
సాక్షి, అమరావతి: ఏపీలో నకిలీ మద్యం(AP Liquor case) కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నకిలీ మద్యం కేసులో టీడీపీ(TDP) గ్యాంగ్.. సాక్ష్యాలను దాచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాని నిందితుడు, టీడీపీ నాయకుడు జనార్థన్ రావు ఫోన్ మిస్సింగ్ అని కొత్త కోణాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ నేపథ్యంలో కీలక ఆధారాలను దాచే ప్రయత్నం జరుగుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకుడు జనార్ధన్ రావును(Janardhan Rao) అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి పోలీసులు(AP Police) ఆరా తీశారు. అయితే, ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పోయిందని జనార్ధన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో జనార్ధన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. జనార్ధన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారుల ప్లాన్ చేస్తున్నారు. ఇక, జనార్థన్ రావు ఫోన్ దొరికితే మరికొందరు టీడీపీ నాయకులు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆయన ఫోన్‌లో ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కానీ, ముంబై ఎయిర్‌పోర్టులో ఫోన్ పోయిందనే ఆయన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ సిండికేట్..
ఇదిలా ఉండగా.. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ సిండికేట్ ద్వారా సాగిస్తున్న మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. పర్మిట్ రూమ్‌లకు అనుమతులిచ్చింది. 75 వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసినా ఉదాసీనంగా ఉంటోంది. 540 బార్లను (త్వరలో మరో 300 బార్లు కూడా) టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. ఇలా రాష్ట్రంలో మద్యం నెట్‌వర్క్‌ను టీడీపీ సిండికేట్ గుప్పిటపట్టింది. అనంతరం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్‌రావు ఆధ్వర్యంలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం యూనిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది.
టీడీపీ సీనియర్ నేతలకు ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు అప్పగించింది. నకిలీ మద్యాన్ని ప్రభుత్వ లైసెన్స్ పొందిన ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బార్లు, బెల్ట్ షాపుల్లో దర్జాగా విక్రయిస్తూ భారీ దోపిడీకి తెగబడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఏడాదిలోనే రూ.5,280కోట్లు కొల్లగొట్టిన ఈ మద్యం మాఫియా వచ్చే నాలుగేళ్లలో మరో రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధపడింది. అందులో 30 శాతం వాటా కరకట్ట బంగ్లాకే ముడుపులుగా చెల్లించాలన్నది డీల్.