తమిళసినిమా: కొన్ని చిత్రాలు ఎప్పుడు తెరకెక్కుతాయో తెలియదు. అదే విధంగా కొన్ని చిత్రాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. ఇటీవల నటుడు కార్తీ నటించిన, నటించనున్న చిత్రాల పరిస్ధితి ఇలానే ఉంది. కార్తీ హీరోగా లోకేశ్‌కనకరాజ్ దర్శకత్వం వహించిన తొలి భారీ చిత్రం ఖైదీ. ఈ చిత్రంలో ముందు వేరే చిన్న నటుడు నటించాల్సి ఉంది. అయితే నిర్మాతలు అందులో నటుడు కార్తీ నటిస్తే చిత్రం పెద్దది అవుతుందని, ఆయన్ని నటింపజేశారు. ఆ చిత్రం సంచనలన విజయాన్ని సాధించింది. దీంతో అప్పుడే ఖైదీకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అయితే ఆ తరువాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్, నటుడు కార్తీ ఇతర చిత్రాలతో బిజీ అవడంతో ఖైదీ– 2 ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు.
అయితే త్వరలోనే మొదలవుతుందనే ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేశ్ కనకరాజ్ నటుడు రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన కూలీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దర్శకుడిపై రకరకాల ట్రోలింగ్స్ వైరల్ అయ్యాయి. అదే విధంగా ఆయన కూడా హీరోగా అవతారమెత్తారు. ఆ చిత్రం తరుదాత టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఖైదీ– 2 చిత్రం గురించి నటుడు కార్తీ ఓ భేటీలో పేర్కొంటూ ఆ చిత్రం ఇప్పుడే ప్రారంభం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇకపోతే ఈయన నటించిన తాజా చిత్రం వా వాద్ధియార్ ఈ నెల12న విడుదల కావలసి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర విడుదల వాయిదా పడింది. త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.


