
వృద్ధులకు వయసు పరంగా వచ్చే అనేక సమస్యలతో పాటు పళ్ల సమస్యలూ తప్పవు. వృద్ధుల పళ్లకు సంబంధించిన వైద్యశాస్త్రాన్ని ‘జీరియాట్రిక్ డెంటిస్ట్రీ’ లేదా ‘జీరియోడాంటిక్స్’ అంటారు. ఇందులో వృద్ధుల పళ్లకు వచ్చే వైద్య, ఆరోగ్య సమస్యలు, వాటి నిర్ధారణ, చికిత్స వంటి అంశాలు ఉంటాయి. పళ్లు కోల్పోకుండా కేవలం వాటికి వచ్చే సమస్యలను మాత్రమే పోగొట్టుకోవడం ఎలాగో చెప్పే కథనమిది.
ఇటీవలి వైద్యవిజ్ఞానం బాగా పురోగతమించింది. దాంతో గతం సగటుతో పోలిస్తే ప్రజల సగటు ఆయుర్దాయమూ బాగా పెరిగింది. ప్రజలు చాలాకాలం జీవిస్తున్నారు. దాంతో సమాజంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకనాడు ముసలితనానికి బోసినోరు ఒక ప్రతీక. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
జీవితంలో కష్టపడాల్సినంత పడి... తమ వృద్ధాప్యాన్ని ఒక సంతోషకరమైన మజిలీగా చేసుకుంటూ ఇకపై జీవితాన్ని అనుభవించాల్సిందంతా ఈ వయసునుంచే అనే భావన పెరగడంతో ఆ వయసునూ ఆనందమయం చేసుకుంటున్నారు. ఫలితంగా ఒకనాడు పళ్లూడిపోయే వృద్ధులకు బదులు మంచి పలువరస ఉన్నవారే ఎక్కువగా కనబడుతున్నారు. ఎందుకంటే... ఎంతగా వయసు పైబడినప్పటికీ పళ్లు, చిగుర్ల సమస్యలు రాకుండా చూసుకుంటే పళ్లు ఎన్నాళ్లైనా గట్టిగానే ఉంటాయి. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.
వృద్ధాప్యంలో వచ్చే పంటి సమస్యలు/కారణాలు
సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ పళ్లు కూడా వదులైపోతాయన్నది చాలామందిలో ఉండే ఓ అ΄ోహ. ఆ వయసులో బీపీ, షుగర్ లాంటి సమస్యలుంటే పళ్లు వాటంతట అవే ఊడి΄ోతాయని అనుకుంటారు. ఆ పరిస్థితి కోసం మానసికంగా సిద్ధపడుతుంటారు.
కానీ ఇది వాస్తవం కాదు. పళ్లకు లేదా చిగుర్లకు సంబంధించన జబ్బులు వస్తేనే పళ్లు ఊడి΄ోవడమో లేదా వదులై΄ోవడమో లేదా తీసేయాల్సిన పరిస్థితి ఎదురుకావడమో జరుగుతుంది. నోటి జబ్బులు రానంతవరకు పళ్లు జీవితకాలం దృఢంగానే ఉంటాయి.
వృద్ధాప్యంలో దంతాలకు వచ్చే సమస్యలు...
సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని దంత సమస్యలు పంటిమూలంలో వచ్చే పిప్పిపళ్లు (రూట్‌కేరిస్), పళ్లు అరిగి΄ోవడం (అట్రిషన్), చిగుర్లవ్యాధులు (పెరియోడాంటల్ డిసీజ్), పళ్ల మధ్య అక్కడోపన్ను, ఇక్కడోపన్ను కోల్పోవడం కారణంగా వచ్చే సందులు (ఎడెంట్యులిజమ్), పైవరస పళ్లు, కిందివరస పళ్ల గట్టిదనంలో నాణ్యత లేకపోవడం (పూర్ క్వాలిటీ ఆఫ్ అల్వియొలార్ రిడ్జ్), కట్టుడుపళ్లు సరిగా అమర్చకపోవడం, దవడల పక్కన ఉండే మృదువైన మ్యూకోజాలో పుండ్లు, నోటిలో పుండ్లు, నోటిలో తడి తక్కువ కావడం (గ్జీరోస్టోమియా), నోటి క్యాన్సర్లు వంటివి.
చేజేతులారా తెచ్చిపెట్టుకునే సమస్యలు...
