నలుగురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
గోరంట్ల గిరిజన గురుకుల పాఠశాలలో ఘటన
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలో దైన్యం
పర్యవేక్షణను గాలికొదిలేసిన అధికారులు
గోరంట్ల: నాసిరకం కూరగాయలు, పురుగుల బియ్యం, తిరుగుతూ పారాడుతున్న ఎలుకలు, వాలుతున్న ఈగలు... చంద్రబాబు సర్కార్ పర్యవేక్షణ లోపం.. గిరిజన సంక్షేమ అధికారుల నిర్లక్ష్యం... బీసీ సంక్షేమ శాఖ మంత్రి సొంత ఇలాకాలో గిరిజన గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినుల ప్రాణాల మీదకు తెస్తోంది. నాణ్యత లేని సరుకులతో వండిన భోజనం తిని మంగళవారం రాత్రి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఇక్కడ పదో తరగతి వరకు 400 మంది చదువుతున్నారు. ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ ఇటీవల బదిలీ కాగా, హిందూపురం ప్రిన్సిపాల్ తులసికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. కొంతకాలంగా రెగ్యులర్ వంట మనిషి లేరు. నైట్ వాచ్ ఉమెన్ వంట చేస్తున్నారు. నిర్వహణ సరిగా లేక శిథిలావస్థలోని వంట గది దుర్వాసన వస్తోంది. అపరిశుభ్రత తాండవిస్తోంది. అయినా, నాసిరకం పదార్థాలతోనే వంట వండి విద్యార్థులకు పెడుతున్నారు.
మంగళవారం రాత్రి భోజనం చేసిన అనంతరం వైష్ణవి (9వ తరగతి), వైష్ణవి (10వ తరగతి), భానుప్రియ (6వ తరగతి), జాహ్నవి (8వ తరగతి) వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వైస్ ప్రిన్సిపాల్ చంద్రకళ సమాచారం ఇవ్వడంతో ఏఎన్‌ఎం వచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. అయినా తగ్గకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పురుగుల అన్నం.. కుళ్లిన కూరగాయాలతో వండుతున్న ఆహారంపై గతంలోనే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా అధికారుల్లో చలనం రాలేదు. పదుల సంఖ్యలో విద్యార్థినులు విషజ్వరాల బారిన పడ్డారు.
హాస్టల్ అన్నంలో పురుగులు
ప్రత్తిపాడు: ‘‘అన్నంలో పురుగులు వస్తున్నాయి. తింటే వాంతులవుతున్నాయి. అదేమని అడిగితే మమ్మల్ని హాస్టల్ నుంచి వెళ్లమంటున్నారు’’ అంటూ హాస్టల్ విద్యార్థినులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన కుంచాల నాగమణి మూడేళ్లుగా ఫిరంగిపురంలో నివాసం ఉంటుంది. ఆమె తన కుమార్తెలు కుంచాల అఖిల (6వ తరగతి), కుంచాల అక్షయ (5వ తరగతి)లను ఈ ఏడాది ప్రత్తిపాడు ఎస్సీ బాలికల వసతి గృహంలో చేరి్పంచింది.
కొద్దిరోజుల కిందట హాస్టల్‌లో పెట్టిన భోజనంలో పురుగులు రావడంతో అఖిల వాంతులు చేసుకుంది. దీంతో ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తోటి పిల్లలు కూడా కొడుతున్నారని, వచ్చి తీసుకుని వెళ్లాలని ఫోన్‌లో రోదించింది. దీంతో ఆదివారం తల్లి నాగమణి హాస్టల్‌కు వచ్చి అఖిలను ఇంటికి తీసుకువెళ్ళింది. తిరిగి మంగళవారం హాస్టల్‌కు వచ్చింది. ‘‘మీ పాపను హాస్టల్లో చేర్చుకోం.. మీతో తీసుకువెళ్లిపోండి. మీ పిల్ల వల్ల మిగిలిన వారు ఇబ్బంది పడుతున్నారు. మీ పాప ఆరోగ్యం సరిగా లేదు. మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని వస్తేనే చేర్చుకుంటా.’ అంటూ వార్డెన్ నాగమణికి చెప్పింది.
స్టేషన్ మెట్లు ఎక్కిన హాస్టల్ విద్యార్థినులు
దీంతో ఏమి చేయాలో పాలుపోని నాగమణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఎస్‌ఐ నరహరి ఎదుట వాపోయింది. మిగిలిన పిల్లలు మమ్మల్ని కొడుతున్నారని, మా పుస్తకాలను లాక్కుని బయట పడేస్తున్నారని ఎస్‌ఐకి పిల్లలు వివరించారు.
హాస్టల్లో డీడీ విచారణ..
హాస్టల్ విద్యార్థినులు స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటన జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ యు.చెన్నయ్య దృష్టికి వెళ్లడంతో ఆయన రాత్రి హాస్టల్‌కు చేరుకున్నారు. భోజనం, సదుపాయాలను పరిశీలించారు. బాధిత విద్యార్థినులతోపాటు మిగిలిన విద్యార్థినులతో మాట్లాడారు. బాధిత విద్యార్థినులు డీడీ చెన్నయ్య ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం డీడీ మీడియాతో మాట్లాడుతూ.. హాస్టల్‌లో ఉన్న బియ్యాన్ని మారుస్తామన్నారు.


