బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం! | CBN your record in dropping crop rates is unbeatable Says YS Jagan | Sakshi
Sakshi News home page

బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!

Sep 16 2025 9:30 AM | Updated on Sep 16 2025 11:01 AM

CBN your record in dropping crop rates is unbeatable Says YS Jagan

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్‌పై తన ఎక్స్‌ ఖాతాలో ధ్వజమెత్తారాయన. 

చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?..

.. క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ  తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. 

ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్‌ చేశారాయన. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement