 
													మన దేశంలో కొన్ని కేసులు ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతూనే ఉంటాయి. కింద కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా..పైకోర్టులో సవాలు వేయడంతో కొన్నేళ్లుగా ఆ కేసులు ఓ కొలిక్కి రాకుండా ఉండిపోతాయి. ఈ క్రమంలో క్లయింట్‌లు చనిపోతే ఇక ఆ కేసు కోసం సంబంధిత బాధితులు ఏళ్లుగా నిరీక్షించి పోరాడితే గానీ న్యాయం జరగదు. ఈ పెండింగ్ కేసులు దేశం మొత్తంగా చాలానే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే..40 ఏళ్ల నాటి లంచం కేసు.. బాధితుడి చనిపోయిన కొన్నేళ్లకు క్లీన్ చీట్ లభించడం విశేషం. అత్యున్నత న్యాయస్థానం అతడి గౌరవాన్ని పునరుద్ధరించి.. పెన్షన్‌తో సహా తత్సంబంధిత ద్రవ్యప్రయోజనాలను చట్టపరమైన వారసులకు ఇవ్వాల్సిందిగా అదేశించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..దాదార్ నాగ్‌పూర ఎక్స్‌ప్రెస్‌లో టీటీఈగా పనిచేసిన వీఎం సౌదాగర్ 1988లో ప్రయాణికుల నుంచి రూ. 50ల లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. శాఖపరమైన విచారణ అనంతరం 1996లో సర్వీస్ నుంచి తొలగించారు. ప్రస్తుతం సదరు బాధితుడు బతికి లేకపోయినప్పటికీ..అతడి కుటుంబసభ్యులు న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. నిజానికి ట్రిబ్యూనల్ కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టులో సవాలు వేయండంతో..ఆ తీర్పు నిలిచిపోయింది. అప్పటి నుంచి ఆ కేసు..అలా పెండింగ్‌లోనే ఉండిపోయింది.
గత సోమవారం అత్యున్నత న్యాయస్థానం సదరు బాధితులకు ఊరట లభించేలా చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బాధితుడిపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అతడి గౌరవాన్ని పునరుద్ధరించి పెన్షన్‌తో సహా అన్ని ద్రవ్య ప్రయోజనాలను మూడు నెలల్లోపు అతని చట్టపరమైన వారసులకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
ఈ వివాదం ఎలా వచ్చిందంటే..
ఈ వివాదం మే 31, 1988 నాటిది. సౌదాగర్ ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ. 50 డిమాండ్ చేశాడని, వారిలో ఒకరికి ఛార్జీలో బ్యాలెన్స్‌లో రూ.18 తిరిగి ఇవ్వలేదని రైల్వే విజిలెన్స్ బృందం ఆరోపించింది. దీని ఆధారంగా డిపార్ట్‌మెంట్ విచారణ ప్రారంభించి..ఎనిమిదేళ్ల తర్వాత 1996లో సౌదాగర్‌ను సర్వీస్ నుంచి తొలగించారు. 
అయితే ఈ కేసులో కచ్చితమైన ఆధారాలు లేవని, విజిలెన్స్ బృందం గట్టి సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైంది. ప్రయాణికుల సాక్ష్యాలు లంచం తీసుకున్నారనే ఆరోపణకు మద్దతు ఇవ్వలేదు. అంతేగాదు ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు ఆయన ఎలాంటి డబ్బులు కోరలేదని, మిగతా కోచ్‌లను కూడా పర్యవేక్షించాక, రసీదు జారీ చేసి, మిగిలిన ఛార్జీని తిరిగి ఇస్తానని స్పష్టంగా చెప్పారు.
దీంతో2002లో, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కేసును పరిశీలించి, సౌదాగర్‌ను తిరిగి నియమించాలని భారత రైల్వేలను ఆదేశించింది. అలాగే అధికారులు సమర్పించిన ఆధారాలేవి అతని తొలగింపుని సమర్థించలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే నాటి ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి బదులు..బాంబే హైకోర్టులో ట్రిబ్యునల్ ఉత్తర్వుని సవాలు చేయండంతో కోర్టు తీర్పుని నిలిపివేసింది. దాంతో అతని నియమకానికి అన్ని విధాలుగా తలుపులు మూసుకుపోయాయి. కానీ అతడి కుటుంబం ఆశ వదులు కోలేదు, ఎప్పటికైన న్యాయం లభిస్తుందని పోరాటం కొనసాగించింది.
చివరికి 44 ఏళ్ల తర్వాత ఉపశమనం..
దశాబ్దాల నాటి కేసుని సమీక్షించిన ధర్మాసనం సౌదాగర్‌పై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని తేల్చింది. విచారణ అధికారి విషయాలను వక్రీకరించారని, తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని పేర్కొంది సుప్రీం కోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సర్వీస్ ఇచ్చిన తీర్పు సరైనదేనని,  విచారణ అధికారి చెబుతున్న ఆధారాలు సాక్ష్యుల మాటలతో ఏకభవించలేదని, అందువల్ల తొలగింపు శిక్షను రద్దు చేసే హక్కు ట్రిబ్యునల్‌కి ఉందని హైకోర్టు గుర్తించడంలో విఫలమైందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  
అదీగాక ఎలాంటి అధారాలు లేకుండా ఒక చనిపోయిన వ్యక్తి పేరు అవినీతి ఆరోపణలతో కళంకితమైందని మండిపడింది. అందువల్ల ఆయన గౌరవాన్ని పునరుద్ధరించేలా ఇలా సుప్రీం కోర్టు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చింది. ఏదీఏమైనా ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఉపశమనం లభించడం బాధకరం. చనిపోయేంత వరకు ఎంత మనోవేదన అనుభవించి ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కేసుల్లోని అలసత్వం..బాధితులు చనిపోయేంత వరకు న్యాయం లభించకపోవడం అనేది గమనార్హం, బాధకరం కూడా.
(చదవండి: చెత్త వేశారో.. మీచెంతకే 'రిటర్న్ గిఫ్ట్'! స్ట్రాంగ్ క్లీనింగ్ పాఠం)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
