 
													సాక్షి, తాడేపల్లి: భగవద్గీతను కించపరిచిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే టీటీడీ పాలకమండలి సభ్యునిగా తొలగించాలన్నారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే ఇలాంటి వారికి టీటీడీలో సభ్యునిగా కొనసాగిస్తారా?. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చటం సిగ్గుచేటు. ప్రపంచానికే మార్గదర్శకంగా ఉన్న భగవద్గీతను టీడీపీ ఎమ్మెల్యే రాజు కించపరచటం దారుణం’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.
అలాంటి వ్యక్తిని టీటీడీ సభ్యునిగా నియమించటాన్ని ఏం అనాలి?. టీటీడీ చరిత్రలో ఇలాంటి సభ్యుడిని ఎప్పుడూ చూడలేదు. ఇంత జరుగుతున్నా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?. టీటీడీ గోశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని నిర్ణయించటం దారుణం. ఇదేనా టీటీడీ గోసంరక్షణ?. చంద్రబాబుది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే రాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ బీజేపీ కూడా ఎందుకు మాట్లాడటం లేదు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
