర్కోవడానికి మేం సిద్ధం. 2014-19లో కూడా నా పై అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టారు. 365 రోజులు సెక్షన్ 30 అమల్లో ఉంటే ప్రజలు తమ నిరసన ఎలా తెలియజేస్తారు?.. అని పేర్ని నాని ఎస్పీని ఉద్దేశించి ప్రశ్నించారు.