 
													పరిశుభ్రత గురించి ఎంతలా అవగాహాన కార్యక్రమాలు చేపట్టినా..మార్పు మాత్రం శూన్యం. స్వచ్ఛభారత్ అంటున్న..చెత్త, అపరిశుభ్రత తాండవిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో బెంగళూరు నగరవాసులకు గట్టి పాఠమే చెప్పనుంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ. చాలా వినూత్నమైన రీతీలో తగిన గుణపాఠం చెబుతోంది. చెప్పినా..వినకపోతే ఈ శాస్తి తప్పదని గట్టిగానే హెచ్చరిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం దీన్ని వింతైన చర్యగా అభివర్ణించడమే కాదు..ఈ పనిష్మెంట్ హాట్‌టాపిక్‌గా మారింది.
విననివాళ్లకు అదే 'రిటర్న్ గిఫ్ట్'..
ఈ మేరకు బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్(బీఎస్‌డబ్ల్యూఎంఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) కరిగౌడ మాట్లాడుతూ.."ఇది వింతైన చర్య కాదు. మా కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యర్థాలను వేరు చేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పొడి, తడి చెత్తను సేకరించడానికి ఇళ్లకు దాదాపు 5 వేలకు పైగా ఆటోలు వెళ్తున్నాయి. 
అయినప్పటికీ కొందరు మాత్రం రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. ఆ వ్యక్తులను పట్టుకునేందుకే సీసీటీవీలను కూడా ఏర్పాటు చేశాం. ఎవరైతే చెత్తవెయ్యొదని అవగాహన కల్పిస్తున్నా వేస్తున్నారో వారికి రిటర్న్ గిఫ్ట్‌లా ఆ చెత్తను వాళ్ల ఇంటి వద్ద తిరిగి వేయడమేగాక, రూ. 2000లు వరకు జరిమానా విధిస్తాం.
అలాగే ఇదేమి వింతేన చర్య కాదు. ఎందుకంటే మా కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యర్థాలను వేరు చేయడం గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో కూడా అవగాహన కల్పిస్తున్నాం. అలాగే రోడ్లపై చెత్త వేయకండని అభ్యర్థిస్తున్నాం. అయినా ఇలా చేస్తే..ఇలాంటి చర్య సమంజసమే.
బెంగళూరు ఒక "ఉద్యానవన నగరం" అని హైలైట్ చేస్తూ.. ప్రజలను చెత్తను వేయొద్దని, పరిశుభ్రతను కాపాడుకోవాలని చెప్పారు. అయితే కొన్నిచోట్ల చెత్త సేకరించేవారు లేకపోవడంతోనే వాళ్లంతా ఇలా వీధుల్లో చెత్త వేస్తున్నారని అన్నారు. అందుకోసమే భారీ చెత్తడబ్బాలను కూడా ఏర్పాటు చేయనున్నామని." కరిగౌడ తెలిపారు. ఇలాంటి చర్యలు అన్ని రాష్ట్రాల్లో గట్టిగా అమలైతే పూర్తి స్థాయిలో స్వచ్ఛ భారత నినాదం విజయవంతమైనట్లే కదూ..!.
(చదవండి: ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు !)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
