సాక్షి, కాకినాడ జిల్లా: రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అప్పులకుప్పగా మార్చిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై ప్రజలకు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రచారం చేశారన్నారు.
‘‘ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఒక రాజ్యాంగం.. చంద్రబాబు సీఎంగా ఉంటే మరో రాజ్యాంగం ఉంటుందా?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ చేసిన అప్పులపై రాష్ట్రం శ్రీలంక అవుతోందని గ్లోబెల్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో రూ.2,66,175 కోట్లు అప్పు చేశారు. జగన్ అప్పు చేస్తే శాపం అని.. చంద్రబాబు చేస్తే వరం అని సొంత మీడియా బాకా కొట్టుకుంటుంది.
..కోవిడ్ వంటి కష్టకాలంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. చెప్పిన అబద్దం చెప్పకుండా వైఎస్ జగన్‌పై పచ్చి అబద్దాలను ప్రజల చెవుల్లోకి ఎక్కించారు. చంద్రబాబు తెచ్చిన అప్పులు ప్రజల సొమ్ముల్లో వేశారా అంటే? అదీ లేదు. రూ.5,400 కోట్లు ఎక్సైజ్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఏపీ బేవరేజ్ ద్వారా అప్పు తీసుకురావాలని వైఎస్ జగన్ భావిస్తే.. కేంద్రానికి లేఖ రాసి, కోర్టులో కేసులు వేశారు. వైఎస్ జగన్ చేసిన అప్పులు రాజ్యంగ విరుద్దం అన్నారు. ఇప్పుడు అవే అప్పులు మీరు చేస్తుంటే రాజ్యాంగం ఏమైనా మారిందా?
..చంద్రబాబు చేసే అప్పులకు ఏపీ సౌత్ సూడాన్‌లా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ 18 నెలల కాలంలొ చంద్రబాబు చేసిన అప్పు.. వైఎస్ జగన్ చేసిన అప్పుకంటే 80 శాతం ఎక్కువ. చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?. చంద్రబాబు చేసిన అప్పులు సంపద సృష్టి ఎలా అయ్యింది?. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అదోగతి అయిపోతుందని ఒక కుట్రపూరిత ప్రచారం జరుగుతుంది. పరిమితికి మించి అప్పులు చేయమని చంద్రబాబుకు ఏ చట్టం చెప్పింది. అమరావతి కోసం మరో 7,8 వేల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మీరు చేస్తున్న అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. రెడ్ బుక్ ద్వారా కేసులు పెడతారు. రోడ్డు మీద గోతులు పూడ్చడం లేదు కానీ.. గ్రోత్ ఇంజన్లు, గ్రోత్ కారిడార్‌ల కోసం మాట్లాడుతున్నారు’’ అంటూ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు.


