
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్థన్‌తో వీడియో చేయించారని ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబుకు సవాల్ విసిరారు. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు ఎల్లో మీడియా సైతం సిద్దమా అని సవాల్ చేశారు. ఇక, బార్లలో నెలకు రూ.5 కోట్లు భారీ అవినీతి జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నకిలీ మద్యాన్ని కవర్ చేయడం తెలియక ఎల్లో మీడియా చచ్చిపోతుంది. ఈనాడులో నకిలీ మద్యం మీద వార్తలే లేవు!. నకిలీ మద్యంపై ఆంధ్రజ్యోతి వార్తలు జుగుప్సాకరంగా ఉన్నాయి. జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదు. జనార్థన్, సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. నకలీ మద్యం కేసులో ఏ1 జనార్థన్ పెళ్లికి వచ్చినట్టు గన్నవరంలో దిగాడు. జనార్థన్‌తో కూటమి ప్రభుత్వ పెద్దలు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలాడారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు జనార్థన్‌తో వీడియో చేయించారు.
అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్‌లు..
కూటమి ప్రభుత్వం వచ్చాక క్యూఆర్ కోడ్ ఎందుకు రద్దు చేశారు. నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముకోవడానికే క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. మళ్లీ ఏడాదిన్నర తర్వాత క్యూఆర్ కోడ్ ఎందుకు తెచ్చారు?. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందానా.. క్యూఆర్ కోడ్ రాగం ఎత్తుకున్నారు. నకిలీ మద్యం వ్యవహారం చేయిదాటి పోతుందనే క్యూ ఆర్ కోడ్ తెచ్చారు. క్యూ ఆర్ కోడ్‌పై కూటమి నేతలు డ్రామాలు మానుకోవాలి. రాష్ట్రంలో పర్మిట్ రూమ్‌లేని షాపులు ఉన్నాయా?. పట్టణాల్లో పర్మిట్ రూమ్‌కు రూ.7.5లక్షలు, గ్రామాల్లో 5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్‌లు పెట్టారు. ఏపీలో 3736 మద్యం దుకాణాలు ఉంటే 3736 పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది. రాష్ట్రంలో లక్షా 50వేలకు పైగా బెల్టు షాపులు ఉన్నాయి. బెల్టు షాపులు ఏర్పాటు చేసింది నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముకోవడానికే కదా.
నగదుకే మందు ఎందుకు?..
రూ.99 మందును రెండు నెలలకే అటక ఎందుకెక్కించారు?. రూ.99కే మందు దొరికితే నకిలీ మద్యం అమ్ముకోవడం కుదరదు కాబట్టే ఆపేశారు. కూటమి ప్రభుత్వంలో పది శాతం కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు. వైన్ షాపుల్లో 25 శాతం డిజిటల్ పేమెంట్స్ అంటే చంద్రబాబు ఎలా నమ్ముతున్నారు?. నగదుకే మందు ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు తెలియదా?. జనార్థన్ ఫ్యాక్టరీలో మందు నకిలీయే కానీ.. ప్రమాదం కాదట!. నకిలీ మద్యం అయినా తాగేయమని అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు’ అంటూ మండిపడ్డారు.

చంద్రబాబుకు సవాల్
చంద్రబాబు.. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా?. నెలకు రూ.5 కోట్లు దండుకుని బార్లలో పెద్ద ఎత్తున స్కాం చేస్తున్నారు. ప్రభుత్వ డిపోల నుండి కాకుండా బయటి నుండి పెద్ద ఎత్తున సరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఆ మద్యం విక్రయాల కోసం నెలకు రూ.5 కోట్లు లంచాల కింద వసూలు చేస్తున్నారు. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?. చంద్రబాబుకు దమ్ముంటే బార్లలో తనిఖీలు చేసేందుకు రాగలరా?. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు ఎల్లోమీడియా, రాజకీయ పార్టీల సమక్షంలో మేము సిద్దం. మా హయాంలో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?. నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. మద్యం సీసాల మీద క్యూఆర్ కోడ్ పెట్టామని ప్రెస్ మీట్ పెట్టేంత ఖాళీగా చంద్రబాబు ఉన్నారు. రోజుకు రూ.3 లక్షల బిజినెస్ చేయకపోతే బార్లకు నష్టం వస్తుంది. విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు లాంటి నగరాల్లో నెలకి రూ.80 లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి. ఈ మేరకు ఆ షాపులు కొనుగోలు చేస్తున్నాయా?. ప్రభుత్వానికి చాలెంజ్ చేస్తున్నా.. ఆ వివరాలు బయట పెట్టగలరా?.
కరకట్టకే డబ్బంతా..
డబ్బంతా కరకట్ట బంగ్లాలోకి వెళ్తోందా? విమానాల్లో హైదరాబాద్ వెళ్తుందో చెప్పాలి. నకిలీ మద్యం తాగినా జనం చనిపోరని ఎల్లోమీడియా రాసింది. అంటే నకిలీ మద్యం తాగొచ్చని ప్రభుత్వమే స్టాంప్ వేసినట్టు కాదా?. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా?. రేపోమాపో జయచంద్రారెడ్డిపై సస్పెన్షన్ ఎత్తేస్తారు. జనార్థన్‌కి బెయిల్ ఇప్పించి బయటకు తెస్తారు. నకిలీ మద్యం తయారు చేసిన జయచంద్రారెడ్డి, జనార్ధన్, సురేంద్ర నాయుడు ఫోన్లను అధికారులు ఎందుకు సీజ్ చేయలేదు?. ఏ సంబంధం లేని జోగి రమేష్ ఫోన్లను ఎందుకు సీజ్ చేశారు?. అన్ని వర్గాల ప్రజలను పథకాల పేరుతో చంద్రబాబు నిలువునా మోసం చేశారు. పిఠాపురం వర్మ నుండి తాగుబోతుల వరకు ఇలా అందరినీ మోసం చేశారు. మద్యం షాపుల ఓనర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఈ విషయం వచ్చే సెప్టెంబరు నాటికి తెలుస్తుంది.