
ప్రపంచ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తే ఘటన ఎర్ర సముద్రంలో చోటు చేసుకుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఉన్న అండర్‌సీ ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లు ఇటీవల తెగిపోవడంతో భారత్, పాకిస్తాన్, యూఏఈ సహా ఆసియాలోని పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. అయితే.. ఆ కేబుల్స్ ఎందుకు తెగిపోయాయో అనేదానిపై నిపుణులు ఓ అంచనాకి వచ్చారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈ విఘాతం వాణిజ్య నౌకల రాకపోకల వల్లే జరిగి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నౌకలు సముద్రంలో యాంకర్ వదిలినప్పుడు.. అవి అడుగున ఉన్న కేబుళ్లను లాగడంతో తెగిపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ కేబుల్ రక్షణ కమిటీ నివేదిక ప్రకారం.. ప్రతీ ఏటా యాంకర్ల (dragged anchors) వల్లే ప్రపంచవ్యాప్తంగా 30% కేబుల్ విఘాతాలు ఇలాగే జరుగుతున్నాయి. పైగా..
తాజాగా తెగిన కేబుల్స్ ఎర్ర సముద్రం మరియు ఆఫ్రికా–అరబ్ ద్వీపకల్పం మధ్య ‘బాబ్ ఎల్ మందెబ్ స్ట్రెయిట్’ అనే వ్యూహాత్మక ప్రాంతంలోనే ఉంది. అయినప్పటికీ ఇక్కడ సముద్రపు లోతు తక్కువగా ఉండడం వల్ల యాంకర్లు కేబుళ్లను తాకే అవకాశం ఎక్కువ ఉందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తాజా ఘటనలో SMW4, IMEWE, FALCON GCX, EIG వంటి కీలక కేబుళ్లు ప్రభావితమయ్యాయి. వీటి ద్వారా ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మధ్య డేటా ట్రాఫిక్ జరుగుతుంది. దీంతో సంబంధిత దేశాల్లో స్లో కనెక్టివిటీ, అధిక ల్యాటెన్సీ వంటి సమస్యలు తలెత్తాయి. అయితే మైక్రోసాఫ్ట్ అజూర్, ఎటిసలాట్, డీయూ ట్రాఫిక్‌ను రీరూట్ చేసి తమ సేవలను కొనసాగిస్తున్నాయి.
ఇక, ఈ విఘాతం వెనుక ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలు(హౌతీ రెబల్స్ పనేనా?) కారణమనే అనుమానాలు మొదట వ్యక్తం అయ్యాయి. అయితే, హౌతీలు తమ ప్రమేయాన్ని ఖండించారు. యెమెన్ ప్రభుత్వం మాత్రం ఈ దాడులను డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఉద్దేశపూర్వక దాడులుగా అభివర్ణించింది. ‘‘ఇప్పుడు ఎర్ర సముద్రంలో జరుగుతున్నది ప్రపంచ సమాజానికి హెచ్చరికగా ఉండాలి… ఆధునిక ప్రపంచానికి ప్రాణవాయువులాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించాల్సిన అవసరం ఉంది’’ అని యెమెన్ అధికారిక సమాచార శాఖ మంత్రి మొఎమ్మర్ అల్-ఎర్యానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేబుళ్ల మరమ్మతులకు స్పెషలైజ్డ్ నౌకలు, సాంకేతిక నిపుణులు అవసరం. దీంతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా సరఫరాలో సముద్ర గర్భ (Undersea/Subsea) ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. దాదాపు 99% కి పైగా అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ కేబుల్స్ ద్వారానే ప్రసారం అవుతోంది. ఖండాల మధ్య డేటా ప్రసారం చేసే అత్యంత వేగవంతమైన, విశ్వసనీయమైన మార్గం. తాజా గణాంకాల ప్రకారం.. 485 కేబుల్స్ ప్రపంచ సముద్ర గర్భంలో విస్తరించి ఉన్నాయి. వీటి పొడవు 9 లక్షల మైళ్లకు పైగా ఉంటుంది. ఎర్ర సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఫసిఫిక్ మహాసముద్రం, సుయాజ్ కాలువలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో కేబుల్ టెరాబిట్స్/సెకనుకు డేటా ప్రసారం చేయగలదని అంచనా. అంటే, కొన్ని సెకన్లలోనే లక్షల వీడియోలు, మెసేజులు పంపగల సామర్థ్యం.
ఉపగ్రహాల కంటే ఎందుకు మెరుగైనవంటే.. బ్యాండ్‌విడ్త్ ఎక్కువ, ల్యాటెన్సీ తక్కువ. అలాగే కాస్ట్-ఎఫెక్టివ్‌తో పాటు సురక్షితమైన డేటా మార్గంగా పేరు దక్కించుకుంది. ఉపగ్రహాలు ప్రధానంగా దూర ప్రాంతాల కోసం కాగా.. ప్రధాన డేటా మార్గం మాత్రం సముద్ర గర్భ కేబుల్స్‌గానే కొనసాగుతోంది.