
పట్టుబడే సరికి కోవర్ట్ అంటూ చంద్రబాబు బుకాయింపు
చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐ విచారణ కోరాలి
మండిపడిన మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో పీకల వరకు కూరుకుపోయిన టీడీపీ పెద్దలు దానినుంచి బయటపడేందుకు అరెస్టయిన వారు కోవర్ట్‌లు అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో అరెస్టయిన టీడీపీ నేత జయచంద్రారెడ్డికి వైఎస్సార్‌సీపీతో లింకులున్నాయని, కోవర్ట్‌గా తమ పారీ్టలో చేరాడంటూ సీఎం చంద్రబాబు అనడం ఆయన దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు.
దొరికిన దొంగలకు వైఎస్సార్‌సీపీ కోవర్ట్ అనే ముద్ర వేసి, తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. నకిలీ మద్యం మరణాలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ యాజమాన్యం, విలేకరులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు ప్రజలకు తెలియకూడదని మీడియా గొంతు నొక్కేందుకు కూడా ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా నకిలీ మద్యం మాఫియా బయటపడిందని, ఇందులో టీడీపీ నాయకుల పాత్ర ఆధారాలతో సహా రుజువైందని చెప్పారు.
సీఎం సొంత జిల్లా ములకలచెరువులోనే నకిలీ మద్యం తయారు చేసి అసలు మద్యం మాదిరిగా మార్కెట్‌లోకి తీసుకువచ్చారన్నారు. ఇంత పెద్ద వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్రధారి దాసరిపల్లె జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుని తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారన్నారు. ఈ నిందితుల్లో జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, జనార్దన్ తదితరులు చంద్రబాబు, లోకేశ్‌కు అత్యంత సన్నిహితులే అన్నారు.
ఈనాడు రామోజీరావు కొడుకు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ నకిలీ మద్యం వ్యవహారం నుంచి టీడీపీని ఎలా కాపాడాలా అని మధనపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ‘సాక్షి’ పత్రిక విలేకరులపై, యాజమాన్యంపై రెండు కేసులు పెట్టారన్నారు. ‘సాక్షి’ విలేకరి ఇంట్లోకి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు హంగామా సృష్టించారని, నకిలీ మద్యం తాగి చనిపోయారు అని వార్త రాసినందుకు విలేకరిపై జులుం ప్రదర్శించారని పేర్కొన్నారు.