ఇక మరికొన్ని యౌవనంలో ఉన్నప్పుడు మనలో కొందరు వారంతట వారే చేజేతులారా తెచ్చిపెట్టుకునేవే ఎక్కువ. ఉదాహరణకు వయసులో ఉన్నప్పుడు పొగతాగడం, పొగాకు నమలడం, పాన్‌పరాగ్, గుట్కా, వక్కపొడి నమలడం వంటి పంటికి చేటు చేసే అలవాట్లు. ఈ అలవాట్లను మానకపోవడం, అలా నిర్లక్ష్యం చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో పళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి.
వృద్ధాప్యంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో...
యౌవనంతో పోలిస్తే వృద్ధాప్యదశలో వ్యాధినిరోధకశక్తి ఎంతోకొంత తగ్గుతుంది. కాబట్టి అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న కొన్ని సమస్యలు పళ్లపై ప్రభావం చూపుతాయి.
వృద్ధాప్యంలో వాడుతూ ఉండే మందుల కారణంగా...
పెద్దవయసు వచ్చేనాటికి చాలామందిలో హై–బీపీ, షుగర్ సమస్యలు కనిపిస్తాయి కాబట్టి వాటికోసం మందులు వాడుతుంటారు. ఇలా... బీపీ, షుగర్‌లను అదుపులో పెట్టేందుకు వాడే మందులు, మానసిక సమస్యలకోసం వాడే యాంటీసైకోటిక్, యాంగ్జైటీని తగ్గించడం కోసం వాడే యాంగ్జియోలైటిక్స్... ఇలాంటి మందుల కారణంగా నోటిలో లాలాజల స్రావాలు తగ్గుతాయి. దాంతో అవి నోటిని పొడిబారిపోయేలా చేస్తాయి. ఈ అంశం కూడా దంతసమస్యలకు కారణమవుతుంది.
వృద్ధాప్యంలో సంపాదన లేమితో :
వృద్ధాప్యంలో చాలామందికి మునుపు ఉన్నంత సంపాదన ఉండదు. ఇలా తమకు ఉండే ఆదాయవనరులు తగ్గిపోవడం, దానికి తోడు కుటుంబసభ్యుల నుంచి అందాల్సినంత ప్రోత్సాహం ఉందక΄ోవడమనే అంశం కూడా దంత సమస్యలకు ఓ పరోక్ష కారణమవుతుంది.
పైన పేర్కొన్న అనేక సమస్యల కారణంగా పళ్లు వదులైపోవడంతో వృద్ధాప్యంలో ఆహారం తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు.. పళ్ల వల్లనే మానవుల్లో ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. పళ్లలో సమస్యల కారణంగా భాషలో స్పష్టతా లోపించి కమ్యూనికేషన్‌కూ ఇబ్బందులు కలుగుతాయి.
వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలూ – పళ్లపై వాటి ప్రభావాలు
డయాబెటిస్... పళ్ల సమస్యలు : ఈ రెండు అంశాలూ ఒకదాని కారణంగా మరొకటి కనిపిస్తూ ఉంటాయి. అంటే డయాబెటిస్ ఉన్నవారిలో పళ్లూ, చిగుళ్ల సమస్యలు ఎక్కువ. అలాగే పళ్లూ చిగుళ్ల సమస్యలు ఉన్నవారిలో... ఆ అంశాలు రక్తంలోని గ్లూకోజ్ పెరిగేలా చేసి, డయాబెటిస్‌కు కారణమవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారూ పంటి జబ్బుల విషయంలో జాగ్రత్తపడాలి.
లేనివారూ పళ్లను శుభ్రంగా ఉంచుకుని డయాబెటిస్‌ను రాకుండా నివారించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి సీరియస్ చిగుర్ల సమస్యలు, దంతక్షయం, లాలాజల గ్రంధులు సరిగా పనిచేయకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లైకెన్‌ప్లానస్, లైకెనాయిడ్ రియాక్షన్, నోటి ఇన్ఫెక్షన్లు అంత తేలిగ్గా తగ్గకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.
నివారణకు సూచనలివి : పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఆర్నెల్లకోమారు దంతవైద్యుడిని కలిసి క్లీనింగ్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ ΄ాళ్లను సమర్థంగా నియంత్రించుకుంటూ ఉండేలా తగిన మందులు తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవలి. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్లు సూచించినవిధంగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకోవాలి.
గుండెజబ్బులూ... చిగుర్ల వ్యాధులు...
