ప్రైవేటీకరణ అనేదే పెద్ద స్కామ్ అని.. అలాంటి స్కామ్‌ల ఎన్నైనా చేయడానికి చంద్రబాబు నాయుడు ఏనాడూ వెనకడుగు వేయబోరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల సేకరణ ఒక చరిత్ర. ఈ సంతకాలను గవర్నర్‌కు సమర్పించి.. చంద్రబాబు నిర్ణయం పట్ల వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తామని వైఎస్ జగన్ అన్నారు. ‘‘కోటి సంతకాలతో గవర్నర్‌ను కలుస్తాం. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తాం. అవసరమైతే ఈ పత్రాలతో కోర్టు తలుపులు తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం.
న్యాయస్థానం ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉండి.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ అయితే.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇవ్వడం మరో పెద్ద స్కామ్. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాక ఇక ప్రభుత్వం జీతాలు చెల్లించడం ఏంటి?. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది కదా పెద్ద స్కామ్ అంటే!.
కోటి సంతకాల మహోద్యమం చూసైనా చంద్రబాబు సర్కార్ నిర్ణయం మార్చుకోవాలి. లేకుంటే ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం. రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతాం’’ అని జగన్ అల్టమేటం జారీ చేశారు.


