సాహోరే బాహుబలి  | Prabhas Baahubali Movie Completed 10 Years | Sakshi
Sakshi News home page

సాహోరే బాహుబలి 

Jul 10 2025 4:39 AM | Updated on Jul 10 2025 4:39 AM

Prabhas Baahubali Movie Completed 10 Years

‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమాకు పదేళ్లు 

ఈ తరంలో తెలుగు సినిమా సాహసం... బాహుబలి 
తెలుగు సినిమా గర్వం... బాహుబలి 
తెలుగు సినిమా గౌరవం... బాహుబలి 
తెలుగు సినిమా ధైర్యం... బాహుబలి 

అవును... ‘‘భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి’’ అని ప్రేక్షకులు అనేలా చేసింది ‘బాహుబలి’ చిత్రం. ప్రభాస్‌ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన బాహుబలి తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ 2015 జూలై 10న రిలీజ్‌ కాగా, మలి భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ 2017 ఏప్రిల్‌ 28న విడుదలైంది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలై నేటితో పదేళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.

∙ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు) పాత్రల్లో ప్రభాస్, భల్లాలదేవుడి పాత్రలో రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవగా నాజర్‌ కనిపిస్తారు. ముందు శివగామి పాత్రకు శ్రీదేవిని, కట్టప్ప పాత్రకు సంజయ్‌ దత్‌ను, భల్లాలదేవుడి పాత్రకు జేసన్‌ మమోవా (హాలీవుడ్‌ మూవీ ‘ఆక్వామేన్‌’  ఫేమ్‌)లను అనుకున్నారు కానీ కుదరలేదు. అయితే  శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్‌ ఎంత సరిగ్గా సరిపోయారో, బాహుబలికి యాంటీ రోల్‌ అయిన భల్లాలదేవ పాత్రకు రానా ఎంత ఫిట్‌ అయ్యారో చూశాం. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్‌ తప్ప ఎవరూ సూట్‌ కాదని ప్రేక్షకులు ప్రశంసించారు. అనుష్క, తమన్నా, నాజర్‌ల నటన సూపర్‌. 

∙ఇంట్రవెల్‌ బ్యాంగ్‌ను పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) నేపథ్యంలో డైలాగ్స్‌ వస్తుంటే... అప్పుడు ప్రభాస్‌ ఎంట్రీ ఉండేలా ΄్లాన్‌ చేశారు. కానీ మాహిష్మతిలో భల్లాలదేవ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంగా ‘బాహుబలి... బాహుబలి..’ అని వచ్చేలా ఆ తర్వాత మార్చారు.  

→ ‘బాహుబలి: ది బిగినింగ్‌’లో వాటర్‌ ఫాల్స్‌ నేపథ్యంలోని సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తాయి. ప్రభాస్‌ శివలింగాన్ని మోసుకు రావడం, జల పాతంపైకి ఎక్కి వెళ్లడానికి ప్రభాస్‌ చేసే సాహసాలు ఆడియన్స్‌ని ఆశ్చర్యపరుస్తాయి. అయితే ఇది నిజమైన జలపాతం కాదట. కొంత స్టూడియోలో, కొంత గ్రాఫిక్స్‌లో చేశారు. 

→ ఈ సినిమాలో కాలకేయుడు (ప్రభాకర్‌) మాట్లాడే కిలికిలి భాష అప్పట్లో ఓ హాట్‌ టాపిక్‌. ఇప్పటికీ ఈ భాష గురించి సరదాగా మాట్లాడేవారు ఉన్నారు. ఈ భాషను రచయిత మధన్‌ కార్కీ సృష్టించారు. ఈ భాషలో దాదాపు 700 పదాలు, 40 వ్యాకరణ నియమాలు ఉన్నాయట. 

→ దాదాపు రూ. 150 కోట్లకు పై బడ్జెట్‌తో రూపొందిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు సాధించి, 2015లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే అప్పటికి అత్యధిక వసూళ్ళు సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్ట్‌ సాధించింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు రాబట్టిన తొలి పది తెలుగు చిత్రాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్‌’ పేరు ఉంది. అలాగే ఈ చిత్రం పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధిం చింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన 50 వేల చదరపు అడుగుల పోస్టర్‌ గిన్నిస్‌ రికార్డుగా నిలిచిందట. 

→ ‘బాహుబలి’ సినిమాలోని మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఇరవై ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ. 25 కోట్లతో ఏర్పాటు చేశారు. అలాగే ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌ కోసం పదిహేనుకు పైగా స్టూడియోలు, ఐదొందల మందికి పైగా వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టులు శ్రమించాల్సి వచ్చిందట. ఇక కేకే సెంథిల్‌కుమార్‌ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, వి. శ్రీనివాస్‌మోహన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్,  కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. 

→ ‘బాహుబలి’ రెండో భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’పై ఆసక్తిని పెంచేందుకు తొలి భాగంలో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ఆసక్తికరమైన క్లిఫ్‌ హ్యాంగర్‌ను వదిలారు. ‘వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అయ్యింది. 2015లో గూగుల్‌లో ట్రెండ్‌ అయిన మొదటి పది అంశాల్లో ‘వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి? అనేది ఒకటి. 

→ తెలుగు సినిమా ‘గ్లోబల్‌ రేంజ్‌’కి ఎదిగింది ‘బాహుబలి’తోనే. ఒక రకంగా ‘పాన్‌ ఇండియా’ ట్రెండ్‌ ఆరంభమైనదే ‘బాహుబలి’తోనే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌పై వరల్డ్‌ సినిమా దృష్టి పడింది.  ఇలా ‘బాహుబలి’ సినిమా గురించి ఆసక్తికరమైన విశేషాలు చాలానే ఉన్నాయి.

అక్టోబరులో బాహుబలి
‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్‌’లను కలిపి ఒకే చిత్రంగా ఈ ఏడాది అక్టోబరులో రీ–రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారని సమాచారం.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement