
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం 16 నెలలు తర్వాత ఉద్యోగులతో హడావుడిగా చర్చలు జరిపి ఒకే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడంపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందంటూ విమర్శించింది. ఈరోజు( శనివారం, అక్టోబర్ 18వతేదీ) పెన్షనర్ల సంఘ నాయకులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి సమావేశాలు జరిపి ఒక్క విడత డి ఏ మాత్రమే అనౌన్స్ చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు.
ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, 4 విడతలు డిఏ పెండింగ్ ఉంటే ఒకటి విడత మాత్రమే మంజూరు చేయడం, ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు మాట ఎత్తక పోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేక పోతోంది దీపావళి పండుగకు ఇవి తప్పక ఇస్తారని ఎదురు చూశారు కానీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి దీపావళి కానుక ఒక్క డీ ఏతో తుష్ మనిపించారు’ అని విమర్శించారు.
కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి చూపెట్టారు. ఉద్యోగులకు ఐఆర్‌పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు.. పీఆర్‌సీపైనా కూడా నోరు మెదపలేదు. వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు.. కేవలం సింగిల్ డీఏతో సరిపెట్టేశారు. నాలుగు డీఏల్లో ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇక, ఐఆర్, పీఆర్‌సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులుకు కేవలం ఒక డీఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది.
చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపినప్పటికీ, చివరికి ఒక డీఏనే ప్రకటించారు చంద్రబాబు. మరొకవైపు పెండింగ్ బకాయిల అంశానికి సంబందించి కూడా ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.