రాజా సాబ్‌.. స్థాయికి తగ్గ మాటలాడండి సార్‌! | KSR Comment Over Goa Governor Ashok Gajapathi Raju Tongue Slip On Rushikonda, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

రాజా సాబ్‌.. స్థాయికి తగ్గ మాటలాడండి సార్‌!

Sep 9 2025 9:58 AM | Updated on Sep 9 2025 10:25 AM

KSR Comment: Goa Governor Ashok Gajapathi Raju Tongue Slip On Rushikonda

గోవా గవర్నర్‌గా నియమితులైన పూసపాటి అశోక్‌ గజపతి రాజు గారికి వయసైపోయినట్టు ఉంది. మంచి మాటతీరు, మర్యాదలతో ఒకప్పుడు అన్ని పార్టీల మన్ననలు పొందిన ఆయన.. ఇటీవల చేసిన ఒక ఉపన్యాసాన్ని గమనిస్తే ఈ అనుమానం రాకమానదు. విశాఖపట్నంలోని రిషికొండపై వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన భవంతుల్లో పిచ్చాసుపత్రి పెట్టాలని ఆయన తన గౌరవాన్ని దిగజార్చుకున్నట్లు అయ్యింది. 

క్షత్రియ సంక్షేమ సమితి సభ్యుల సన్మానం సందర్భంగా ఆయన నాలుగు మంచి ముక్కలు మాట్లాడి వెళ్లకుండా రిషికొండ భవనాల్లో బస చేయమన్నా నిద్రపట్టదట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుందని వ్యాఖ్యానించారు. అక్కడికి రిషికొండపై ఇప్పుడే భవనాలేవో నిర్మించినట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి. టూరిజం శాఖ భవనాల స్థానంలో చూడముచ్చటైన నిర్మాణాన్ని చేసినందుకు హర్షించాల్సింది పోయి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేశారు. పైగా ఇదో ఉచిత సలహా అంటూ వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి తగింది మాత్రం కాదు. 

ఆయనలో రాచరికం వాసనలు ఇంకా పోనట్టు ఉంది. తమ కోటలను మించిన అద్భుతమైన భవనాలు ఇంకెక్కడ ఉండకూడదన్న అక్కసుతో రిషికొండ భవనాలపై ఈ ఆరోపణలు చేశారేమో అనుకోవలి. చిత్రంగా ఎల్లోమీడియా ఇవే వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించి చంకలు గుద్దుకుంది. అయితే..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో పెట్టిన విపరీత ఖర్చులపై ఏనాడూ ఆక్షేపణ చెప్పని అశోక్‌ గజపతి రాజుకు మూడు వేల మంది కూడా లేని సచివాలయ సిబ్బంది కోసం యాభై అంతస్తుల భవనం నిర్మిస్తున్నప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా అక్రమ కేసులు పెడుతూ నిర్బంధిస్తున్నా ఆయనకు పాలకుల సైకోతత్వం అవగతం కాలేదు. రిషికొండ భవనాలను ఎలా వాడుకోవాలన్న విషయంపై అధ్యయనం జరుగుతోందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇటీవలే చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే పవన్‌ అక్కడకు వెళ్లినప్పుడు ఇంకో రకం డ్రామా  జరిగింది. 

ఫాల్స్‌ సీలింగ్‌ను ఎవరో  కొద్దిగా కోసినట్లు కనిపించింది. ఆ ముక్క గచ్చుమీద కనిపించింది. ఉప ముఖ్యమంత్రి వస్తున్నా.. అక్కడి సిబ్బంది దాన్ని తొలగించలేదు. అంటే నిర్మాణంలో ఏదో లోపం జరిగిందన్న సందేహం ప్రజలలో కలిగించడానికి కుట్ర చేశారని సోషల్ మీడియాలో ఆధారసహితంగా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో అదేదో జగన్ సొంత భవనం అన్నట్లుగా అబద్దపు ప్రచారం చేశారు.  అమరావతిలో అనవసరంగా వేల కోట్లు వ్యయం చేస్తూ, విశాఖలో రూ.450 కోట్లతో ఏడు భవనాలు నిర్మించి అందంగా తీర్చిదిద్దితే దానిని వాడుకోవడం చాతకాని ప్రభుత్వంగా మారింది. ఈ తరుణంలో  అశోక్ గజపతిరాజు వచ్చి తన వంతు పాత్ర పోషించారనిపిస్తుంది. 

