బాలీవుడ్‌లో విజయం దక్కించుకున్న థామా సినిమా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.. అయితే, రెంట్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, తాజాగా ఉచితంగానే చూసే సౌకర్యం కల్పించారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్‌పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా దుమ్మురేపారు.
థియేటర్లలో దీపావళి కానుకగా అక్టోబరు 21న ధామా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 220 కోట్లకు పైగానే రాబట్టింది. అనంతరం అమెజాన్ ప్రైమ్(amazon prime video) ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఉచితంగానే చూసే అవకాశం కల్పించింది.

థామా స్టోరీ ఏంటి..?
'థామా' విషయానికొస్తే.. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. ఫ్రెండ్స్‌తో కలిసి న్యూస్ కవరేజీ కోసం ఓ రోజు కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇతడిపై ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) రక్షిస్తుంది. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వీళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) చేసిన ఓ తప్పు కారణంగా బేతాళ జాతి అతడిని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది.
అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్ వచ్చాడని తెలిసి.. ఆ జాతి వాళ్లు ఇతడిని శిక్షించే ప్రయత్నం చేయగా.. తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్‌తో ప్రేమతో పడిన తడ్కా.. తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. తర్వాత వీళ్ల ప్రేమలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. తడ్కా ఓ వ్యాంపైర్ అని అలోక్‌కి ఎప్పుడు తెలిసింది? ఈ కథకు 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలతో లింకేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.


