సాక్షి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో ఉద్యమంలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 లక్షల 25 వేల సంతకాలు సేకరించగా, రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు దాటాయి. ఈ నెల 15వ తేదీన కోటి సంతకాల ప్రతులను పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నాము.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని ప్రతీ వైసీపీ నాయకులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. మరో 6 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలం వచ్చినా సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్‌కు కోటి సంతకాలను మాజీ సీఎం వైఎస్ జగన్ అందజేయనున్నారని అవినాష్ వెల్లడించారు.


