మహేశ్ రాజ్, అనస్వరా రాజన్, రానా, సౌందర్య, అభిషన్ జీవింత్
‘‘విత్ లవ్’ మూవీ ట్రైలర్ బాగుంది. ఇది మన కథే అనిపిస్తోంది. ట్రైలర్ చూసిన వారందరూ చాలా కనెక్ట్ అయ్యారు. అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ఇది. సౌందర్యగారు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో రానా దగ్గుబాటి చెప్పారు. అభిషన్ జీవింత్, అనస్వరా రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విత్ లవ్’. మదన్ రచన, దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో కలిసి ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నజరత్ పసిలియన్, మహేశ్ రాజ్ పసిలియన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘నా చిన్నప్పటి ఫ్రెండ్ రానా. తనతో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలున్నాయి. ‘విత్ లవ్’ని తను రిలీజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. ‘‘మా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’కి మీరందరూ గొప్ప ఆదరణ ఇచ్చారు. ‘విత్ లవ్’ కూడా అద్భుతమైన భావోద్వేగాలున్న సినిమా. మన జ్ఞాపకాలని నెమరువేసుకునేలా ఉంటుంది’’ అన్నారు అభిషన్ జీవింత్. ‘‘విత్ లవ్’ క్యూట్ సినిమా. చాలా ప్రేమతో ఈ చిత్రం చేశాం. తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు అనస్వరా రాజన్. మహేశ్ రాజ్ మాట్లాడుతూ– ‘‘టూరిస్ట్ ఫ్యామిలీ’లానే ఈ సినిమాని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


