
సాక్షి, తాడేపల్లి: ఏడాదికి పైగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రతిపక్షనేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా ద్వారా సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్మూ, ధైర్యం కూటమి నేతలకు ఉందా? అంటూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సవాల్ చేశారు.
తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రశ్నలకు బదులివ్వలేక వైఎస్సార్‌సీపీ పైనా, వైఎస్ జగన్ పైనా వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని అన్నారు. అక్రమ కేసులతో, ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారంతో వైఎస్సార్‌సీపీని నిలువరించాలనుకోవడం చంద్రబాబు, లోకేష్‌ల అవివేకమని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..
కూటమి ప్రభుత్వం విషపు కత్తులకు తేనె పూసి, వాస్తవాలను వక్రీకరిస్తూ, అవాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్ముతూ ప్రజల్లో విష గుళికలు చల్లడం టీడీపీకి నిత్యకృతమైపోయింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ మా పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సంధించారు. వాటికి కూటమి దగ్గర సమాధానాలు లేక ఆయన మీద నిందలు మోపడానికి పచ్చ బ్యాచ్ సిద్ధమైపోయింది.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చుకోలేని దుస్థితిలోకి వెళ్లిన చంద్రబాబు. కొంతమంది దళిత సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను మీడియా ముందుకు పంపించి వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా అప్పులు తెచ్చిన ఈ డబ్బంతా ఏమైందని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ప్రభుత్వం తరఫున నాదెండ్ల మనోహర్, వర్ల రామయ్య, హోంమంత్రి అనిత వంటి వారు మాట్లాడినా ఏ ఒక్కరూ సూటిగా సమాధానం చెప్పలేకపోయారు.
దళిత ద్రోహి చంద్రబాబు
ఒక పక్క దళితులకు అందాల్సిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ఎగ్గొట్టేస్తుంటే లబ్ధిదారుల తరపున ఆయన్ను ప్రశ్నించకుండా దళిత ఎమ్మెల్యేలు చంద్రబాబుని సంతృప్తి పరచడానికి సిగ్గులేకుండా జగన్‌ని తిట్టడానికి ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. వైఎస్ జగన్ దళితులను ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కాదని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అసందర్భంగా మాట్లాడుతున్నాడు. మా నాయకులు వైఎస్ జగన్‌తో కలిసి వారింట్లోనే వారి డైనింగ్ టేబుల్ మీద ఆయనతో కలిసి నేను రెండుసార్లు భోజనం చేశాను.
నీకు చంద్రబాబుతో కలిసి ఆయన ఇంట్లోకి వెళ్లే అవకాశం దక్కిందా అని ప్రశ్నిస్తున్నా.? వైఎస్ జగన్‌ని తిట్టడానికే నక్కా ఆనందబాబును చంద్రబాబు వాడుకుంటున్నాడు. సినిమాల నేపథ్యంలో ఏర్పాటైన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డ్రామా పార్టీ అని ఆనందబాబు చెప్పడం చూస్తుంటే ఆయన ఎంతటి అజ్ఞానో అర్థమవుతుంది. ఉన్నత చదువులు చదువుకున్న దళిత బిడ్డల్ని బహిరంగంగా రోడ్డు మీద అమానుషంగా లాఠీలతో కొడుతుంటే గలీజు బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ తాను పుట్టిన కులాన్నే అవహేళన చేసేలా ఆనందబాబు మాట్లాడాడు ఆయన సంస్కారానికి నిదర్శనం.

దోపిడీని విజన్ గా ప్రచారం చేసుకుంటున్నారు..
ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ సొత్తు అయినట్టు మేం తలచుకుంటే వైఎస్ జగన్ రాష్ట్రంలో తిరగలేడని మాట్లాడుతున్నారు. దమ్ముంటే తలచుకోమని సవాల్ చేస్తున్నా.. తెలుగుదేశం పార్టీకి పాలించమని ఐదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే వారికి చేతకాక ఏడాదిలోనే ఓటేసిన ప్రజలతోనే ఛీకొట్టించుకుంటున్నారు. ప్రజా సమస్యలపై వారి పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతోంది. ప్రెస్‌మీట్‌లో అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేక జగన్‌ని తిట్టిపోస్తున్న టీడీపీ నాయకులు పబ్లిక్ డిబేట్‌కి వస్తామని చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో నిజాయతీ కలిగిన పోలీస్ అధికారులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
ప్రభుత్వం చెప్పినట్టు చట్టవిరుద్ధంగా పనిచేయలేక సిద్ధార్థ కౌశల్ వంటి యంగ్ డైనమిక్ ఐపీయస్ అధికారి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. దీని గురించి వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు అసత్యాలను అస్త్రాలుగా చేసుకుని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ తాను మాత్రం ఆర్థికంగా బలపడుతున్నాడు. ఆయన ఎత్తుగడలను వైఎస్సార్‌సీపీ సాగనివ్వదు.
బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో ఇప్పటికే కూటమి పాలన మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాం. పక్క రాష్ట్రాలు 12 శాతం జీఎస్టీ గ్రోత్ రేటును నమోదు చేస్తుంటే చంద్రబాబు మాత్రం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. సంపద సృష్టిస్తానని చెప్పి వికృత ఆలోచనలతో రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తున్నాడు. చంద్రబాబు చేతకానితనానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు మోసాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసులకు భయపడి వైఎస్సార్‌సీపీ ఆపేది జరగదని గుర్తుంచుకోవాలి.