
నగరం మత్తెక్కుతోంది.. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన కొందరు వాటిని తరలించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మత్తులో జోగుతూ వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఫామ్ హౌస్‌లు, పబ్బులు దాటి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం మత్తు పదార్థాల అమ్మకాలకు అడ్డాలుగా మారుతున్నాయి.. ఇదేదో ఉత్తిగనే చెప్పే మాటలు కావు.. ఇటీవల జరిగిన ఘటనలే దీనికి బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పలు రకాల డ్రగ్స్‌తో పాటు మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసే గంజాయి వ్యర్థాలు గుప్పుమంటున్నాయి.! వరుస ఘటనల్లో విద్యార్థులు కేసుల్లో ఇరుక్కుంటూ వెలుగు చూస్తున్న వాస్తవాలు తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇలాంటి డ్రగ్స్‌కు చెక్ పెట్టేదెలా..? విద్యార్థులకు డ్రగ్స్ దూరం చేసేదెలా..? అనే అంశాలపై తలలు పట్టుకుంటున్నారు అధికారులు.
‘ఓపెన్ చేస్తే’.. నగరంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు నిఘా పటిష్టం చేశారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు విద్యార్థులు డ్రగ్స్ సరఫరాలో భాగస్వాములైనట్లు గుర్తించారు. ఏకంగా యూనివర్సిటీకి సరఫరా చేసే డిక్షనరీ మధ్యలో, మట్టిగాజుల మాటున డ్రగ్స్ సరఫరా చేయడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు.
అయితే కొన్ని కొరియర్ సంస్థల నుంచి రెండేళ్లలో సుమారు వంద కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విష సంస్కృతి విద్యార్థులను ఆకర్షించడం, భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆందోళన కలిగించేలా..
నగర యువత గంజాయి, డ్రగ్స్ బాధితులగా మారిపోతున్నారన్న అంశం ఆందోళన కలిగిస్తోంది. పబ్స్ మొదలు ఇంటర్, డిగ్రీ, వర్సిటీ హాస్టల్స్‌ను డ్రగ్స్ అడ్డాలుగా మార్చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తున్న యువత వరకూ ఎంతో మంది మత్తుకు బానిసైపోతున్నారు. స్టైల్, ఫ్యాషన్ అంటూ మద్యం సేవించడం మొదలు డగ్స్ర్ వైపు అడుగులు వేసే విషసంస్కృతి వేళ్లూనుకుంటోంది.
ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడితే సమాజంలో తలెత్తుకోలేని విధంగా, నేరస్తులుగా ముద్ర వేసుకుంటున్నారు. పని ప్రదేశాల్లో, తరగతిగదుల్లో స్వేచ్ఛగా ఉండాల్సిన యువత కటకటాల వెనుక ఊచలు లెక్కబెడుతున్నారు. సమాజానికి, కుటుంబానికి శత్రువులుగా మారిపోతున్నారు. క్షణికానందం కోసం జీవితాంతం పలు మానసిక రుగ్మతలకు, రోగాలకు, మెదడు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.
నగరంలో పెరుగుతున్న
డ్రగ్ అడిక్షన్స్ డీ–అడిక్షన్ సెంటర్లకు..
ఒక దఫా అలవాటుపడితే డ్రగ్స్ మహమ్మారి నుంచి తప్పించుకోవడం అంత సులువేంకాదని నిపుణులు చెబుతున్నారు. దీనిని నుండి బయట పడడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలోని డీ–అడిక్షన్ సెంటర్‌కు భారీ సంఖ్యలో బాధితులు చేరుతున్నారు.
ఒక్క ఆగస్టు నెలలోనే మద్యం, గంజాయి, మత్తు పదార్థాల భారి నుంచి విముక్తి కోసం 612 మంది డీ–అడిక్షన్ కేంద్రానికి వచ్చారని అధికారిక నివేదికలు చెబుతున్నాయంటే మహమ్మారి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
యాంటీ సోషల్ పర్సన్‌గా మారతారు..
మద్యం తాగే వారితో పోలి్చతే డ్రగ్స్, గంజాయి బాధితులు వేంగంగా బానిసలైపోతారు. మానసిక ఆస్పత్రికి పాలీసబ్‌స్టెన్స్ కేసులు అధికంగా వస్తున్నాయి. సమయానికి డ్రగ్స్ దొరక్కపోతే పిచి్చవారిగా ప్రవర్తిస్తారు. విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఏమీ లేకున్నా ఎవరో వస్తున్నారని భయపడటం, ఆందోళన, అనుమానాలు, అపోహలు ఎక్కువగా ఉంటాయి.
నిద్ర పట్టదు. ఇటువంటి వారి కుటుంబాల్లో గృహ హింస ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలకే అబద్దాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, నిబంధనలు పాటించకపోవడం, రఫ్‌గా వ్యవహరించడం, వైలెంట్‌గా మారిపోవడం జరుగుతుంది. ఇటువంటి వారితో చాలా ప్రమాదం. సామాజిక వ్యతిరేక వక్తిత్వానికి అలవాటుపడతారు.
– డాక్టర్ ఆర్ అనిత, ఎర్రగడ్డమానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్
అవార్డింగ్ హార్మోన్స్‌తో ప్రమాదం..
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో అవార్డింగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో వ్యక్తి నేను చాలా గొప్పవాడిననే ఫీలింగ్‌లో ఉంటాడు. నేను ఏం చేసినా, ఏం మాట్లాడినా నాకు ఎదురు లేదనే ఓవర్ కాని్ఫడెన్స్‌లోకి వెళతాడు. ప్రవర్తనలోనూ విపరీత ధోరణి కనిపిస్తుంది. క్షణికానందం కోసం వెంపర్లాడతాడు. ఆ వెంటనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. డ్రగ్స్‌లో ఉండే కెమికల్స్ మెదడులోని న్యూరాన్స్‌పై తీవ్రపభ్రావం చూపిస్తాయి. నెమ్మదిగా జ్ఞాపకశక్తి నశిస్తుంది. తీవ్ర ఒత్తిడి, భయం, ఆందోళనకు గురవుతాడు. హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి. ఫిట్స్, బీపీ వంటివి వచ్చే అవకాశం ఉంది.
స్నేహితులతో కలసి తొలిసారి ఏదో సరదాగా రుచి చూద్దామనుకుంటే.. చివరికి మానుకోలేని వ్యసనంగా మారిపోతుంది. ఇటువంటి వాటిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు సైతం పిల్లల ప్రవర్తన, నడవడికపై దృష్టిసారించాలి. డగ్ర్ దొరక్కపోతే ఆత్మహత్య ఆలోచనలకు వెళ్లిపోతారు. ప్రతి ఒక్కరినీ అనుమానించడం, పరిస్థితులను సక్రమంగా అర్థం చేసుకోలేకపోవడం, ఎదుటివారి మాటలను అంచనా వేయలేకపోవడం, సెల్ఫ్ జడ్జిమెంట్ చేకపోవడం దీని ప్రధాన లక్షణాలు.
– డాక్టర్ బీ వెంకట నాని కుమార్, జనరల్ సర్జన్