ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు భలే విచిత్రంగా ఉంటాయి. ఒకపక్క సూపర్‌సిక్స్ హామలు అమలు చేద్దామని ఉన్నా.. ఖజానా ఖాళీగా ఉందంటారు.. అడిగినా అప్పులివ్వడం లేదని, కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం నడుచుకుంటూండటంతో కొత్త అప్పులు పుట్టడం లేదంటారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుందని బాధపడేదీ ఈయనే. అవునా? నిజమే కాబోలు అని అనుకునే లోపు అకస్మాత్తుగా ఆయనే ఓ ప్రెజెంటేషన్ ఇచ్చేస్తారు. ఏపీలో జీఎస్డీపీ భేష్ అంటారు. 11.28 వృద్ధి నమోదు చేశామంటారు. ఏడాదిన్నర కాలం కష్టపడి ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదాం అని తన భుజాలు తానే చరచుకుంటారు.
ఎల్లోమీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని చూసినప్పుడల్లా సామాన్యుడికి వచ్చే సందేహం.. ఇంతకీ ఏపీ దివాళా తీసిందా? అభివృద్ధిలో ముందుకు దూసుకెళుతోందా? ఒక్కటైతే నిజం... బాబుగారి రాజకీయ జీవితాన్ని గమనించిన వారందరూ అంగీకరించే విషయం ఏమిటంటే.. అదేదో పాత సామెత చందంగా ‘‘అవసరార్థం బహుకృత వేషం’’ వేయడంలో దిట్ట అని! పొంతన లేని, సత్యాసత్యాలతో సంబంధం లేని మాటలు కన్నార్పకుండా మాట్లాడగలరని. పోనీ.. ఇలా మాట్లాడితే అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకైనా మీడియా ఆయన్ను ప్రశ్నించాలని అనుకుంటాం కానీ.. ఎల్లోమీడియా ప్రజల పక్షాన పనిచేసి చాలాకాలమైంది. పైగా.. తనను ప్రశ్నించే మీడియాను చంద్రబాబు దూరంగా పెడుతున్నారు కూడా ఎవరైనా ప్రశ్నించినా దబాయించడం అలవాటు చేసుకున్నారు.
2019-2020, 2020-2021 మధ్య ఏపీలో వృద్ది రేటు పడిపోయిందని, జగన్ టైమ్‌లో జరిగిన విధ్వంసం అది అని చెప్పడానికి చంద్రబాబు యత్నించారు. కానీ అది కరోనా విజృంభించిన సమయం. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ దాదాపు స్తంభించిన సందర్భం. ఈ సమయాన్ని సాధారణ సమయంతో ఎలా పోలుస్తారని విలేకరులెవరూ ప్రశ్నించలేకపోయారు. అప్పులు తీసుకుని ప్రభుత్వాలు నడపాలని కేంద్రం స్వయంగా అప్పట్లో ఆదేశించిన విషయాన్నీ కూడా ఆయన దాచేశారు. అంతేకాదు. జీఎస్డీపీ భేష్‌గా ఉందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పుల గురించి చెప్పకుండా ఈ లెక్కలేమిటి అని ఎవరైనా అడిగారా? అలా అడిగినా వాటి గురించి తర్వాత మాట్లాడదాం అని ఉండవచ్చు. దాంతో మీడియా కూడా సరేలే మనకెందుకులే అని ఊరుకుని ఉండవచ్చు.
జీఎస్డీపీ వృద్ధికి ఆయన చెప్పిన కారణాలు గమనించండి. ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50లకే విద్యుత్ ఇచ్చామని అన్నారు. నిజానికి ఇది జగన్ టైమ్‌లో మొదలైంది. అమెరికా టారిఫ్‌ల వల్ల గడ్డు పరిస్థితి ఎదుర్కుంటోందన్నారు. కానీ దాన్ని వివరించనే లేదు. రోడ్లు,పోర్టులు,జలవనరులు రంగాలలో వ్యయం పెంచామన్నారు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ఎన్నడూ ఒక ఓడరేవుకాని, ఫిషింగ్ హార్బర్ కాని నిర్మించిన పాపాన పోలేదు. జగన్ చేపట్టిన వాటిని తనవిగా కలరింగ్ ఇస్తే ఎలా? పోనీ అవైనా సక్రమంగా జరుగుతున్నాయా? అంటే.. అదీ లేదు. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు.
కానీ అదే సమావేశంలో ప్రజలు తింటున్న పంటలనే పండించాలని, లేకుంటే వ్యాపారులు కొనరని, ప్రభుత్వం అన్ని పంటలను కొనుగోలు చేయలేదని తేల్చేశారు. మాట్లాడితే వరి వేయవద్దని చెబుతున్నారు. ఏపీలో అత్యధికులు తినేది వరి అన్నమే. బియ్యం తింటే మధుమేహం వస్తుందని మరొకటి వస్తుందని భయపెడుతున్నారు. బహుశా చంద్రబాబు ఎప్పుడో వరి అన్నం మానివేసి ఉండవచ్చు. అయినా ఆయనకు సుగర్ వ్యాధి ఉందా? లేదా? అన్నది కూడా వివరిస్తే బాగుండేది. జైలులో ఉన్నప్పుడు ఏ ఆనారోగ్యం చూపించి బెయిల్ పొందారు? దానికి కారణాలు కూడా చెబితే ప్రజలకు అర్థమవుతుంది కదా!
