
రెండు గంటల్లో 13–15 సెంటీమీటర్ల వర్షం.. చెరువులను తలపించిన ప్రధాన రహదారులు
పలు కాలనీల్లో స్తంభించిన జన జీవనం.. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు
సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల..ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి
సాక్షి, అమరావతి/ విజయపురిసౌత్/ పోలవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం గుంటూరులో కేవలం రెండు గంటల్లో 13 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఒకటి, రెండు అడుగుల మేర నీరు ప్రవహించడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు వంతెనల కింద వర్షం నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కంకరగుంట ఆర్‌యూబీ కింద వర్షం నీరు నిలిచిపోయింది. బృందావన్ గార్డెన్స్, చంద్రమౌళీనగర్, ఏటీ అగ్రహారం, బస్టాండ్ ప్రాంతం, అరండల్‌పేట, బ్రాడీపేట, శ్రీనగర్, బొంగరాలబీడు సహా పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. చంద్రమౌళీనగర్ ఎనిమిదో లైన్‌లో రోడ్డుపై వెళ్తున్న కారుపై భారీ వృక్షం కూలింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పల్నాడు జిల్లా తుర్లపాడులో 5.4, పెదకూరపాడులో 4, గుంటూరు జిల్లా వంగిపురం, కోనసీమ జిల్లా ముక్కామలలో 3.9 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద కొనసాగడంతో అధికారులు 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 2,74,248 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 2,40,313 క్యూసెక్కులు వచ్చి చేరటంతో ఇక్కడ నుంచి మొత్తం 3,22,424 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం సాగర్ జలాశయంలో 307.5790 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరడంతో ఉధృతంగా మారింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 30 మీటర్లకు పైగా నీటిమట్టం ఉండటంతో 48 గేట్ల నుంచి 6.60 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 36.30 అడుగులకు చేరింది.