సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో క్రెడిట్ చోర్ పదం విస్తృతంగా ఉందని.. క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరేనంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇతరుల క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు, లోకేష్ విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు. 2014-19లో కూడా విదేశాల్లో పర్యటనలు చేశారు. కానీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు’’ అని చంద్రశేఖర్ మండిపడ్డారు.
‘‘ఎయిర్ బస్, ఆలీబాబా లాంటి సంస్థలు సహా 150 సంస్థలు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఎల్లో మీడియా వార్తలు రాశాయి. మరి ఆ పెట్టుబడులు ఏవీ?. ఒక్క సంస్థ కూడా ఎందుకు రాలేదు?. చంద్రబాబు తన జల్సాల కోసమే విదేశాల్లో విహరిస్తున్నారు. ఏపీలో దోచుకున్నదంతా చంద్రబాబు విదేశాల్లో దాచుకోవటానికే వెళ్తున్నారు. తన ప్రచార పిచ్చికి ఎల్లో మీడియాని వాడుకుంటున్నారు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన డేటా సెంటర్ చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు.
..2020లోనే జగన్ అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. ఐటీ పార్కు నిర్మాణం ద్వారా 25 వేల ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందం కూడా చేశారు. సింగపూర్ నుండి సబ్‌సీ లైన్‌కు అప్పుడే శంకుస్థాపన చేశారు. అంతా అయిన తర్వాత చంద్రబాబు వచ్చి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న అదానీ పేరును చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?. అదానీ పేరు చెబితే జగన్ హయాంలో జరిగిన ఒప్పందాలు, పెట్టబడుల విషయాలు వెలుగులోకి వస్తాయని భయం’’ అంటూ చంద్రశేఖర్ పేర్కొన్నారు.