ఒకప్పుడు అశోక్ కు అంతగా పదవీ వ్యామోహం లేదని భావించే వారు. కాని తన స్థాయికి తగని గోవా గవర్నర్ పదవిని అంగీకరించినప్పుడు ఆయనకు పదవి పిచ్చి పట్టిందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి ఈ పదవి ఇప్పించారో, లేక స్వయంగా పైరవీ చేసుకున్నారో కాని, ఈ చిన్న పదవి తీసుకోవడం ద్వారా ఆయన తన స్థాయిని తానే తగ్గించుకున్నారని కొంతమంది విమర్శించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది.. రాష్ట్రంలోను, కేంద్రంలోను మంత్రిగా పనిచేసిన ఈయనకు అతి చిన్న రాష్ట్రాలలో ఒకటైన గోవాకు గవర్నర్ పదవి ఇవ్వడం అంటేనే  పరువు తక్కువ అనే అభిప్రాయం పలువురిలో ఉంది. 

బీజేపీ నేతలు విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కె.హరిబాబు వంటివారు ఇంతకన్నా పెద్ద రాష్ట్రాల గవర్నర్లుగా నియమితులయ్యారు. కాని వీరందరికన్నా రాజకీయంగా ఎన్నో పదవులు చేసి, సీనియర్ నేతగా ఉన్న అశోక్ కు మొక్కుబడిగా గోవా గవర్నర్ పదవి ఇస్తే పరమానందంగా స్వీకరించారని, దీనిని ఏమంటారని రాజకీయ వర్గాలు  ప్రశ్నిస్తున్నాయి. గవర్నర్  పదవిలో హుందాగా ఉండవలసిన ఈయన రాజకీయ విమర్శలు చేయడం, మాజీ సీఎంను సైకో అని అనడం బహుశా వయసు మీద పడడం వల్ల వచ్చిన సమస్య  కావచ్చేమో అన్నది కొందరి అనుమానం. 

విశేషం ఏమిటంటే ఇదే సభలో ఆయన ప్రతి ఒక్కరు అహం నియంత్రించుకోవాలని హితబోధ చేశారు.అయితే ఆయన మాత్రం అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేసి విమర్శలకు  గురయ్యారు.  

అశోక్ గజపతి రాజే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్నిసార్లు అసందర్భ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ మధ్య ఆయన ఒక సభలో మాట్లాడుతూ కనీసం 120 ఏళ్లు జీవించవచ్చని, తాను సంజీవని అనే స్కీమ్‌ తీసుకు వస్తున్నానని అన్నప్పుడు సభికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బహుశా ఆయన మనసులోని కోరికను  ఇలా బయటపెట్టారేమో అని కొందరు వ్యాఖ్యానించారు. ఇదే కాదు.. 

గతంలో హుద్ హుద్ తుపాను వచ్చిన తర్వాత, సముద్రాన్ని కంట్రోల్  చేశామని అనడం చిత్రం అనిపించింది. అమరావతిలో పది డిగ్రీల వేడి తగ్గించడానికి ఆదేశాలు ఇచ్చానని ఒకసారి, అమరావతిలో ఒలిపింక్స్ నిర్వహిస్తామని ఇంకోసారి ..ఇలా పలురకాలుగా విచిత్రమైన  వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు తమ వయసును గుర్తు చేస్తున్నారన్నఅభిప్రాయం కలుగుతుంది. ‘‘వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయం ఏమీ రాదని, దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిది’’ అన్న గజపతిరాజు వ్యాఖ్యలకు ఒక పౌరుడి స్పందన ఏమిటంటే... ‘‘అవును నిజమే! 15 నెలల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన కారణంగా ఏపీ ప్రజలు చాలామందికి పిచ్చి ఎక్కిన పరిస్థితి ఉంది, నయం చేసుకోవాలంటే విశాఖలోనే కాదు... రాష్ట్రమంతా పిచ్చి ఆస్పత్రులు పెట్టాలి. మొట్టమొదటగా విజయనగరంలో అలాంటి ఆస్పత్రి ఏర్పాటు చేస్తే మేలు’’ అని!

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement