పెట్టుబడి సాయం ఆలోచన వైఎస్‌ జగన్‌దే | MVS Nagireddy on investment assistance | Sakshi
Sakshi News home page

పెట్టుబడి సాయం ఆలోచన వైఎస్‌ జగన్‌దే

Mar 16 2026 5:08 AM | Updated on Mar 16 2026 5:08 AM

MVS Nagireddy on investment assistance

ఏపీ వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి 

సాక్షి, అమరావతి: దేశంలో రైతుకు పెట్టుబడి సాయం అందిచాలనే ఆలోచన చేయడమే కాదు... అధికారంలోకి వచ్చీరాగానే అమలు చేసింది కూడా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుస కరువు, కాటకాలతో అల్లాడుతున్న రైతులకు అండగా నిలవాలన్న ఆలోచనతో 2017లో జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని వైఎస్‌ జగన్‌ ప్రకటించారని గుర్తుచేశారు. 

ఆ తర్వాత 2018 డిసెంబర్‌లో కేంద్రం పీఎం కిసాన్‌ ద్వారా రైతులకు ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6 వేల ఆరి్థక సాయం ప్రకటించి, 2019 జనవరి నుంచి అమలులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఆ సమయంలో చంద్రబాబు‡ ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనకు ఈ ఆలోచన రాలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పిన వైఎస్‌ జగన్‌... అధికారంలోకి రాగానే రూ.12,500లను రూ.13,500కు పెంచి, ఐదేళ్లపాటు రూ.67,500 చొప్పున ఇచ్చారని వివరించారు. 

రైతులు, కౌలు రైతులతోపాటు దేవదాయ, అటవీ, ఇతర భూముల సాగుదారులు కలిపి 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల లబ్ధి చేకూర్చారని తెలిపారు. చంద్రబాబు 2024 ఎన్నికల సమయంలో కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని  హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది 46.86 లక్షల మందికి అరకొరగా అన్నదాత సుఖీభవ కింద సాయం అందించారని పేర్కొన్నారు. లబ్ధిదారులను భారీగా తగ్గించడమే కాకుండా రెండేళ్లలో ఒక్కో రైతుకు దాదాపు రూ.30వేలు చొప్పున ఎగ్గొట్టారని విమర్శించారు.  

Advertisement
 
Advertisement
Advertisement