సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్‌లో రహస్యంగా జరుగుతాయని.. పైరవీలు, ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలో హోటల్‌కు చేర్చారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైఎస్సార్‌సీపీనే గెలుపొందిందని.. అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.
‘‘మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. రాజ్యాంగబద్దంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైఎస్సార్‌సీపీనే గెలుస్తుంది. కిడ్నాప్‌లు చేయటానికి ఖాకీలను వాడుకుంటున్నారు. పోలీసులు ఖాకీ క్యాబ్ సర్వీసులుగా మారారు. కొందరు పోలీసులు బిఎన్ఎస్ చట్టాలు అంటే 'బాబు అన్యాయ సంహిత' చట్టాలుగా మార్చారు’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.
‘‘టీడీపీకి బలం ఉంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఆల్రెడీ ఓడిపోయింది. అధికార బలం ఎల్లవేళలా పని చేయదు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు వస్తుంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.


