పద్మసరోవరంలో ఉద్భవించిన అలవేలు మంగ పంచమితీర్థం భక్తజనప్రవాహంతో నిండింది. తిరుచానూరులోని పద్మసరోవరం(పుష్కరిణి)లో మంగళవారం పద్మావతీ అమ్మవారి పంచమీతీర్థం(చక్రస్నానం) అత్యంత వైభవంగా జరిగింది.
తొలుత గజరాజుపై తిరుమల నుంచి తీసుకొచ్చిన సారెతోపాటు ఈ ఏడాది అమ్మవారికి రూ.1.31 కోట్ల విలువైన 1.14 కిలోల బరువు గల బంగారు కమలహారం, వజ్రాల అడ్డిగను అమ్మవారికి పుట్టినరోజు కానుకగా అందజేశారు.
అభిషేకంద్రవ్యాలతో అమ్మవారికి, చక్రత్తాళ్వారుకు వేడుకగా స్నపన తిరుమంజనం చేశారు.
అనంతరం పద్మపుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఈ మధుర క్షణం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన భక్తజనం ఒక్కసారిగా పులకించి.. గోవింద నామస్మరణలు చేస్తూ పుణ్యస్నానాలు చేస్తూ తడిసి తరించారు.


