
- వైఎస్సార్‌సీపీ దుగ్గిరాల జెడ్పీటీసీ భర్త దాసరి వీరయ్యపై అక్రమ కేసు
- నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ధర్నా చేసినందుకూ కేసులు
- నిజాలు వెల్లడిస్తున్న సాక్షి మీడియాపైనా పోలీసులను ఉసికొల్పుతున్నారు
- రాష్ట్రంలో కూటమి అరాచకాలను ఎదిరించే వారిపై వేధింపులు
- వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ఆగ్రహం
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా ఉంటూ, పార్టీ నిర్వహిస్తున్న నకిలీ లిక్కర్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త దాసరి వీరయ్యపై పోలీసులు అక్రమంగా హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఒక హత్య కేసుతో సంబంధం లేకపోయినా కూడా దాసరి వీరయ్యను ఆ కేసులో నిందితుడిగా చేర్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలతో వీరయ్యకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తప్పుడు వాంగ్మూలం తీసుకుని దొంగ సాక్ష్యాలతో ఒక కట్టు కథ అల్లారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వ్యతిరేక గళం వినిపించకూడదన్న నియంత ఆలోచనలతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మనోహర్‌రెడ్డి చెప్పారు.
నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా గళమెత్తినందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతోపాటు మరో 13 మంది వైయస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదే నకిలీ మద్యం గురించి వార్తలు రాసినందుకు సాక్షిమీడియాపై 17 అక్రమ కేసులు నమోదు చేశారని, ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు ఎలా తెలిసిందో సోర్స్ చెప్పాలని వేధించడం రాజ్యాంగం ఇచ్చిన మీడియా స్వేచ్చను కాలరాయడమేనని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే ...
కుట్రపూరితంగా దాసరి వీరయ్యపై కేసు బనాయించారు
చట్టాన్ని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం కూటమి నాయకుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తోంది. కూటమి నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ పోలీసులు రోజురోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా అమల్తూరు మండలం యడవూరు గ్రామానికి చెందిన నాగ గణేశ్, కొలకలూరు గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనాదేవి అనే యువతి వారి కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా కోటిలింగాల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
అనంతరం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పోలీసుల రక్షణ కోరారు. ఇరువురు తల్లిదండ్రులను పోలీసులు పిలిపించగా అమ్మాయి తల్లిదండ్రులు నచ్చలేదని వెళ్లిపోయారు. దీంతో నవ దంపతులు కొత్త కాపురం పెట్టుకుని జీవిస్తుండగా, ఇటీవల కీర్తి వీరాంజనాదేవి అన్న కాపు కాసి ఆమె భర్త నాగ గణేశ్‌ను మరికొందరితో కలిసి తండ్రి ముందరే నరికి చంపేశాడు. దీనిపై ప్రత్యక్ష సాక్షి, మృతుడు నాగ గణేశ్ తండ్రి స్టేట్‌మెంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంతటితో ఆగకుండా ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్‌సీపీ నాయకుడు, దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త అయిన దాసరి వీరయ్యని నిందితుడిగా చేర్చారు.
మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్‌ని ఎదిరించి నిలబడిన కారణంగా ఆయనపై పోలీసులు ఈ విధంగా అక్రమ కేసు బనాయించారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మొన్న అర్థరాత్రి అరెస్ట్ చేసి నిన్న రాత్రి కోర్టులో హాజరు పరిచారు. ఈ వాంగ్మూలం కాపీలో పేర్లు, చిరునామా దగ్గర నుంచి చంపిన ఘటన వరకు వారే ప్రశ్నలు వేసినట్టు, వారే సమాధానాలు రాసుకున్నారు. నాగ గణేశ్‌ని చంపడం వెనుక మాస్టర్ మైండ్ దాసరి వీరయ్య అన్నట్టుగా ఆయన అండదండలతోనే హత్య చేసినట్టుగా ఒక కథనం అల్లారు. దాన్ని ధ్రువీకరిస్తూ ఇద్దరు మధ్య వ్యక్తులతో సాక్షి సంతకాలు చేయించుకున్నారు.
మధ్యవర్తుల సమక్షంలో సంతకం చేయడానికి దాసరి వీరయ్య సంతకం చేయడానికి నిరాకరించినట్టు మళ్లీ మధ్యవర్తులతో సంతకాలు చేయించుకున్నారు. చేయని నేరాన్ని అంగీకరించాలంటూ దాసరి వీరయ్యను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. తనపై అన్యాయంగా అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎలాంటి సంబంధం లేకపోయినా 302 కేసులో ఇరికించారని దాసరి వీరయ్య స్వయంగా మెజిస్ట్రేట్‌కి వివరించారు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో జరిగిన పరువు హత్య ఘటనలో ఆ ఊరితో సంబంధమే లేని దాసరి వీరయ్యను పోలీసులు అక్రమంగా ఇరికించారు. ప్రమోషన్ల ఆశ చూపించి కొంతమంది పోలీసులను రాజకీయ ప్రతీకార దాడులకు కూటమి నాయకులు వాడుకుంటున్నారు.
ధర్నా చేసినందుకు 13 మందిపై హత్యాయత్నం కేసు
నకిలీ మద్యం వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ పిలుపునివ్వడంతో పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో పార్టీ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొంచెం పెనుగులాట జరిగింది. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఒకరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
నిరసనలో పాల్గొన్నందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతోపాటు మరో 13 మందిపై పోలీసులను చంపడానికి ప్రయత్నం చేశారంటూ 307 కింద అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. ఎక్కడ చూసినా అక్రమ కేసులే. విచారణ పేరుతో పదే పదే పిలిపించడం వంద ప్రశ్నలు రాసుకొచ్చి వాటికి సమాధానాలు చెప్పాలని వేధించడం పోలీసులు అలవాటుగా మార్చుకున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
సాక్షి మీడియాపై 17 అక్రమ కేసులు
నకిలీ లిక్కర్ గుట్టురట్టు చేయడమే నేరమన్నట్టు సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. విచారణ పేరుతో సాక్షి ఎడిటర్‌ను పిలిపించి గంటలకొద్దీ కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్నారు. నకిలీ లిక్కర్ దందా వెలికితీసిన వ్వవహారంలో వార్తలు రాయడినికి దొరికిన సోర్స్ వివరాలు చెప్పాలని వేధిస్తున్నారు.
సోర్స్ చెప్పే అవసరం లేని పత్రికా స్వేచ్ఛ ఉందని తెలిసీ, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని తెలిసీ పోలీసులు సాక్షి కార్యాలయాన్ని చుట్టుముట్టి వార్త ఎవరు రాశారు? ఎవరు ఎడిట్ చేశారు? వార్తకు సోర్స్ ఏంటి చెప్పాలంటూ వంద ప్రశ్నలు రాసుకొచ్చారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో సాక్షి ప్రసారాలు రాకుండా కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారు. ఏకంగా సాక్షిపై 17 కేసులు నమోదు చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు.
కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో శ్మశాన వాతావరణం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, వైఎస్సార్‌సీపీ నాయకుల మీద హత్యాయత్నం, హత్య కేసులు బనాయిస్తున్నారు. కోర్టు పదే పదే మొట్టికాయలేస్తున్నా లెక్కచేయకుండా కూటమి నాయకులకు ఊడిగం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ఇలాంటి పోలీసులంతా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. వారిని న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెట్టడం ఖాయం. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతాం’ అని హెచ్చరించారు,
ఇదీ చదవండి:
లేఖ రాశానని.. నా భర్తను అరెస్ట్ చేశారు: మేకతోటి అరుణ