breaking news
Baahubali - The Beginning
-
పదేళ్ల తర్వాత మళ్లీ కలిసిన 'బాహుబలి' టీమ్ (ఫోటోలు)
-
సాహోరే బాహుబలి
ఈ తరంలో తెలుగు సినిమా సాహసం... బాహుబలి తెలుగు సినిమా గర్వం... బాహుబలి తెలుగు సినిమా గౌరవం... బాహుబలి తెలుగు సినిమా ధైర్యం... బాహుబలి అవును... ‘‘భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి’’ అని ప్రేక్షకులు అనేలా చేసింది ‘బాహుబలి’ చిత్రం. ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న రిలీజ్ కాగా, మలి భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై నేటితో పదేళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.∙ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు) పాత్రల్లో ప్రభాస్, భల్లాలదేవుడి పాత్రలో రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవగా నాజర్ కనిపిస్తారు. ముందు శివగామి పాత్రకు శ్రీదేవిని, కట్టప్ప పాత్రకు సంజయ్ దత్‌ను, భల్లాలదేవుడి పాత్రకు జేసన్ మమోవా (హాలీవుడ్ మూవీ ‘ఆక్వామేన్’ ఫేమ్)లను అనుకున్నారు కానీ కుదరలేదు. అయితే శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్ ఎంత సరిగ్గా సరిపోయారో, బాహుబలికి యాంటీ రోల్ అయిన భల్లాలదేవ పాత్రకు రానా ఎంత ఫిట్ అయ్యారో చూశాం. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ తప్ప ఎవరూ సూట్ కాదని ప్రేక్షకులు ప్రశంసించారు. అనుష్క, తమన్నా, నాజర్‌ల నటన సూపర్. ∙ఇంట్రవెల్ బ్యాంగ్‌ను పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) నేపథ్యంలో డైలాగ్స్ వస్తుంటే... అప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఉండేలా ΄్లాన్ చేశారు. కానీ మాహిష్మతిలో భల్లాలదేవ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంగా ‘బాహుబలి... బాహుబలి..’ అని వచ్చేలా ఆ తర్వాత మార్చారు. → ‘బాహుబలి: ది బిగినింగ్’లో వాటర్ ఫాల్స్ నేపథ్యంలోని సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తాయి. ప్రభాస్ శివలింగాన్ని మోసుకు రావడం, జల పాతంపైకి ఎక్కి వెళ్లడానికి ప్రభాస్ చేసే సాహసాలు ఆడియన్స్‌ని ఆశ్చర్యపరుస్తాయి. అయితే ఇది నిజమైన జలపాతం కాదట. కొంత స్టూడియోలో, కొంత గ్రాఫిక్స్‌లో చేశారు. → ఈ సినిమాలో కాలకేయుడు (ప్రభాకర్) మాట్లాడే కిలికిలి భాష అప్పట్లో ఓ హాట్ టాపిక్. ఇప్పటికీ ఈ భాష గురించి సరదాగా మాట్లాడేవారు ఉన్నారు. ఈ భాషను రచయిత మధన్ కార్కీ సృష్టించారు. ఈ భాషలో దాదాపు 700 పదాలు, 40 వ్యాకరణ నియమాలు ఉన్నాయట. → దాదాపు రూ. 150 కోట్లకు పై బడ్జెట్‌తో రూపొందిన ‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు సాధించి, 2015లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే అప్పటికి అత్యధిక వసూళ్ళు సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్ట్ సాధించింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు రాబట్టిన తొలి పది తెలుగు చిత్రాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ పేరు ఉంది. అలాగే ఈ చిత్రం పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధిం చింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన 50 వేల చదరపు అడుగుల పోస్టర్ గిన్నిస్ రికార్డుగా నిలిచిందట. → ‘బాహుబలి’ సినిమాలోని మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఇరవై ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ. 25 కోట్లతో ఏర్పాటు చేశారు. అలాగే ఈ సినిమాలోని గ్రాఫిక్స్ కోసం పదిహేనుకు పైగా స్టూడియోలు, ఐదొందల మందికి పైగా వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు శ్రమించాల్సి వచ్చిందట. ఇక కేకే సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, వి. శ్రీనివాస్‌మోహన్ విజువల్ ఎఫెక్ట్స్, కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. → ‘బాహుబలి’ రెండో భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’పై ఆసక్తిని పెంచేందుకు తొలి భాగంలో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ఆసక్తికరమైన క్లిఫ్ హ్యాంగర్‌ను వదిలారు. ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. 2015లో గూగుల్‌లో ట్రెండ్ అయిన మొదటి పది అంశాల్లో ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? అనేది ఒకటి. → తెలుగు సినిమా ‘గ్లోబల్ రేంజ్’కి ఎదిగింది ‘బాహుబలి’తోనే. ఒక రకంగా ‘పాన్ ఇండియా’ ట్రెండ్ ఆరంభమైనదే ‘బాహుబలి’తోనే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌పై వరల్డ్ సినిమా దృష్టి పడింది. ఇలా ‘బాహుబలి’ సినిమా గురించి ఆసక్తికరమైన విశేషాలు చాలానే ఉన్నాయి.అక్టోబరులో బాహుబలి‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్’లను కలిపి ఒకే చిత్రంగా ఈ ఏడాది అక్టోబరులో రీ–రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని సమాచారం. -
‘వార్-2’: హృతిక్‌ను ప్రభాస్ ఢీకొడతాడా?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న నటుడు ప్రభాస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో ప్రభాస్ కెరీర్ ఎవరెస్ట్ శిఖరాలను అందుకుంది. ‘బాహుబలి’ సినిమాల అనంతరం ఇటీవల ప్రభాస్.. ‘సాహో’ తో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ డివైడ్ టాక్ వచ్చింది. విమర్శకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయినా దేశవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. హిందీలో సుమారు రూ. 150 కోట్లు వసూలుచేసి.. ‘సాహో’ హిట్ అనిపించికుంది. మొత్తానికి ‘సాహో’ ప్రభాస్‌ను, ఆయన ఫ్యాన్స్ నిరాశపరిచినా.. ప్యాన్ ఇండియా స్టార్‌గా డార్లింగ్ స్టామినా ఏంటో చాటింది. ఈ క్రమంలో తన స్టార్‌డమ్‌ను కాపాడుకుంటూ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా భారీ సినిమాలు తీసేందుకు ప్రభాస్ ఈ సమయాతమవుతున్నాడు. డార్లింగ్‌గా ఫ్యాన్స్ హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రభాస్ బుధవారం 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న. ప్రభాస్ దేశవ్యాప్తంగా టాప్ స్టార్‌గా వెలుగొందుతున్నాడంటే అందుకు కారణం రాజమౌళి తీసిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు. బాహుబలి-2 సినిమా వసూళ్లపరంగా దేశంలోని అన్ని రికార్డులను చెరిపేసింది. మొదటి పదిరోజుల్లోనే ఈ సినిమా దేశంలో వెయ్యికోట్లు వసూలు చేసింది. అంతేకాదు ఇండియాలో రూ. 1500 కోట్ల మైలురాయి చేరిన తొలి సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. మరో సరదా అంశం ఏమిటింటే.. ప్రభాస్ గత మూడు చిత్రాల (బాహుబలి, బాహుబలి-2, సాహో)కు అయిన బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్డే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌కు రీచ్ అయ్యేలా ప్రభాస్ భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. 2017లో జీక్యూ మ్యాగజీన్ ప్రచురించిన అత్యంత ప్రభావవంతమైన యువత జాబితాలో ప్రభాస్ ఆరోస్థానంలో నిలిచాడు. బాహుబలి-2 సక్సెస్ దేశవ్యాప్తంగా యువతలో ప్రభాస్‌కు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. ప్రభాస్‌కు 40 ఏళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఓ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. అదే ఆయన పెళ్లి. ప్రభాస్ ఎప్పుడు మ్యారెజ్ చేసుకుంటారు. ఈ ప్రశ్న ఆయనకు నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. గతంలో తన కో-స్టార్ అనుష్కను ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని వదంతులు వచ్చాయి. ఈ ఇద్దరు ‘మిర్చి’ సినిమా చేసినప్పటి నుంచి ఈ వదంతులు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తన పెళ్లి వదంతుల గురించి స్పందించిన ప్రభాస్.. తాను, అనుష్క మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. కనీసం నువ్వు అయినా పెళ్లి చేసుకో.. ఈ వదంతులు అగుతాయని అనుష్కను అడిగినట్టు ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. దక్షిణాది సినీ స్టార్స్‌లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ప్రభాస్‌కి దక్కింది. బ్యాంకాక్‌లోని ప్రపంచ ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఆయన మైనపు బొమ్మ కొలువదీరింది. బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్ర రూపంలో ఆయన మ్యూజియంలో దర్శనమిస్తున్నారు. ప్రభాస్ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రి ఇడియట్స్ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్ విషయానికొస్తే రాబర్ట్ డీనీరో నటన అంటే ఇష్టం. ప్రభాస్‌కు వాలీబాల్ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. 