
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై(Sakshi) కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై రెడ్‌బుక్ వికృత చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం.. సాక్షి ఆఫీసుకు పోలీసులను పంపించింది. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన పోలీసులు ఓవరాక్షన్ చేశారు.
వివరాల ప్రకారం.. ఏపీలో నకిలీ(AP Liquor Scam) మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా(Yellow Media) సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది. నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సాక్షిని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను(AP Police) రంగంలోకి దింపింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది.
ఇది కూడా చదవండి: నకిలీ మద్యం కేసులో మరో బిగ్ ట్విస్ట్..
దీంతో, ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు.. ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆఫీసు వద్ద పోలీసులు హల్‌చల్ చేశారు. కేసుకు సంబంధించి నోటీసులు తీసుకోవాలంటూ సాక్షి సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. జర్నలిస్టులను, సాక్షి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలకు దిగారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు సాక్షి కార్యాలయంపైకి పోలీసులను పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడిని జర్నలిస్టులు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.