 
													తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్ధాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా మొదటి భాగం 2015లో రిలీజ్ కాగా..రెండో భాగం 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ రెండు సినిమాలు కలిపి ఓకే చిత్రంగా ‘బాహుబలి: ది ఎపిక్’(Bahubali The Epic Review)పేరుతో నేడు (అక్టోబర్ 31) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌తో పాటు ఇక్కడ కూడా ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
బాహుబలి కథ అందరికి తెలిసిందే. థియేటర్స్‌తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక(తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బంధీగా ఉన్న దేవసేన(అనుష్క శెట్టి) తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బంధీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. భళ్లాలదేవుడు(రానా) కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిచాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బళ్లాల దేవుడిని అంతం చేస్తాడు. ఇదే ది ఎపిక్ కథ(Bahubali The Epic Review).
విశ్లేషణ
ముందుగా చెప్పినట్లుగా ఇదంతా అందరికి తెలిసిన, చూసిన కథే. పార్ట్ 1 చూసినప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియదు. కాబట్టి అంతా పార్ట్ 2 చూశారు. మరి ‘బహుబలి: దిపిక్’ దేని కోసం చూస్తారు? అల్రేడీ చూసి చూసి ఉన్న చిత్రమే కదా అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే జక్కన మరోసారి మ్యాజిక్ చేశాడు. బోర్ కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్‌తో కథను చెప్పుకొచ్చాడు. ఆరున్నర గంటల సినిమాను 3.45 గంటలకు కుదించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందించేలా సన్నివేశాలను  పేర్చాడు. తెరపై చూస్తుంటే కొత్త సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. 
ఫస్టాప్‌లో పార్ట్ 1 కథని, సెకండాఫ్‌లో పార్ట్ 2 కథను చూపించాడు. ఈ రెండు భాగాల్లో ప్రేక్షకులకు బాగా నచ్చిన సన్నివేశాలన్నింటిని హైలెట్ చేశాడు. ప్రధాన పాత్రల పరిచయ సన్నివేశాలు.. బళ్లాలదేవుడి పట్టాభిషేకం, కాలకేయులతో యుద్ధం..తల నరికే సీన్..ఇవ్వన్నీ తెరపై చూస్తుంటే గూస్‌బంప్స్ గ్యారెంటీ. రెండు భాగల్లో ఏదో ఒకటి చూసిన వారికి కూడా ఈ సినిమా అర్థమయ్యేలా సీన్లను పేర్చాడు. అవంతిక లవ్‌స్టోరీ సీన్లను కట్ చేసినా..కొత్తగా చూసిన వారికి అర్థమయ్యేలా రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
సుదీప్ కిచ్చతో పాటు కొన్ని కీలకమైన సీన్లను, పాటలను తొలగించినా.. కథలోని ఆత్మను మిస్ కానివ్వకుండా జక్కన్న జాగ్రత్తపడ్డాడు. కీరవాణి రీరికార్డింగ్ కూడా ఈ సినిమాకు ప్రెష్‌నెస్‌ని తీసుకొచ్చింది. అయితే నిడివి మాత్రం కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. కనీసం ఇంకో 20 నిమిషాల నిడివిని అయినా తగ్గిస్తే బాగుండేదేమో. మొత్తానికి బాహుబలి 1& 2 లాగే ది ఎపిక్ చిత్రాన్ని కూడా థియేటర్ విజువల్ వండర్‌లా తీర్చిదిద్దడంలో జక్కన్న వందశాతం సక్సెస్ అయ్యాడు.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? ప్రభాస్, రానాతో పాటు ఇందులో కీలక పాత్రల్లో నటించిన వారంతా తమ తమ కెరీర్‌తో ది బెస్ట్ ఇచ్చారు. ప్రభాస్-అనుష్క జోడీని మరోసారి అలా తెరపై చూస్తుంటే.. రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంటుంది. యాక్షన్ సీన్లలో రానా, ప్రభాస్ పోటీ పడి నటించారు. రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా, సుబ్బరాజుతో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది. పదేళ్ల క్రితమే కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. వీఎఫెక్స్ అదిరిపోయాయి. అంతకు డబుల్ బడ్జెట్ పెడుతున్న సినిమాలకు కూడా ఈ స్థాయిలో సన్నివేశాలను తీర్చిదిద్దలేకపోతున్నారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా రీరిలీజ్‌లలో కూడా ‘బహుబలి’ ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే చెప్పాలి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
