టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజై ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ చిత్రం తర్వాతే వరుసగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కించడం ప్రారంభించారు. అంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి తొలుత డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైన తొలి రోజు సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఈవినింగ్ షో నుంచి వరుసగా కలెక్షన్స్ పెరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్ని రికార్డులను బద్దలు కొటిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం రెండు భాగాలు కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’(Baahubali: The Epic)పేరుతో రేపు(అక్టోబర్ 31) రీరిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్, రానాలతో కలిసి రాజమౌళి( SS Rajamouli ) ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆయన బాహుబలి రిలీజ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి వివరించాడు. 'బాహుబలి: ది బిగినింగ్'(2015) చిత్రాకి మొదట వచ్చిన టాక్ చూసి తాను షాకయ్యానని చెప్పారు.
‘బాహుబలి’ రిలీజ్ రోజు ఉదయం 4 గంటల షోకి డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ నాకు ఎక్కడో చిన్న నమ్మకం ఉంది. మరీ అంత బ్యాడ్ సినిమా తీయలేదు. కొన్ని సీన్స్ సరిగ్గా లేవేమో.. అవి జనాలకు నచ్చలేదేమో.. డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యానేమో అనుకున్నాను కానీ.. అంత బ్యాడ్ టాక్ వచ్చే సినిమా తీయలేదు అని నాకు లోపల ఒక చిన్న హోప్ ఉండేది. అయితే అది కేవలం 10 శాతం మాత్రమే ఉంది. అప్పట్లో జర్నలిస్టులు, పీఆర్వోలకు కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది. అందులో వదిన శ్రీవల్లీ నెంబర్ కూడా ఉంది. అందులో బాహుబలి సినిమాపై తీవ్రమైన విమర్శలు చేశారు. సినిమాలో ప్రభాస్ శివ లింగాన్ని ఎత్తుకున్న ప్లేస్లో జండూబాం పెట్టి పోస్టులు పెట్టారు.
అసలు వీళ్లు ఏమనుకుంటున్నారు? పెద్ద పుడింగులు అనుకుంటున్నారా? ఒక్కొక్కరికి ఎంత పొగరు.. వీళ్లే పెద్ద గొప్ప సినిమా తీశారని అనుకుంటున్నారా?. ఈ సినిమాతో అయిపోయారు. ఇది బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి.. డిస్ట్రిబ్యూటర్ బలి.. ఎగ్జిబిటర్ బలి' అని గ్రూప్ లో అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె మాకు ఎవరికీ చెప్పకుండా ఒక్కతే ఆ కామెంట్స్ చూస్తూం ఉండిపోయింది. తర్వాత మాకు ఈ విషయం చెప్పింది. అయితే నిర్మాత సాయి మాత్రం ‘టాక్ గురించి పట్టించుకోకండి..కలెక్షన్స్ ఉధృతంగా ఉన్నాయి. అంత బ్యాడ్ టాక్ ఉంటే ఫస్ట్‌షోకి వసూళ్లు పెరగవు కదా’ అన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే కలెక్షన్స్ పెరగడం ప్రారంభమైయ్యాయి. శనివారం మంచి రెస్పాన్స్ వచ్చింది..అయినా శ్రీవల్లి నమ్మలేదు. ఆదివారం వరకు చూద్దాంలే అనుకున్నాం. సండే ఈవినింగ్ అందరం కలిసిన తర్వాత ‘హమ్మయ్యా’ అనుకున్నాం’ అని రాజమౌళి అన్నారు.


