
తాడేపల్లి : చంద్రబాబు ప్రభత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా సమస్యల పరిష్కరానికి చొరవ చూపడం లేదని ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార‍్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డి.. ‘ ఉద్యోగుల హెల్త్ స్కీం గురించి అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు.
ఉద్యోగులు హెల్త్ కార్డ్ ద్వారా వైద్యం చేయించుకోవాలంటే సాధ్యం కావటం లేదు. పొదిలి ఆర్టీసీ కండక్టర్ భర్తకు సరైన వైద్యం అందక మృతి చెందారు. ప్రైవేట్ ఆస్పత్రిలో హెల్త్ కార్డును పట్టించుకోనందునే మృతి చెందారు..దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
హెల్త్ కార్డ్ ల ద్వారా ఉద్యోగులకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. టీడీపీకి అనుకూలంగా పనిచేయలేదని ఇద్దరు సీఐ లను సస్పెండ్ చేయటం దుర్మార్గం. చివరికి ఉద్యోగులపై కూడా రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల పై అదనపు పనిభారం వేస్తున్నారు. విశ్రాంతి కూడా ఇవ్వకుండా పనులు చేయిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగులకు ఇంతవరకు పీఆర్సీ సహా ఇతర సమస్యలు పట్టించుకోవటం లేదు’ అని ధ్వజమెత్తారు.