
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేటు మార్కెట్‌కు తరలించారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు.
యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా, నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:
రూ.200 కోట్ల అవినీతి:
రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దాంట్లో ఏకంగా 5 లక్షల టన్నుల వరకు యూరియాను వ్యాపారులకే ఇచ్చేస్తే రైతులకు ఎలా అందుతుంది?. అందుకే వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో బస్తా మీద రూ.200 నుంచి రూ.300లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఒక్క యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారంలోనే దాదాపు రూ. 200 కోట్లు చేతులు మారినట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ మేరకు రైతుల జేబులకు చిల్లు పడుతోంది. మరి ఆ డబ్బంతా జేబుల్లోకి వెళ్లిందో త్వరలోనే తేలుస్తాం
రైతులకు మంత్రి క్షమాపణ చెప్పాలి:
డిమాండ్‌కు తగిన యూరియాను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయకుండా, ప్రైవేటు మార్కెట్‌కు చాలా ఎక్కువ సరుకు పంపించడం వల్ల అది బ్లాక్ మార్కెట్‌కు చేరింది. అందుకే గతంలో రూ.270 కే దొరికిన యూరియా బస్తా, ఇప్పుడు రూ.600 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా దొరక్క రైతులు నానా ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి పెట్టని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వారిని అవమానపర్చేలా మాట్లాడారు. పెళ్లిళ్లలో భోజనం కోసం బఫే వద్ద ప్లేటు పట్టుకుని నిలబడినట్లు, రైతులు కూడా యూరియా కోసం నిలబడలేరా? అని వ్యాఖ్యానించడం తప్పు. అచ్చెన్నాయుడు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.
ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం:
డిమాండ్‌కు తగిన యూరియాను కేంద్రం నుంచి రప్పించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ సమస్యను లేవనెత్తే రైతుల గొంతు నొక్కాలని చూస్తోంది. యూరియా కొరతపై ఎక్కడైనా రైతులు నిరసనకు దిగితే, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు. చివరకు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు కోసం వస్తున్న రైతులను కూడా దారుణంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. అసలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదు? దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి.

‘మీ’ మీడియాలో వస్తున్నా కనిపించడం లేదా?:
యూరియా దొరక్క దాదాపు మూడు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే, ఇన్నాళ్లూ కుంభకర్ణుడిలా నిద్ర పోయిన మంత్రి కె.అచ్చెన్నాయుడు.. మా పార్టీ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించడంతో హడావుడిగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి, యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి యూరియా వస్తున్నా బ్లాక్ మార్కెట్‌కు తరలి పోతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. రైతులు ఆ మాత్రం క్యూలైన్లలో నిలబడలేరా? అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు.
యూరియా కొరతపై చివరకు టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తున్నా మంత్రి కళ్లకు కనిపించడం లేదా?. ఇంకా కేంద్రం కేటాయించిన యూరియాలో సింహభాగం ప్రైవేటు డీలర్లకు ఇచ్చేయడం వల్లే కొరత ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మరి రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి నిబంధనలను అతిక్రమించి మరీ 50 శాతం కన్నా అధికంగా ప్రైవేట్ డీలర్లకు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో మంత్రి చెప్పాలి.
ఈనెల 9న నిరసన కార్యక్రమం:
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. వ్యవసాయ అవసరాలను ఫణంగా పెట్టి, రైతులను దోచుకోవడానికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. ఒకవైపు యూరియా దొరకడం లేదు. మరోవైపు పండిన పంటలకు మద్దతు ధర లభించడం లేదు. ఇక ఉచిత పంటల బీమా లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందడం లేదు
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఈనెల 9న వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఆ రోజున ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత ఆ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వివరించారు.