ఇటీవలి కాలంలో దాదాపు అన్ని పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ధరల స్థీరికరణ నిధిని పెట్టి రైతులను ఆదుకోకుండా గాలికి వదలివేసి ఈ కబుర్లు చెబితే ఏమి లాభం? అంతేకాక రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేల హామీని అరకొరగా అది కూడా రూ.ఐదువేలతో సరిపెట్టారాయె? రాష్ట్రానికి రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఒక్కోసారి ఒక్కో అంకె చెబుతూ ప్రజలను మభ్యపెట్టడానికే ఈ గణాంకాలు చెబుతుంటారు. ఈ సమ్మిట్ జరగడాదనికి ముందే రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేశారు కదా! వాటిలో ఈ ఏడాదిన్నరలో వచ్చిన పరిశ్రమలు ఏమిటో చెప్పాలి కదా! జగన్ టైమ్‌లో వచ్చిన కొన్ని పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేయడం తప్ప , ఆ తర్వాత వచ్చిన పరిశ్రమలు పెద్దగా లేవు. ఒకేసారి అన్ని పరిశ్రమలు రావు. ఆ విషయం చెప్పవచ్చు.
కాని అలాకాకుండా అవేవో రెడీమెడ్‌గా ఉన్నట్లు చెప్పే యత్నమే బాగోదు.పైగా 99 పైసలకు భూములను కట్టబెడుతూ, వేల కోట్ల రాయితీలు ఇస్తూ ప్రభుత్వంపై భారం మోపుతుంటే ఆదాయం ఎలా సమకూరుతుందో తెలియదు.విద్యార్ధుల,తల్లిదండ్రుల సమావేశం పెట్టామని చంద్రబాబు చెప్పడం విడ్డూరమే.దానికి, వృద్ది రేటుకు సంబంధం ఏమిటో తెలియదు.ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6700 కోట్ల బకాయిలు పెట్టి, విద్యారంగాన్ని అభివృద్ది చేస్తున్నామని చెబితే ప్రజల చెవిలో పూలు పెట్టినట్లవ్వదా! ఆరోగ్య రంగంలో మూడువేల కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయా?లేదా? తాను సాధించిన వాటికంటే గత ప్రభుత్వంపై ఏవో ఆధారాలు చూపని ఆరోపణలు చేయడాన్ని నిత్యకృత్యంగా పెట్టుకున్నారు.
భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి గత ప్రభుత్వం అప్పులు తెచ్చిందని చంద్రబాబు అన్నారు. అది ఎంతవరకు నిజం అన్నది పక్కనబెడితే, కొద్ది నెలల క్రితం మైనింగ్ కార్పొరేషన్ ఆదాయాన్ని తనఖాగా పెట్టడమే కాకుండా, ఒకవేళ ప్రభుత్వం అప్పు వాయిదా సకాలంలో తీర్చకపోతే నేరుగా రిజర్వు బ్యాంక్‌లో ఉండే ట్రెజరీ ఖాతా నుంచి నేరుగా డబ్బు డ్రా చేసుకోవచ్చని ఒప్పందం అయింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? సర్దుబాటు ఛార్జీల పేరిట వేల కోట్ల బాదుడు బాది, ఇప్పుడేమో రెండో ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెబితే సరిపోతుందా? అదే టైమ్ లో మళ్లీ విద్యుత్ ఛార్జీలపై ఈర్డీసీకి ఎందుకు నివేదిక ఇచ్చారు? మరో సంగతి చెప్పాలి.
తమ ప్రభుత్వానికి అప్పులు పుట్టడం లేదని నల్లజర్లలో చెప్పారు కదా? ఆ పాయింట్ పై ఈ ప్రజెంటేషన్లో ఎందుకు మాట్లాడలేదు. అప్పుడేమో ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, ఇప్పుడేమో అంతా బాగుందని చెప్పడానికి కారణాలు ఏమిటి? రాష్ట్రం దివాళా తీసిందన్న సంగతి దేశంలో అందరికి తెలిసిపోయేసరికి పరువు పోయిందని ఇప్పుడు సడన్‌గా ఈ ప్రజెంటేషన్ ఇచ్చారా? లేక అప్పులు ఇచ్చేవారు భయపడుతున్నారు కనుక మాట మార్చారా? పెట్టుబడులు పెట్టేవారు వెనక్కి తగ్గుతున్నారన్న భావనతో అంతా బాగానే ఉందని కలరింగ్ ఇవ్వ సంకల్పించారా?
ఏడాదిన్నర కాలంలో రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసిన సంగతి దాచేసి, ఆల్ హాపీస్ అంటూ మభ్యపెట్టే ప్రకటనలు చేస్తే సరిపోతుందా?నిజంగా అంతా బాగుంటే సూపర్ సిక్స్‌లోని ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి,పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక్కో యువకుడికి పది లక్షల హామీ మొదలైనవాటిని నెరవేర్చి చూపవచ్చు కదా! జనం దగ్గరకు వెళ్లేమో బీద అరుపులు, మీడియా సమావేశంలో ప్రజెంటేషన్‌లో గొప్పల గప్పాలు చెప్పి ఎవరిని మభ్య పెట్టదలిచారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను మోసం చేయడానికే సొంత లెక్కలతో చంద్రబాబు అంకెల గారడి చేస్తున్నారని, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వృద్ది రేటు, తలసరి ఆదాయం, అప్పుల పరిస్థితి అన్నిటి గురించి కాగ్ గణాంకాల ఆధారంగా వివరిస్తూ ఎందులో చూసినా తన పాలనతో పోల్చితే చంద్రబాబు ప్రభుత్వం తీసికట్టుగానే ఉందని జగన్ రుజువు చేశారు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


