Annadata Poru: గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించిందా? | CBN Govt fears For YSRCP Annadata Poru Program | Sakshi
Sakshi News home page

Annadata Poru: గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించిందా?

Sep 8 2025 7:52 PM | Updated on Sep 8 2025 8:15 PM

CBN Govt fears For YSRCP Annadata Poru Program

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్‌సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. 

రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ముందు వేచి ఉండాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే యరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు చేరుతోంది. నల్లబజార్‌లో రూ.200 అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్‌కు తరలిస్తూ, కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఒక్క యూరియా ద్వారానే దాదాపు రూ.200 కోట్ల మేరకు అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి రుజువుగా పలుచోట్ల యూరియా అక్రమంగా తరలిస్తుండటం, రైతులే దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కనీసం కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాజిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్‌లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయి.

ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్‌లపై దిగి వచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధ‌ర‌ల‌కే రైతులంద‌రికీ స‌క్ర‌మంగా పంపిణీ చేయాలి. ఇన్‌పుట్ స‌బ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. ట‌మాట‌, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించాలి. గ‌త వైఎస్సార్సీపీ హ‌యాంలో మాదిరిగా ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్‌లో పోటీ పెంచాలి. 

ప్రైవేటు వ్యాపారుల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసి మ‌ద్ద‌తు ధ‌ర‌కు ఒప్పించి రైతుల‌కు అండ‌గా నిల‌బ‌డాలి. తదితర రైతాంగ డిమాండ్‌లపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరును ముందకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దీనిపై రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే 7వ తేదీన అన్ని నియోజకర్గ కేంద్రాల్లోనూ, 8న అన్ని మండల కేంద్రాల్లోనూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.

యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించిన తీరు, బెదిరిస్తూ మాట్లాడటం, సమస్యే లేదని చెప్పడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు ఉన్నా కూడా రైతుల్ని బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో సమస్యే లేదని దబాయించి మాట్లాడుతున్న వైనంపై సమస్య లేదని, వైఎస్సార్ సీపీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్‌పై రైతుల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. 

మరోవైపు ఈ సీజన్‌లో కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే, ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వంలోనే సరైన సమాధానం లేదు. సీజన్‌కు సంబంధించి ముందుగా పంటల సాగు, ఎరువుల అవసరంపై ఎందుకు ప్రణాళికలను సిద్దం చేసుకోలేకపోయారు, ముందస్తుగా సమీక్షా సమావేశాలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.

ప్రభుత్వంలో కలవరం!
అన్నదాత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ ఆందోళనలకు సిద్దం కావడంతో కూటమి సర్కార్‌లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రైతుల విషయంలో ఇదొక విఫల ప్రభుత్వం, పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటోంది. 

కూటమి పాలనకు ముందు.. గత అయిదేళ్ళ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో రైతులు పోల్చి చూస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీనీ సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే అవసరమైన మేరకు ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయానిన్ని అందించడం ద్వారా అప్పుల పాలు కాకుండా రైతులకు అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన అన్ని రకాల పంటలకు మార్కెట్‌లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం ఇలా అనేక అంశాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మంచిని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. 

తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్‌లో రేటు లేని పరిస్థితుల్లో రైతులను పట్టించుకోకుండా వదిలేసిన కూటమి సర్కార్ నిర్వాకాన్ని రైతులు పోల్చి చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీతో కలిసి తమ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి చూపించేందుకు అన్నదాత పోరులో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనేందుకు సిద్దమైంది.

రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ.. చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌

  • అన్నదాత పోరు కార్యక్రమంతో.. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌ట్ల చిత్తశుద్ధిలేని కూటమి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై నిల‌దీత 
  • సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తడం 
  • రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా రైతుల‌కు విత్త‌నం నుంచి విక్ర‌యం ద్వారా అడుగడుగునా అండగా నిల‌బ‌డ్డ జగన్‌ ప్రభుత్వం
  • గత 15 నెల‌ల పాల‌న‌లోనే రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా పేరు తెచ్చుకున్న కూటమి. 
  • యూరియా పంపిణీ కేంద్రాల వ‌ద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు పడిగాపులు పడ్డా ఉత్త చేతులే
  • రైతుల‌కు పార్టీ ముద్ర వేస్తూ.. యూరియా కొర‌త లేద‌ని చెబుతున్న చంద్ర‌బాబు 
  • యూరియా కోసం క్యూ లైన్ల‌లో నిల‌బ‌డిన రైతుల‌ను హేళన చేస్తున్న వ్య‌వ‌సాయ మంత్రి అచ్చెన్నాయుడు 
  • గ‌త వైఎస్సార్సీపీ హ‌యాంలో ఎక్క‌డా ఆర్బీకే సెంట‌ర్ల ముందు క్యూలైన్లు క‌నిపించిన ఫొటో ఒక్క‌టైనా చూపించగలరా?
  • ఇన్‌పుట్ స‌బ్సిడీ ఇవ్వ‌లేని స్థితిలో చంద్రబాబు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement