
టాలీవుడ్ ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన డైరెక్షన్లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 చిత్రాలు తెలుగు సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లాయి. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్ ఘనతను సాధించింది. తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి.. మరోసారి బాహుబలిని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు పార్ట్లను కలిసి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాలా రోజులుగా వైరలవుతోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. బాహుబలి చిత్రానికి మొదట అనుకున్నది ప్రభాస్ను కాదని.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అని గతంలో చాలాసార్లు రూమర్స్ వచ్చారు. ఈ వార్తలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. బాహుబలిలో ప్రభాస్ పాత్ర కోసం మేము హృతిక్‌ను సంప్రదించినట్లు ఆన్లైన్లో వచ్చిన వార్తలు విన్నానని అన్నారు.
అయితే అవన్నీ కేవలం ఊహగానాలేనని కొట్టిపారేశారు. ఈ సినిమాను కేవలం ప్రభాస్ కోసమే సిద్ధం చేశామని శోభు వెల్లడించారు. ఈ పాత్ర మొదటి నుంచి ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకుని రాశారని తెలిపారు. ఇతర నటులు ఎవరికీ కూడా ఆడిషన్లు నిర్వహించలేదని అన్నారు. ఆ పాత్రకు హృతిక్ రోషన్ కోసం సంప్రదిచారని చాలా కాలంగా వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టారు నిర్మాత యార్లగడ్డ.
హృతిక్పై రాజమౌళి వివాదాస్పద కామెంట్స్..
కాగా.. బాహుబలి దర్శకుడు రాజమౌళి హృతిక్ రోషన్ పట్ల 2009లో చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ తెరకెక్కించిన బిల్లా సినిమాను ప్రమోట్ చేస్తున్న కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు. ధూమ్ -2 రెండేళ్ల క్రితం విడుదలైనప్పుడు బాలీవుడ్ మాత్రమే ఇలాంటి నాణ్యమైన సినిమాలు ఎందుకు చేయగలదా? అని ఆశ్చర్యపోయానని అన్నారు. మనకు హృతిక్ రోషన్ లాంటి హీరోలు లేరా? బిల్లా పాటలు, పోస్టర్, ట్రైలర్ చూశా.. నేను ఒక్క విషయం మాత్రమే చెప్పగలను.. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ అసలు ఏం కూడా కాదు. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినందుకు మెహర్ రమేష్ (దర్శకుడు)కి కృతజ్ఞతలు అంటూ రాజమౌళి మాట్లాడారు. ఈ కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత నా ఉద్దేశ్యం అతన్ని ఎప్పుడూ కించపరచడం కాదని.. హృతిక్ రోషన్ను చాలా గౌరవిస్తానని అన్నారు.