 
													ఒకానొకసారి, ఓ బలవంతుడైన వస్తాదు జ్ఞానం, ప్రశాంతతకు పేరుగాంచిన బౌద్ధ గురువు వద్దకు వచ్చాడు. ఆ వస్తాదు అంటే అందరికీ భయమే. అతని హృదయం కోపంతో గందరగోళంగా ఉండేది. చేస్తున్న పనుల పట్ల చిరాకూ పరాకూ పడుతుంటేవాడు. అతను సన్యాసి వద్దకు వచ్చీ రావడంతోనే తలవంచి నప్పటికీ అహంకారంతో అడిగాడు: ‘గురువుగారూ! నాకు స్వర్గం, నరకం గురించి బోధించాలి’. సన్యాసి అతని వైపు చూసి చిన్నగా నవ్వి, ‘నీకు వాటి గురించి చెప్పాలా? నీ మాటలో గర్వం కనిపిస్తోంది. నేను విడమరిచి చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు’ అన్నారు. ఆ మాటతో వస్తాదు కోపంతో ఊగిపోతూ, తన దగ్గరున్న కత్తిని తీసి ‘మీరన్న మాట నన్ను అవమానపరిచింది. నేను ఇప్పుడే మిమ్మల్ని చంపగలను’ అని అరిచాడు. సన్యాసి ఏమాత్రం కంగారు పడలేదు. అతని కళ్ళలోకి చూసి ప్రశాంతంగా చూస్తూ, ‘ఇదిగో ఈ నీ చర్యే నరకం’ అని చెప్పారు. వస్తాదు స్తంభించిపోయాడు. అతని కోపం కరిగిపోయింది. సిగ్గుపడ్డాడు. తన కత్తిని పక్కనపెట్టి సన్యాసి ముందు మోకరిల్లి, ‘క్షమించండి... నాకు వాస్తవాన్ని చిన్న మాటతో నేర్పించినందుకు ధన్యవాదాలు’ అని మృదువుగా అన్నాడు. సన్యాసి సున్నితంగా నవ్వి, ‘ఇదిగో ఇదే నువ్వడిగిన స్వర్గం’ అన్నారు.
ఈ చిరుఘటన ధ్యానం సారాంశాన్ని చెబుతోంది. ధ్యానం జీవితం నుండి తప్పించుకోవడం గురించినది కాదు, అది మన అంతర్గత ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడం గురించి చెప్పేది. ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు, భావోద్వేగాలు సముద్రంలో అలల వలె పైకి ఎగరడం, కింద పడటం అనుభవంలోకి రావడం గమనిస్తాం. అప్పుడు ఆందోళనపడటం మానేసి, దాని కింద ఉన్న ప్రశాంతతను చూస్తాం. అందుకే బుద్ధుడంటాడు: ‘శాంతి లోపలినుండి వస్తుంది. బయట దానిని వెతక్కండి’ అని!
-యామిజాల జగదీశ్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