'బాహుబలి' సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాహో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ప్రస్తుతం 'జిల్' దర్శకుడు కె.కె. రాధాకృష్ణ డైరెక్షన్లో మరో భారీ సినిమాలో నటించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో తెరకెక్కనున్న త్రిభాషా చిత్రానికి ‘జాను’ టైటిల్ ప్రచారంలో ఉంది. హృతిక్‌ను ఢీకొంటాడా? హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ‘వార్’ ఈ ఏడాది సంచలన విజయాన్ని అందుకుంది. రూ. 300 కోట్లు వసూలు చేసి.. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ ఉంది. ఈ సినిమా సీక్వెల్లో హృతిక్ పాత్ర యథాతథంగా కొనసాగనుండగా.. టైగర్ ష్రాఫ్ పాత్రను మాత్రం మరొకరు చేయాల్సి ఉంది. ఈ పాత్ర కోసం పలువురు హీరోల పేర్లు తెరపైకి వస్తుండగా.. ప్రభాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం. బాలీవుడ్ మీడియా వర్గాలు కూడా ప్రభాస్ పేరును ‘వార్-2’కు ప్రముఖంగా సూచిస్తున్నాయి. ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉండటం.. దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్ ఉండటంతో ‘వార్-2’లో హృతిక్, ప్రభాస్ కలిసి నటిస్తే.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ తథ్యమని సినీ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. -
ఫ్రాన్స్ లో విడుదలకానున్న బహుబలి!
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిరూపించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బాహుబలి'. ఈ మూవీ వచ్చే జూన్ 8న ఫ్రాన్స్ లో విడుదల కానుంది. ఈ మేరకు బాహుబలి పేరుతో ఉన్న అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జేసూస్ బాహుబలి అనే పేరుకు హ్యాష్ ట్యాగ్ పెట్టి, 'బాహుబలి - ది బిగినింగ్' విడుదల వివరాలను పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ఎన్నో సంచలనాలు నమోదు చేస్తూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బాహుబలి విడుదలై రికార్డుల వర్షం కురిపించింది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టెర్ ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఈ మూవీ రెండో భాగం షూటింగ్స్ లో బిజిగా ఉన్నాడు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ ఫ్రాన్స్ లో విడుదలై మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆ మూవీ యూనిట్ భావిస్తుంది. So excited to announce that 'Baahubali - The Beginning' will be releasing in France, on June 8th! #JeSuisBaahubali pic.twitter.com/MnuC3TKBh5 — Baahubali (@BaahubaliMovie) 30 April 2016 -
అభిమానులకు థ్యాంక్స్
ముంబై: ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద కనక వర్షంతో పాటు పలువుర ప్రశంసలు అందుకున్న చిత్రం బాహుబలి - ద బిగినింగ్. ఆ చిత్రాన్ని విశేషంగా ఆదరించిన తన అభిమానులకు ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి మంగళవారం థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు తన మైక్రో బ్లాగ్‌లో ట్విట్ చేశారు. మలయాళంలో విడుదలై.... తమిళంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'బెంగుళూరు డేస్' షూటింగ్లో పాల్గొనేందుకు రానా చెన్నై విచ్చేశారు. బాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి మొదటి భాగం జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఒకే రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు నటించారు.