పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన అశేష అభిమానులకు అభివాదం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమైన మాజీ సీఎం వైఎస్ జగన్
జై జగన్ నినాదాలతో మార్మోగిన క్యాంపు కార్యాలయం
జననేతను కలిసేందుకు కదిలి వచ్చిన జన సందోహం
వైఎస్ జగన్‌ను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
సాక్షి కడప: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రధానంగా కార్యకర్తల కష్టసుఖాలు అడుగుతూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల వెతలు వింటూ నేనున్నానని.. మీకేం కాదని భరోసా ఇచ్చారు.
ధైర్యంగా ముందుకు పోవడమే ఆలస్యమని.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, మంచి కాలం ముందు ఉందంటూ వివరించారు. ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి బాధలు విన్న ఆయన అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. కొన్నింటికి సంబంధించి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో మాట్లాడుతూ మార్గం చూపారు.
కష్టాలు వింటూ.. అక్కున చేర్చుకుంటూ..
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మాట్లాడారు. తర్వాత కూడా ఇంటి వద్ద వేచి ఉన్న ముఖ్యమైన నాయకులతోనూ చర్చించారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు.
తెలిసిన ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించడమే కాకుండా కష్ట, సుఖాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేనున్నానని.. ఏదైనా సమస్యలున్నా పార్టీ అండగా ఉంటుందని వివరించారు. కొంతమంది దివ్యాంగులు, యువత ఆయనను అభిమానంగా వచ్చి కలుసుకున్నారు. వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూనే మరోవైపు ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడుతూ వచ్చారు. 
దివ్యాంగురాలితో ఆప్యాయంగా వైఎస్ జగన్
గిట్టుబాటు లేదు.. ధర రాదు..
పులివెందుల నియోజకవర్గానికి చెందిన రైతు శంకర్‌తో పాటు మరికొంతమంది వివిధ పంటలు సాగు చేసిన రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ప్రస్తుతం అరటి పంటతోపాటు ఇతర అనేక రకాల పంటలకు గిట్టుబాటు ధర లేదు.. బయట మార్కెట్‌లో ధర రాదు.. పండించిన పంటను ఎలా అమ్ముకోవాలి, ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌లో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయని.. వారు వైఎస్ జగన్‌కు వివరించారు.
అలాగే మీ ప్రభుత్వంలో రైతులు పండించే పంటలకు మంచి గిట్టుబాటు ధర ఉండేదని, సకాలంలో పెట్టుబడి సాయం, ఇన్సూరెన్స్, పరిహారాలు అందుతుండటంతో రైతులు సుభిక్షంగా ఉండేవారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులు కష్టాలు కడగండ్లతో కాలం వెల్లదీస్తున్నారని, ప్రభుత్వం మొద్దునిద్ర వీడేలా రైతుల తరపున అండగా ఉండాలని కోరారు. 
ప్రజల వినతులు పరిశీలిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పక్కన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
కార్యాలయం వద్ద జనమే జనం..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులకు వస్తున్నారని తెలుసుకున్న జనాలు భారీగా తరలి వచ్చారు. పార్టీ అభిమానులు, క్యాడర్‌తోపాటు యువత, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. ఒక దశలో పోలీసులకు కూడా అదుపు చేయడం కష్టంగా మారింది. కార్యాలయ ప్రాంగణమంతా జగన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో పోటెత్తింది. వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తింది. జగన్‌ను చూడగానే ఉప్పొంగిన అభిమానంతో జై జగన్ నినాదాలతోపాటు సీఎం, సీఎం అంటూ నినదించారు. 
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు..
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి చర్చించారు. 
ప్రధానంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాయచోటి, రైల్వేకోడూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సు«దీర్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, కదిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మగ్బూల్ బాషా, వైఎస్సార్‌సీపీ నేతలు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జి చవ్వా దుష్యంత్‌రెడ్డిలతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. అలాగే విజయవాడ, నల్గొండ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నాయకులు కలిశారు.


