
యూరియా కొరత, రైతుల అవస్థలపై వైఎస్ జగన్ ట్వీట్
చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు.. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత, రైతుల అవస్థలపై ఆయన ట్వీట్ చేస్తూ.. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డారు.
‘‘మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరో వైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబో మంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదు చంద్రబాబూ?
..ఏటా ఏ సీజన్‌లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్నదానిపై ప్రతిఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయడంలేదనే కదా అర్థం’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.
‘‘ప్రభుత్వం నుంచి కిందకు వెళ్లిన ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరో వైపు ప్రైవేటు వ్యాపారులు నల్లబజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేసి, బస్తా యూరియా రేటు రూ.267లు అయితే, దీనికి మరో రూ.200లు అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీల్లేవు, ఎవ్వరిమీదా చర్యల్లేవు. PACSలకు, RBKలకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరేకదా చంద్రబాబూ..
..మా హయాంలో RBKల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లైచేశాం. PACSల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50ల తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబుగారూ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్‌ల నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా?
..మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును ఆదుకోలేదు.
..క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400-500లకు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35లకు పైగా అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4వేల నుంచి రూ.12వేలు అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి, రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు.
..ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు, 9,025 టన్నులను ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6వేల నుంచి రూ.12వేలు మాత్రమే పలుకుతోంది.
..మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.1లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్‌లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టి ఒక ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా చంద్రబాబుగారూ మీరు పట్టించుకోవడంలేదు. నిద్ర నటించేవాళ్లని ఎవరైనా లేపగలరా?’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
‘‘మేం ఏర్పాటు చేసిన ధరలస్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చుచేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్‌టైం డేటా CMAPP (Comprehensive Monitoring of Agriculture, Price, and Procurement)ను మూలనపడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటలబీమాకు పాతరవేశారు.
.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025
..ఏ సీజన్‌లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్‌లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్(పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసంచేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా, రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20వేలు, అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5వేలు మాత్రమే. అదికూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ’’ అంటూ వైఎస్ జగన్ ఎండగట్టారు.