 
													సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదంటూ నిలదీశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారిని ఆదుకోవాలన్నచిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.
చంద్రబాబుకు రైతులంటే పగ.. వారి గోడును పట్టించుకునే పరిస్థితిలో లేడు. రైతుల సమస్యలను గాలికొదిలేసి తండ్రీకొడుకులు విదేశాల్లో తిరుగుతున్నారు. రైతుల సమస్యలపై చంద్రబాబు, లోకేష్ హేళనగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ యూరియా కొరత లేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబే అంగీకరించారు’’ అని కాకాణి గుర్తు చేశారు.
‘‘తుపాను నేపథ్యంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు, హెచ్చరికలు లేవు. వరి నాట్లు వేసిన తరువాత యూరియా కొరత ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 లక్షల ఎకరాలలో రైతులు నష్టపోయారు. మరో వైపు లక్ష ఎకరాలలో నెల్లూరు, కర్నూలు, ఒంగోలులో నీట మునిగిపోయింది. రాష్ట్రంలో వ్యవసాయ శాఖా మంత్రి పనిచేస్తున్నాడా?. రైతుల కష్టాలపై ఏమాత్రం అయినా స్పందన ఉందా?.
..ఇప్పటికే మామిడి రైతులు, పత్తి రైతులు భారీగా నష్టపోయారు. తాజా వర్షాలతో 50 వేల ఎకరాల పంట నష్టపోయారు. మొక్కజొన్న రైతులు ఎకరానికి 12 వేల రూపాయలు మేర నష్టపోయారు. కృష్ణ, గోదావరి డెల్టాలలో తుపాన్ నేపథ్యంలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం వుంది. పంట నష్టం పై ఎక్కడా నష్టపరిహారం లేదు. చంద్రబాబుకు రైతు అంటే పట్టదు.. వ్యవసాయం అంటే గిట్టదు. చంద్రబాబు ఇప్పటి వరకు రైతులపై ఒక్క సమీక్ష నిర్వహణ లేదు. టమోటా రైతులు, ఉల్లి రైతులను హేళనగా మాట్లాడే పరిస్థితి.

.. వైఎస్ జగన్ హయాంలో ఏనాడు అయినా యూరియా కోసం రైతు కష్టపడ్డ పరిస్థితులు లేవు. రైతుల కోసం జగన్ నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు. చంద్రబాబు ఏనాడు సీఎం అయినా రాష్ట్రం దుర్భిక్షం... రైతాంగానికి తీరని నష్టం. అన్నదాత సుఖీభవ సాక్షిగా రైతులకు 20 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. నేడు కేవలం ఐదు వేలు ఇచ్చి మోసం చేశాడు. వ్యవసాయ శాఖ మంత్రి దళారీల లబ్ధి కోసం పనిచేస్తాడు తప్ప రైతుల కోసం కాదు. రైతులను ఆదుకోకపోతే వైఎస్సార్‌సీపీ వారికి తోడుగా నిలుస్తుంది. ఎకరానికి మూడు బస్తాలు ఇవ్వడం, దానికి కార్డులు పంచడం హాస్యాస్పదం. యూరియా విషయంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయింది. యూరియా కోసం రేషన్‌లాగా కార్డులు పంచిన చరిత్ర హీనుగా చంద్రబాబు నిలిచిపోతాడు. రైతులకు అవసరం మేర యూరియా పంపిణీ చేయాలి’’ అని కాకాణి డిమాండ్ చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
