నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడు నటించిన తాజా చిత్రం ఎల్ ఐ కే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈయన ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నీ ఒకదానికి మించి ఒకటి సంచలన విజయాలు సాధించాయనేది తెలిసిందే. ఇటీవల విడుదలైన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రంతోపాటు ప్రారంభమైన మరో చిత్రమే ఎల్‌ఐకే. కృతిశెట్టి నాయకిగా నటించిన ఇందులో ఎస్‌జే సూర్య, సీమాన్ ముఖ్యపాత్రలు పోషించారు. సెవెన్ స్క్రీన్స్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని దర్శకుడు విఘ్నేష్ శివణ్ తెరకెక్కించారు.అనిరుధ్ సంగీతాన్ని అందించారు.

అయితే, ముందుగా ఈ చిత్రాన్ని గత దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతల వర్గం ప్రకటించింది. కానీ, అదే సమయంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో ఎల్‌ఐకే చిత్ర విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12 లేదా 13వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. ఫాంటసీ లవ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్ర షూటింగ్‌ను మలేషియా, సింగపూర్‌లో అధిక భాగాన్ని చిత్రీకరించినట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. అదేవిధంగా వరుస విజయాలతో జోరుపై ఉన్న నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపైన మంచి అంచనాలే నెలకొంటున్నాయి.


