కేరళ పంబ తీర్థం స్వామియే శరణం అయ్యప్ప ప్రతిధ్వనులతో మారుమోగిపోతుంది. ఏ వైపు చూసినా అయ్యప్పస్వాములే దర్శనమిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటికే అధిక మెుత్తంలో స్వాములు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. ఇప్పటివరకూ అయ్యప్పస్వామిని 25 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
శబరిమలలో అయ్యప్పస్వాముల రద్దీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అయ్యప్పభక్తులు పెద్దఎత్తున పంబ సన్నిధానానికి చేరుకుంటున్నారు. అయ్యప్పస్వామికి ఇరుముడి సమర్పించి తమ మెుక్కులు పూర్తి చేసుకుంటున్నారు. ప్రారంభంలో స్వామివారి దర్శనానికి కొన్ని ఇబ్బందులు తలెత్తినా ప్రస్తుతం ఏర్పాట్లు మెరుగైనట్లు కేరళ పోలీసులు తెలిపారు. గత ఏడాది ఈ సమయం వరకూ దాదాపు 21 లక్షల మంది స్వామివారి దర్శనం చేసుకోగా ప్రస్తుతం ఆసంఖ్య 25 లక్షలు దాటిందన్నారు.
మండల పూజకోసం అయ్యప్పస్వామి (అభరణాల ఊరేగింపు) "తంగ అంకి" రథోస్థవం డిసెంబర్ 23 ప్రారంభమవుతున్నట్లు అధికారులు తెలిపారు.ఉదయం 7గంటలకు అరణ్ముల పార్థసారధి ఆలయం నుంచి బయిలుదేరి 26న అయ్యప్ప సన్నిధానం చేరుకుటుందని తెలిపారు. 27వ తేదీన అభరణాల అలంకారం అనంతరం స్వామివారికి మండల పూజ జరుగుతుందని దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.
అయ్యప్ప స్వాములందరూ వారికి కేటాయించిన సమయాలలో స్వామివారి దర్శనానికి రావాలని పోలీసులు సూచించారు. అలా చేయడం ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చని కేరళ పోలీసులు తెలిపారు.


