ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని మెగస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను సింగర్ చిన్మయి విభేదించిన విషయం తెలిసిందే.. సినిమాలో ఛాన్స్ రావాలంటే తమ శరీరం అప్పగించాల్సిందేనని ఆమె ఓపెన్‌గానే చెప్పారు. చిరు జనరేషన్‌లో కనిపించిన పరిస్థితిలు ఇప్పుడు లేవని ఆమె అన్నారు. అందుకే మెగాస్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటారని ఆమె పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
క్యాస్టింగ్ కౌచ్ గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఇలా అన్నారు. 'పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే, అదీ వారిద్దరి అంగీకారంతోనే కొనసాగుతుంది. ఈ రకంగా చూస్తే చిరంజీవి చెప్పింది కొన్ని సందర్భాల్లో నిజమే. ఆయన చేసిన వ్యాఖ్యలను నేను తప్పబట్టను. కానీ, నా అభిప్రాయం ప్రకారం క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే, టాలెంట్ ఉంటే ఏ అమ్మాయి కూడా ఇబ్బందులు పడదని చెప్పగలను. సింగర్ చిన్మయి చేసిన వ్యాఖ్యలు కూడా నిజమే..
ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ప్రతి ఏడాది 200 పైగా సినిమాలు వస్తున్నాయి. అందులో కొందరు ఎందుకు సినిమాలు తీస్తున్నారో వాళ్లకే తెలియదు. కేవలం అమ్మాయిలను లోబర్చుకునేందుకే కొందరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ, సీరియస్‌గా సినిమాలు తీసే పెద్ద దర్శకులు, నటులు, నిర్మాతలు అలాంటి వాటికి దూరంగా ఉంటారు. లైంగిక వేధింపులను ఎదిరించినందుకు సింగర్ చిన్మయిని నిషేధించారు. ఆమె ఎవరికీ తల వంచలేదు. ఛాన్స్‌లు ఇవ్వకున్నా సరే ఆమె ఎవరికీ లొంగలేదు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. చిరంజీవి వంటి వారు క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పడం వెనుక ప్రధాన కారణం టాలెంట్ ఉన్న వాళ్లు ధైర్యంగా ముందుకు రావాలనే చెప్పారనుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.