ఇటీవలి కొత్త పరిశోధనల వల్ల నోటి ఆరోగ్యానికీ, గుండెజబ్బులకూ దగ్గరి సంబంధం ఉందని తేలింది. సాధారణంగా చిగుర్ల వ్యాధి ఉన్నవాళ్లలో... తమకు పెద్దగా నొప్పి తెలియకుండానే పంటికింద ఉండే గులాబిరంగు చిగురుభాగం నెమ్మదిగా కిందికి కిందికి తగ్గుతూపోతుంది.
కానీ పంటి కింది ఎముక భాగం కూడా నాశనమయ్యే దశకు చేరినప్పుడు, అక్కడ చేరిన బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలుస్తుంది. దాంతో అది గుండె కండరాన్ని దెబ్బతీసి, గుండెజబ్బులకూ దారితీసే ప్రమాదం ఉందని ఇటీవలి అనేక పరిశోధనల వల్ల తేలింది.
ఇక పంటి మీద ఉండే పాచి/గారలో ఉండే సూక్ష్మక్రిములు రక్తనాళాలల్లోకి చేరడం వల్ల రక్తనాళాలు సన్నబడి కూడా రక్తప్రవాహ సంబంధమైన (వాస్క్యులార్ డిసీజెస్) రావచ్చు. పెద్దవయసువారంతా తెలుసుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే దీర్ఘకాలంగా ఉండే చిగుర్ల వ్యాధుల వల్ల అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ముప్పు కూడా ఉంటుంది.
నివారణకు సూచనలివి : ఈ సమస్య నివారణకు చేయాల్సిందల్లా సరైన రీతిలో బ్రషింగ్, మన ఆహారాన్ని బాగా నమిలి మింగడం. ఈ రెండూ శ్రద్ధగా చేస్తూ ఉంటే... పెద్దవయసు వారిలో చాలావరకు గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారించవచ్చు.
పక్షవాతం – పంటి జబ్బులు: పక్షవాతానికి, పంటిజబ్బులకూ నేరుగా సంబంధం లేకపోయినా... గుండెజబ్బులకు ఉన్న సంబంధమే ఇక్కడా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు పంటికి పట్టే గార/పాచి (ప్లాక్) వంటివి, పంటి జబ్బుల వల్ల రక్తప్రవాహంలో పేరుకుపోయే సూక్ష్మక్రిముల వల్ల రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుని అది రక్తం సాఫీగా ప్రవహించకుండా అడ్డుపడటం జరుగుతాయన్న విషయం తెలిసిందే.
ఇదే ప్రమాదం గుండెకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే అది గుండెపోటుకు దారితీస్తుంది. ఒకవేళ అదే మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల (ధమనుల) విషయంలో జరిగితే అది పక్షవాతానికి దారితీసే ప్రమాదముంటుంది.
నివారణకు సూచనలివి: పంటి జబ్బులను నివారించుకోవడం లేదా నిరోధించుకోవడం; పంటి సమస్యలను దూరం చేసుకోవడం; పంటి శుభ్రతను పాటించడం (డెంటల్ హైజీన్) వల్ల ఒకవైపు గుండెజబ్బులనూ మరోవైపున పక్షవాతాన్నీ నివారించుకోగలమని గుర్తుంచుకోవాలి.
చివరగా... ఒకవేళ నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోయినవారు, దురదృష్టవశాత్తూ తమ పళ్లు కోల్పోయినప్పటికీ... వాళ్ల దవడ ఎముక ఎంత సన్నగా ఉన్నప్పటికీ, కృత్రిమ దంతాలు అమర్చడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనకు అందుబాటులో ఉన్న నేటి డెంటిస్ట్రీలో అందుబాటులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ దంతాలను అమర్చడం, ఎలాంటి దంతసమస్యలకైనా పరిష్కారాలను అందించడమూ పూర్తిగా సాధ్యమయ్యే విషయమే.
ఆర్థరైటిస్... పంటి సమస్యలు
దాదాపుగా 65 ఏళ్లుదాటిన 50 శాతం మందిలో ఎముకలకు సంబంధించిన జబ్బు అయిన ఆర్థరైటిస్ కనపడుతుంది. దీనివల్ల ఎముకల మధ్య రాపిడి, ఎముకల సాంద్రత తగ్గి, పెళుసుగా మారడం, ఫలితంగా అవి తేలిగ్గా విరిగి΄ోవడంలాంటివి తరచూ జరుగుతుంటాయి. ఈ జబ్బులో కూడా ఎముకలు, కీళ్ల మధ్య నొప్పిని నివారించడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఎస్‌ఏఐడీ మందులు) వాడటం సాధారణం.
