
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కక్షగట్టారని, కమిషన్ పేరుతో టైంపాస్ చేశారని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. అలాంటి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష గట్టారు. కాంగ్రెస్ కాళేశ్వరంపై ఎన్నికల ముందు నుండే అడ్డమైన ఆరోపణలు చేస్తోంది.
సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థలంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. కానీ, ఆయన విమర్శించే సీబీఐకే రేవంత్ కాళేశ్వరం కేసు అప్పగించారు. ఇవాళేమో మూసీ పునరుజ్జీవం(జలాల అనుసంధానం) పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తోంది. మల్లన్న సాగర్ వద్ద కాకుండా తలాతోకా లేకుండా గండిపేట వద్ద శంకు స్థాపన చేస్తున్నారు.
కాళేశ్వరం కూళేశ్వరం అయ్యింది అని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అదే ప్రాజెక్టు నీళ్లను హైదరాబాద్‌కు తెస్తున్నారు. అదే కాళేశ్వరం ద్వారా గంధమల్ల రిజర్వాయర్‌కి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే.. కాళేశ్వరంపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ తెస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టువి అవునో.. కాదా ఆయన సమాధానం చెప్పాలి..
కాళేశ్వరం ప్రాజెక్టుకు 94 వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. మరి లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ జరిగింది?. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను బద్నాం చేస్తున్న వారు ముక్కు నేలకు రాయాలి. ఎల్లకాలం మోసం చేయలేమని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని కేటీఆర్ అన్నారు. అదే సమయంలో..
విడతల వారిగా భారీ అవినీతికి ప్రభుత్వం తెరతీసిందని ఆరోపించారాయన. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన సంస్థనే కూలిన పిల్లర్లను నిర్మిస్తామని ముందుకు వస్తే.. ప్రభుత్వం అడ్డుకుంటోంది. కొండ పోచమ్మ ద్వారా రూ.1,100 కోట్లతో హైదరాబాద్‌కి నీళ్లు తేవోచ్చు. కానీ, ఈ రోజు రూ. 7,700 కోట్లకు వ్యయం.. అంటే 7 రెట్లు ఎలా పెరిగింది?. కేవలం కమిషన్ ల కోసమే వ్యయం పెంచారు. అవినీతే కాదు ఇందులో క్రిమినల్ కోణం కూడా ఉంది. సుంకిశాల రైటింగ్ వాల్ కూలిన సంస్థకే రూ.7,400 కోట్ల ప్రాజెక్ట్ ఎలా ఇస్తున్నారు?. వారిపైన చర్యలు తీసుకోక పోగా వారికే మళ్ళీ కాంట్రాక్ట్ లు ఎలా ఇస్తున్నారు?. ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపణలు చేసిన వారికి ఇప్పుడు బెస్ట్ ఇండియా కంపెనీ ఎలా అయ్యింది అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తటస్థ వైఖరి అవలంభిస్తోందని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. ఫిరాయింపుల వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రజాస్వామాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని అన్నారాయన. ‘‘బీఆర్‌ఎస్ పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నాం అని టీపీసీసీ అధ్యక్షుడే ఒప్పుకున్నారు. అలాంటప్పుడు ఇంక విచారణ దేనికి?. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలి’’.. కేటీఆర్ డిమాండ్ చేశారు.