ఈ ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సాధారణంగా మెథోట్రెక్సేట్ అనే మందులను ఉపయోగిస్తారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే. ఉదాహరణకు మెథోట్రెక్సేట్ మందులు వాడేవాళ్ల నోళ్లలో పుండ్లు (అల్సర్స్) వస్తుంటాయి. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు వాడే గోల్డ్ సోడియమ్ థయోమెలనేట్ అనే మందు వల్ల జింజివైటిస్ అనే చిగుర్లకు వచ్చే ఇన్ఫెక్షన్, గ్లాసైటిస్ అనే నాలుక ఇన్ఫెక్షన్, స్టొమటైటిస్ అనే నోటి ఇన్ఫెక్షన్‌లు వస్తాయి.
ఇక పై మందుల వాడకం వల్ల రక్తంలోని తెల్లరక్తకణాలు తగ్గడం, ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గడం వంటి దుష్పరిణామాలూ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల రోగనిరోధకశక్తి తగ్గడం, పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం వంటి పరిణామాలూ కనిపిస్తుంటాయి.
లాలాజల గ్రంథులు...నోటి సమస్యలు
నోటిలో ఉరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఇది నిత్యం నోటిలో ఉండే ఆహారపదార్థాలను కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ బాధితులతో బాటు, కొన్ని వ్యాధుల్లో మందులు తీసుకునేవారికి, తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారికి లాలాజలం తగ్గుతుంది.
నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. నోరు పొడిబారిపోవడం దీర్ఘకాలంపాటు సాగితే నోటిలోని మృదుకణజాలం దెబ్బతిని, నొప్పి వస్తుంది. దాంతో దంతక్షయం (టూత్ డికే), చిగుర్ల వ్యాధులకు అవకాశాలు పెరుగుతాయి.
కొన్ని సూచనలూ – మరికొన్ని చికిత్సలు...
లాలాజల స్రావాలు తగ్గి తరచూ నోరు పొడిబారుతుంటే తక్షణం దంతవైద్యులను కలవాలి. వారు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్)గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు. కొన్ని చక్కెర లేని గమ్స్, మింట్స్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి.
దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్‌ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్‌ను చాలా తక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్‌ను మానివేయడం మేలు.
హైబీపీ – పంటిసమస్యలు
ఈ రెండు అంశాలకూ మధ్య సంబంధం ఉంది. హై–బీపీతో బాధపడేవారిలో వాళ్ల అధిక రక్తపోటు అనే అంశం గుండెజబ్బులకూ, గుండెపోటుకు దారితీయకుండా కొన్ని మందులు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. పంటి సమస్యలు ఉన్నవారికి ఇచ్చే నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఎన్‌ఏఐడి మందుల) వల్ల... హై–బీపీ ఉన్నవారు తాము తీసుకునే మందుల ప్రభావం తగ్గుతుంది. దీంతోపాటు మరో ప్రమాదమూ ఉంది.
హై–బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల వల్ల నోటిలో తడి తగ్గి అది జీరోస్టోమియా అన్న కండిషన్‌కు దారితీస్తుంది. ఈ జీరోస్టోమియా కూడా పంటి సమస్యలను పెంచడమే కాకుండా... పలువరసలో అమర్చిన కృత్రిమ దంతాలకూ, స్క్రూల వంటి అనుబంధ అంశాలకూ నోటిలోని మృదుకండరాలకూ మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్)ను పెంచి మరిన్ని పంటి సమస్యలకు దారితీసేలా చేస్తుంది.
క్యాల్షియమ్ బీటా బ్లాకర్స్ అనే మందులు వాడే పది శాతం మందిలో దాని తాలూకు సైడ్‌ఎఫెక్ట్‌గా జింజివల్ హైపర్‌ప్లేసియా అనే చిగుర్లవ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి మందులు మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే ఇది కనిపిస్తుందని అనేక పరిశీలనల్లో తేలింది.
నివారణకు సూచనలివి...
హైబీపీకి మందులు వాడేవారు తమకు ఎదురైన అనుభవాన్ని తమ ఫిజీషియన్‌ను వివరించి, తరచూ తమ దంతవైద్యులను కూడా కలిసి తమ మందులను వారిచేత కూడా సమీక్షింపజేసుకుంటూ ఉండాలి. సరైన నోటి శుభ్రత పాటిస్తూ డయాబెటిస్‌ను సాధ్యమైనంతవరకు నివారించుకుంటూ ఉండటం మేలు.
డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, సీనియర్ డెంటల్ స్పెషలిస్ట్